పాశమైలారం  ఘటనలో చనిపోయిన వారికి కోటి నష్ట పరిహారం
x

పాశమైలారం ఘటనలో చనిపోయిన వారికి కోటి నష్ట పరిహారం

సిగాచి కంపెనీ వెల్లడి


సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడ సిగాచి ఫ్యాక్టరీలో జరిగిన బ్లాస్ట్ ఘటనలో చనిపోయిన వారికి కోటి రూపాయలను ప్రకటిస్తూ సిగాచి యాజమాన్యం ప్రకటించింది. సోమవారం ఉదయం బ్లాస్ట్ జరిగి 40 మంది చనిపోయారని, 33 మంది గాయపడ్డారని యాజమాన్యం ప్రకటించింది. చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయల నష్ట పరిహారం అందిస్తామని, గాయాలకు గురైన వారికి మెరుగైన వైద్య సాయం అందించడమే గాక అన్ని విధాల ఆదుకుంటామని యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది.

ప్రభుత్వ నివేదిక కోసం..

బ్లాస్ట్ జరిగడానికి రియాక్టర్ కారణం కాదని, ఈ ఘటనపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ చేస్తుందన్నారు. ప్రభుత్వం ఇచ్చే నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్టు యాజమాన్యం పేర్కొంది.సిగాచి కంపెనీ తరపున సెక్రెటరీ వివేక్ స్టాక్ మార్కెట్లకు లేఖ రాశారు. మూడు నెలల వరకు ఫ్యాక్టరీలో ఎలాంటి కార్యకలాపాలను నిర్వహించ కూడదని ని ర్ణయించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక వాడలో జరిగిన బ్లాస్ట్ ఇప్పటివరకు జరిగిన పేలుళ్లలో అతి పెద్దదని అధికారులు తెలిపారు. ఇంత భారీ ప్రాణ నష్టం తెలంగాణలో మునుపెన్నడూ జరగలేదు. పేలుడు ధాటికి సిగాచి మూడంతస్తుల భవనం కూలిపోయింది.

మొదటి రోజు 14 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. చనిపోయిన వారి సంఖ్య, గాయపడ్డవారి సంఖ్య ఖచ్చితంగా తేలలేదు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు ఆఘ మేఘాల మీద సిగాచి ఫ్యాక్టరీకి చేరుకుని తమ వాళ్లను వెతికారు. చనిపోయిన వారిలో, గాయాల పాలైనవారిలో తమ వాళ్లు కనిపించలేదు. దీంతో ఘటనా స్థలిలో బాధితుల ఆర్తనాదాలు మిన్నుముట్టాయి. మొదటి రోజు చనిపోయిన వారి సంఖ్య కోసం మంత్రులు ఆరా తీసినప్పటికీ ఫలితం లేకపోయింది.

ఎంతమంది చనిపోయారు, ఎంతమంది శిథిలాల క్రింద చిక్కుక్కున్నారు అనేది తేలడం లేదని బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. హరీష్ రావ్ ఆరోపణలతో రాజకీయంగా హీటెక్కింది. రెండో రోజు స్పాట్ కు ముఖ్యమంత్రి చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యంతో బుధవారం కంపెనీ నష్ట పరిహారాన్ని ప్రకటించింది. కంపెనీ ప్రకటించిన కోటిరూపాయలు బాధితులకు కొంత వరకు ఉపశమనం లభించినప్పటికీ తమ వాళ్లు లేని లోటు ఎవరూ పూడ్చలేనిది.

Read More
Next Story