సింగరేణి ‘నైనీ’తో ఊపిరి పీల్చుకున్నదా ?
x
Naini coal block

సింగరేణి ‘నైనీ’తో ఊపిరి పీల్చుకున్నదా ?

నైనీ బొగ్గు గని సింగరేణి సొంతం అవటం ఇపుడున్న పరిస్ధితుల్లో యాజమాన్యానికి పెద్ద రిలీఫనే చెప్పాలి. నైనీ పని ప్రారంభమైందంటే మరో 30 ఏళ్ళ వరకు ఎలాంటి ఢోకా ఉండదు.


నిజం చెప్పాలంటే సింగరేణి సంస్ధ క్లిష్ట దశలో ఉంది. చేతిలో ఉన్న 40 గనుల్లో బొగ్గు నిల్వలు అయిపోతున్నాయి. మహాయితే మరో 10-15 ఏళ్ళకన్నా బొగ్గు తవ్వకాలు జరిగే అవకాశాలు లేవు. ఇపుడు సింగరేణి ప్రతి ఏడాది సుమారు 70 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తిచేస్తోంది. ఈ స్పీడులో వెళితే చేతిలో ఉన్న అన్నీ గనుల్లోను 15 ఏళ్ళల్లోనే బొగ్గు నిల్వలు అయిపోతాయి. ఆ తర్వాత సింగరేణి మూతపడాల్సిందే. అందుకనే వేలంపాటల పద్దతిలో కూడా సింగరేణి గనులన్నింటినీ సింగరేణికే కేటాయించాలని యాజమాన్యంతో పాటు ప్రభుత్వం కేంద్రప్రభుత్వాన్ని అడుగుతోంది.

సింగరేణి, ప్రభుత్వం విజ్ఞప్తులకు నరేంద్రమోడి ప్రభుత్వం సానుకూలంగా స్పందించటంలేదు. స్పందిస్తున్న ఆశలు కూడా పెద్దగా లేవు. ఈ దశలోనే సింగరేణికి మరో పెద్ద గని దొరికింది. దొరికింది అంటే 2015-16లో ఒడిస్సా రాష్ట్రంలో జరిగిన వేలంపాటల్లో సింగరేణి సదరు గనిని సొంతంచేసుకున్నది. అన్నీ సమస్యలను దాటుకుని, అనుమతులను తెచ్చుకునేటప్పటికి ఇంతకాలమైంది. విషయం ఏమిటంటే ఒడిస్సాలోని 913 హెక్టార్లలో విస్తరించిన నైని అనే ప్రాంతంలోని బొగ్గు గనికి వేలంపాట జరిగింది. చాలా సంస్ధలు పాల్గొన్న ఆ వేలంపాటలో సింగరేణి కూడా పాల్గొని గనిని సొంతం చేసుకున్నది. పర్యావరణ, అటవీ, భూ సేకరణ, గ్రామాన్ని ఖాళీ చేయించి జనాలకు పునరావాసం కల్పించటం లాంటి అనేక అడ్డంకులను దాటుకున్నది.

తెలంగాణా ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒడిస్సాకు వెళ్ళి ముఖ్యమంత్రి మాంఝీని కలిసి సహకారానికి ధన్యవాదాలు చెప్పారు. 917 హెక్టార్లను వెంటనే సింగరేణికి కేటాయించాలని విజ్ఞప్తిచేశారు. ఈ వ్యవహారం కూడా తొందరలోనే పూర్తవ్వబోతోంది. ఒకసారి భూమి మొత్తం సింగరేణికి సొంతమైపోయిందంటే వెంటనే బొగ్గు తవ్వకాలు మొదలుపెట్టేందుకు యాజమాన్యం చర్యలు తీసుకుంటోంది. నైనీ బొగ్గుగని నుండి ఏడాదికి కోటి టన్నుల బొగ్గును ఉత్పత్తిచేసేందుకు యాజమాన్యం రెడీగా ఉంది. దేశంలో బొగ్గు అవసరమైన తమిళనాడు, కర్నాటక, ఏపీ, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాలకు బొగ్గును సరఫరా చేయటానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. అలాగే సొంతవసరాలకు కూడా బొగ్గును ఉపయోగించుకోబోతోంది. సొంతవసరాలంటే సింగరేణి ఆధ్వర్యంలో ఇఫ్పటికే 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పనిచేస్తోంది. దీనికి అదనంగా నైని బొగ్గు గని ఆధారంగా మరో 1600 మెగావాట్ల విద్యుత్ సామర్ధ్యంతో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటుచేయబోతోంది.

యాజమాన్యం నిర్ణయంవల్ల బొగ్గు కొరత కొంత తీరుతుంది అలాగే విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. నైనీ బొగ్గు గని సింగరేణి సొంతం అవటం ఇపుడున్న పరిస్ధితుల్లో యాజమాన్యానికి పెద్ద రిలీఫనే చెప్పాలి. నైనీ బొగ్గు గనిలో పని ప్రారంభమైందంటే మరో 30 ఏళ్ళ వరకు ఎలాంటి ఢోకా ఉండదు. నైనీలో సుమారుగా 100 కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలున్నాయి. ఇలాంటి బొగ్గుగనులు మరో ఐదారు గనుక సింగరేణి సొంతమైతే తక్కువలో తక్కువ 70-80 ఏళ్ళవరకు సంస్ధ మనుగడకు ఇబ్బంది ఉండదు. నిజానికి సింగరేణి చేతిలో కొత్తగా 15 గనులవరకు ఉన్నాయి. అయితే వీటన్నింటినీ నరేంద్రమోడి ప్రభుత్వం సొంతం చేసేసుకున్నది. 2015కి ముందున్న సింగరేణి గనులన్నింటినీ మోడి ప్రభుత్వం తీసేసుకుని వేలంపాటల ద్వారా మాత్రమే గనులను సొంతం చేసుకోవాలనే నిబంధన తెచ్చింది. దాంతో సింగరేణి యాజమాన్యం ఇబ్బంది పడుతోంది. ఇలాంటి నేపధ్యంలోనే నైని గనిలో పనులు తొందరలోనే మొదలవ్వబోతున్నాయి. దాంతో యాజమాన్యం కాస్త ఊపిరి పీల్చుకున్నట్లయ్యింది.

Read More
Next Story