
కల్పన ఆత్మహత్యాయత్నం.. అసలేం జరిగింది!
ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, భయపడాల్సిన అవసరం ఏంలేదని తెలిపారు వైద్యులు.
ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం చేశారు. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. కాగా ఆమె ఆత్మహత్యాయత్నానికి ఎందుకు పాల్పడ్డారు అనేది ఇంకా తెలియలేదు. కల్పన నిజాంపేటలోని వర్టెక్స్ ప్రీ విలేజ్ గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్నారు. రెండు రోజులుగా వారి ఇంటి తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది.. అసోసియేషన్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే అలెర్ట్ అయిన అసోసియేషన్.. ఆమెతో మాట్లాడటానికి ఫోన్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఎటువంటి స్పందనా రాకపోవడంతో.. ఈ విషయాన్ని భర్తకు తెలియజేశారు. ఈ క్రమంలో కల్పనతో మాట్లాడటానికి ఆయన చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. దీంతో అసోసియేషన్ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. దీంతో పెట్రోలింగ్‌కు వచ్చిన పోలీసులు.. కల్పన ఫ్లాట్ తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్లారు. కాగా అక్కడ కల్పన స్పృహ లేకుండా పడి ఉండటం చూసి ఆమెను హుటాహుటిన నిజాంపేటలోని హోలిస్టిక్ ఆసుపత్రికి తరలించారు.
ఈరోజు ఆమె ఆరోగ్యంపై వైద్యులు హెల్త్‌బులెటిన్ విడుదల చేశారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, భయపడాల్సిన అవసరం ఏంలేదని తెలిపారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని, ప్రాణాపాయం నుంచి కల్పన బయటపడ్డారని వైద్యులు వివరించారు. ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చిన వెంటనే స్టమక్ వాష్ చేశామని, ఆ తర్వాత ఐసీయూకి షిఫ్ట్ చేశామని వైద్యులు వివరించారు. ఆమె మింగిన నిద్ర మాత్రల ప్రభావం ప్రస్తుతం లేదని చెప్పారు. కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉందని, ఆక్సిజన్ పెట్టి చికిత్స కొనసాగిస్తున్నామని వైద్యులు చెప్పారు.
పెద్దకుమార్తే కారణమా..
అయితే కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి పెద్దకూతురే కారణమన్న ప్రచారం జోరందుకుంది. పెద్దకూతురు తన దగ్గరకు రావడానికి అయిష్టత చూపడంతో మనస్తాపానికి గురైనా కల్పన ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు సినీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కల్పన పెద్ద కుమార్తె కేరళలో ఉంటుంది. కల్పన హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. మంగళవారం కల్పన తన కూతురుకు ఫోన్ చేసి హైదరాబాద్ రావాలని కోరింది. అందుకు ఆమె కూతురు నిరాకరించింది. ఈ విషయంపైనే వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని పోలీసులు తమ ప్రాథమిక దర్యాప్తు గుర్తించారు. ఆ తర్వాత సుమారు సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో కల్పనకు ఆమె భర్త ఫోన్ చేశారని, ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలుకొట్టి కల్పనను ఆసుపత్రిలో చేర్పించారు.
అయితే ఉన్నట్లుండి కూతురును హైదరాబాద్ రావాలని కల్పన ఎందుకు కోరారు? అందుకు ఆమె కూతురు ఎందుకు నిరాకరించింది? అనేది ప్రస్తుతం కీలకంగా మారాయి. ఆ కోణంలో దర్యాప్తును కొనసాగించనున్నట్లు పోలీసు వర్గాల నుంచి అందుతున్నా సమాచారం.
కల్పన కూతురు స్టేట్‌మెంట్ రికార్డ్
ఆమె కూతురు కేరళ వెళ్లి ఉంటున్న విషయంలో కుటుంబ కలహాలు ఉధృతమయ్యాయి. కల్పన ఆత్మహత్యాయత్నం చేసిన క్రమంలో ఆమె కూతురు స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు పోలీసులు. దీని ప్రకారం.. కేరళలో చదువుతున్న మొదటి భర్త కూతురును చదువు హైదరాబాద్ లో కొనసాగించాలని కల్పన పలుమార్లు చెప్పారని, అయినా అందుకు కూతరు అంగీకరించడం లేదు. దీంతో మనస్థాపం వల్లనే నిద్ర మాత్రలు వేసుకున్నట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు.