
సింగిల్ టీచర్ స్కూళ్లలో తెలంగాణ ఆరో స్థానం... ఈ జబ్బుకు మందు లేదా?
పదేళ్లుగా ముదురుతున్న జబ్బు...
విద్య లేనిదే ఈదేశ పిడిత వర్గాలకు విముక్తి లేదన్నాడు మహాత్మా జ్యోతి రావు ఫూలే. ఈ దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దు కుంటుంది అన్నాడు విద్యావేత్త కొఠారి. విద్య ద్వారా పీడిత వర్గాలకు విముక్తి కలగాలన్న, దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకోవాలన్నా పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలి. మరి అందుతున్నదా?
విద్య నేర్పించేందుకు పాఠశాల ఉంటే చాలదు.పాఠశాలలో, పాఠశాల చుట్టూ అక్షర జ్ఞానానికి, అపైన జ్ఞాన సముపార్జనకు అనువైన వాతావరణం ఉండాలి. పాఠశాలకు భవనమెంత అవసరమో చదువు చెప్పేందుకు ఉపాధ్యాయులు అంత అవసరం. అయితే, తెలంగాణలో టీచర్ల కరువు ఉంది. ఒకే టీచర్ ఉన్న పాఠశాలలు చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రతి తరగతి బోధించేందుకు లేదా ప్రతి సబ్జక్టు బోధించేందుకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. అలా లేదు. విద్యకు బీజం పడే వయసులో పిల్లలకు చదువు చెప్పే టీచర్ మీద మోయలేని భారం పడుతూ ఉంది.అంటువంటి వాతావరణ విద్యార్థుల మనసులో అక్షరాలు ఎలా నాటుకుపోతాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన పదేళ్లయినా ఈ బబ్బుకు సరైన వైద్యం కరువయింది.
తరగతిగదికి ఒక ఉపాద్యాయుడు ఉండాల్సిన చోట స్కూలుకు మొత్తంగా ఒక ఉపాధ్యాయుడేఉంటున్నాడు. ఈ స్కూళ్లే ఏకోపాధ్యాయ పాఠశాల(Single Teacher Schools). ఇవి నాణ్యమయినవిద్యకు సంకేతం కాదు. మన విద్యావ్యవస్థ పట్టిన ఖాయిలాకు సూచన. దేశం 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ కలకంటున్నది. తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ కావాలని ఉవ్విళ్లూరుతున్నది. ఇలాంటపుడు దేశవ్యాపితంగా 1.7 లక్షల సింగిల్ టీచర్ స్కూళ్లున్నాయి. ఈ పాఠశాలలకొచ్చేది పేదల పిల్లలు. వాళ్లకి చదవు మక్కువ పెరిగే వాతావరణం సింగిల్ టీచర్ స్కూళ్లలో తక్కువ. తెలంగాణలో 5వేల పైబడి ఉన్నాయి. ఈ స్కూళ్లు అందించే విద్యతో దేశం ముందుకు పోగలదా? ట్రిలియన్ డాలర్ ఎకనామీ అనుకుంటే సరిపోతుందా. ఈ లొసుగులన్నీ పూరించాలిగా.
సింగిల్ టీచర్ స్కూళ్లు
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 26వేలకు పైగా ప్రభుత్వపాఠశాలలు ఉంటే అందులో 5,821 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. అంటే రాష్ట్రంలో 21శాతం పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా నడుస్తున్నాయి. దేశంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ఆరవ స్థానంలో ఉండడం చూస్తుంటే మన రాష్ట్రపాలకులకు పాఠశాల విద్యా మీద ఉన్న శ్రద్ధ ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు.దేశవ్యాప్తంగా మొత్తం 1,10,971ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. ఇది దేశంలోనే మొత్తం పాఠశాలలో 10శాతం ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయ. దేశంలో ఏకోపాధ్యాయ అధికంగా ఉన్న తొలి ఆరు రాష్ట్రాలు తీసుకుంటే మధ్యప్రదేశ్ లో - 15,432 పాఠశాలలు, ఆంధ్రప్రదేశ్ లో -11,409 పాఠశాలలు, రాజస్థాన్ లో -9,403 పాఠశాలలు,జార్ఖండ్ లో -6,938 పాఠశాలలు, కర్ణాటకలో -6,790 పాఠశాలలు,తెలంగాణ లో -5,821 పాఠశాలలు ఉన్నాయి.దేశంలో పెద్ద రాష్ట్రాలు అయినా తమిళనాడు, గుజరాత్, బీహార్, ఉత్తరప్రదేశ్, పోల్చితే తెలంగాణలోనే అత్యధిక ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి.
18 సబ్జక్టులు బోధించాలి
ఏకోపాధ్యాయ పాఠశాలలు అంటే ఒక్క ఉపాద్యాయుడు మాత్రమే ఉన్న పాఠశాలలు. ఏకోపాధ్యాయ పాఠశాలలు అన్ని కూడ ప్రాథమిక పాఠశాలలే. ప్రాథమిక పాఠశాలలో 1నుండి 5 వరకు తరగతులు ఉంటాయి. ఒకటి రెండు తరగతులకు ఆరు సబ్జెక్టులు, మూడు నుండి ఐదు తరగతులకు కలిపి పన్నెండు సబ్జెక్టులు ఉంటాయి. అంటే ఒకటి నుండి ఐదు తరగతులవరకు మొత్తం 18 సబ్జెక్టులు ఉంటాయి. ఏకోపాధ్యాయ పాఠశాలలో ఒక్క ఉపాధ్యాయుడే రోజుకు పాఠశాల సమయంలో ఉండే ఎనిమిది పీరియడులలో 18 సబ్జెక్టులు బొందించాలి. ఇది ఎలా సాధ్యం.ఇలాంటి పరిస్థితులలో ఉపాధ్యాయుల నుండి నాణ్యమైన విద్యను ఎలా ఆశిస్తాము? ఏకోపాధ్యాయ పాఠశాలలో ఉపాధ్యాయుడు ప్రతి తరగతికి తగినంత సమయం కేటాయించడం అసాధ్యం. దీని వలన ఏ తరగతి విద్యార్థులకు సమగ్రమైన, నాణ్యమైన విద్యా అందదు. ఒక్క ఉపాధ్యాయుడే అన్ని సబ్జెక్టులు బోదించాల్సి రావడంతో ఏ సబ్జెక్ట్ లోనూ లోతైన జ్ఞానంను అదించలేడు.
ప్రతి విద్యార్ధికి విభిన్న అభ్యసన సామర్ధ్యాలు, అవసరాలు ఉంటాయి. ఏకోపాధ్యాయ పాఠశాలలో, ఉపాద్యాయుడు పెద్ద సంఖ్యలో విద్యార్థులను, తరగతులను నిర్వహించాల్సి రావడం వలన ప్రతి విద్యార్థిపై వ్యక్తి గత శ్రద్ధ పెట్టడం కష్టం అవుతుంది. దీని వలన నెమ్మదిగా నేర్చుకునే విద్యార్థులు వెనుకబడిపోయే అవకాశం ఉంది.
విద్యార్థులను ఉత్తేజ పరిచే వాతావరణం ఉండదు
ఏకోపాధ్యాయ పాఠశాలలో సరైన అభ్యసన వాతావరణం లేకపోవడం, ఉపాద్యాయుడు అందరిపైన దృష్టి పెట్టలేకపోవడం వల్ల విద్యార్థులు పాఠశాలపైన ఆసక్తి కోల్పోయి పాఠశాలకు రావడం మానివేసే ప్రమాదం ఉంటుంది.
ఏకోపాధ్యాయ పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయులు అపారమైన పని భారాన్ని మోయాల్సి వస్తుంది. ఓకే ఉపాద్యాయుడు అనేక తరగతులు బోధించడంతో పాటు, పాఠశాల నిర్వహణ, మధ్యాహ్నభోజనం పర్యవేక్షణ, రికార్థుల నిర్వహణ, ప్రభుత్వాల పథకాల అమలు వంటి అనేక ఇతర బాధ్యతలను కూడ నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ పని భారం మానసికంగా, శారీరకంగా ఉపాధ్యాయులను అలసిపోయేలా చేస్తుంది. ఇదే కాకుండా ఉపాధ్యాయులు అనారోగ్యం కారణంతో సెలవు పెట్టిన, కాంప్లెక్స్ సమావేశాలకు హాజరైన పాఠశాలలు ముసివేయ్యాల్సిన పరిస్థితి వస్తుంది.దీనితో ఉపాధ్యాయులు బోధనపైన సరైన దృష్టిపేట్టలేరు.అంతిమంగా విద్యార్థులు నాణ్యమైన విద్యా అందక నష్టపోతారు.
ఇప్పటికి ప్రాథమిక పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడంలో ప్రభుత్వానికి శాస్త్రియమైన ప్రణాళిక లేదు. ఐదుగురు టీచర్లకు బదులు ఒకే టీచర్ ఉన్న పాఠశాలలు 5,821.ఇద్దరు లేదా ముగ్గురు ఉన్న ఉన్న పాఠశాలల సంఖ్య 14,973.ఐదు గదులు ఉండవలసిన చోట మూడు కన్నా తక్కువ గదులు ఉన్న పాఠశాలలు 12760.ఇది చాలదు అన్నట్లు ఇటీవల విద్యాశాఖ పాఠశాలలో ఉపాధ్యాయులను సర్దుబాటు చెయ్యడానికి గత ప్రభుత్వంలో నిలిపివేసిన జీవో 25ను తెరపైకి తెచ్చి 60 లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలకు ఇద్దరి కంటే ఎక్కువ ఉపాధ్యాయులను ఇచ్చేది లేదని తేగేసి చెప్పింది. దీనితో మరిన్ని పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మరే ప్రమాదం ఉంది.
ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యా అందాలి అంటే అన్ని ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక విద్యను బోదించాలి. విద్యాశాఖ విడుదల చేసిన ఉపాధ్యాయుల సర్దుబాటు ఉత్తర్వులను తక్షణమే విరామించుకోవాలి. విద్యార్థుల సంఖ్య 20లోపు ఉంటే ఇద్దరు ఉపాధ్యాయులను, ఆ తరువాత ప్రతి 20విద్యార్థులకు ఒక టీచర్ ను నియమించాలి. విద్యార్థుల సంఖ్య 100దాటితే ఒక ప్రధానోపాధ్యాయుడిని నియమించాలి.రాష్ట్ర బడ్జెట్ లో కనీసం 20శాతం నిధులు కేటాయించాలి.విద్యారంగం మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెడితేనే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ రైజింగ్ 2047 కార్యక్రమంలో విద్యారంగం కూడ అన్ని రంగాలతో పాటు అభివృద్ధి సాధించి మొదటి స్థానంలో ఉంటుంది. లేకపోతే ప్రభుత్వ విద్యారంగం మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది.