మాజీ ఐపీఎస్ తెలివి ఇలా ఉపయోగపడుతోంది
x
Former chief of Telangana Intelligence Bureau Prbhakar Rao

మాజీ ఐపీఎస్ తెలివి ఇలా ఉపయోగపడుతోంది

మొత్తానికి చట్టాన్ని అమలుచేయాల్సిన అధికారే చట్టాన్ని మీరి చేయకూడని పనులు చాలానే చేశారు.


చెట్టుముందా విత్తు ముందా అనే సమస్యతో సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) అధికారులు తలలు పట్టుకుంటున్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు ఒక కొలిక్కి రావాలంటే ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరవ్వాలి. ప్రభాకర్ రావును విచారించనిదే టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఒక కొలిక్కి తెచ్చేందుకు సాధ్యంకాదు. ప్రభాకర్ విదేశాల్లో కూర్చున్నారు. ఇప్పుడిప్పుడే హైదరాబాద్ కు వచ్చేట్లు కనబడటంలేదు. ఆయన వస్తే కాని విచారణ పూర్తికాదు. విచారణ పూర్తయితే కాని ట్యాపింగ్ లో అసలు సూత్రదారులెవరో తేలదు. మొత్తానికి చట్టాన్ని అమలుచేయాల్సిన అధికారే చట్టాన్ని మీరి చేయకూడని పనులు చాలానే చేశారు.

టెలిఫోన్ ట్యాపింగ్ విచారణను ఎలా ముందుకు తీసుకుపోవాలో ఉన్నతాధికారులకు అర్ధంకావటంలేదు. ఇంతకీ ప్రభాకరరావు ఎవరంటే కేసీయార్ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఐపీఎస్ ఉన్నతాధికారి. కేసీయార్ కు కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ ఈ ఐపీఎస్సే అన్నట్లుగా వ్యవహరాలు సాగింది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కేసీయార్ అధికారంలో ఉన్నపుడే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు తమ మొబైల్ ఫోన్లు ట్యాప్ అవుతున్నట్లు చాలా గోలచేశారు. అయితే వాళ్ళని అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో వెంటనే అప్పట్లో చేసిన ఆరోపణలకు ప్రాధాన్యత పెరిగింది. దానికితోడు రేవంతే సీఎం అవ్వటంతో ట్యాపింగ్ ఆరోపణలపై దృష్టిపెట్టారు.

ఇంతలో ఏదో కేసును విచారిస్తున్న పోలీసులకు టెలిఫోన్ ట్యాపింగ్ విషయం తీగలాగ తగిలింది. దాంతో వెంటనే ప్రభుత్వం సీరియస్ గా దృష్టిపెట్టింది. ఒక్కో విషయం వెలుగుచూస్తుండటంతో ప్రత్యేకంగా సిట్ ను నియమించింది. అప్పటినుండి విచారణలో వేగం అందుకుంది. విచారణలో సిట్ ఉన్నతాధికారులు వేగం పెంచటంతో డీఎస్పీ ప్రణీత్ రావు తగులుకున్నారు. ఆయనిచ్చిన సమాచారం ఆధారంగా అడిషినల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతిరావు, వినోద్ రావు తగులుకున్నారు. వీళ్ళతో పాటు చాలామంది సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్ళను కూడా సిట్ అరెస్టుచేసింది. ఎంతమందిని అరెస్టుచేసినా, ఎంత విచారించినా అందరు చెప్పింది ఒకటే. అదేమిటంటే తమ పై అధికారులు చెప్పినట్లే తాము చేశామని. అలా పైపైకి వెళ్ళిన దర్యాప్తు అధికారులకు చివరగా కనబడిన ఉన్నతాధికారి ఎవరంటే ప్రభాకరరావు. ఇంటెలిజెన్స్ వింగ్ లో ఆయనకు మించిన ఉన్నతాధికారి ఎవరూ లేరు. ప్రభాకర్ డైరెక్టుగా కేసీయార్ కు మాత్రమే రిపోర్టు చేసేవారు.

ఎప్పుడైతే ట్యాపింగ్ ఆరోపణలపై విచారణ మొదలైందో వెంటనే ప్రభాకరరావు మాయమైపోయారు. ఒక్కోళ్ళని విచారిస్తున్న సిట్ కు అసలు పాత్రదారి ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ప్రభాకరరావే అని తెలుసుకునేటప్పటికే ఆయన దేశం వదిలేసి అమెరికాకు పారిపోయారు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆయన్ను అమెరికా నుండి రప్పించటం సిట్ వల్ల కావటంలేదు. ఇపుడొస్తాను..అప్పుడొస్తానంటు ఇంతకాలం కాలక్షేపం చేసిన మాజీ చీఫ్ తాజాగా తాను ఇండియాకు ఎప్పుడొస్తానో చెప్పలేనని చెప్పేశారు. ఎందుకంటే క్యాన్సర్ కు అమెరికాలో చికిత్స చేయించుకుంటున్నారట. చికిత్స ఎప్పుడు పూర్తవుతుందో తాను చెప్పలేను కాబట్టి హైదరాబాద్ కు ఎప్పుడొస్తానో కూడా చెప్పలేనని చెప్పేశారు. చివరికి తన ఐపీఎస్ తెలివంతా విచారణను ముందుకు పోకుండా అడ్డుకోవటంలో ఉపయోగిస్తున్నారు.

ఇపుడు సమస్య ఏమిటంటే మాజీ చీఫ్ ను అమెరికా నుండి హైదరాబాద్ కు రప్పించాలంటే ఇంటర్ పోల్ సాయం తీసుకోవాల్సిందే. ఇప్పటికే సిట్ రెడ్ కార్నర్ నోటీసు, బ్లూ కార్నర్ నోటీసు జారీచేసినా ఎలాంటి ఉపయోగం కనబడలేదు. ఆయన పాస్ పోర్టును రద్దుచేయాలని విదేశాంగశాఖకు లేఖ రాసినా పెద్దగా స్పందన కనబడలేదు. కారణం ఏమిటంటే తాను ఎక్కడికీ పారిపోలేదని, చికిత్స కోసం అమెరికాలో ఉన్నట్లు అవసరమైన పత్రాలన్నింటినీ విదేశాంగ శాఖ ఉన్నతాధికారులకు అందించారట. తాను చికిత్సనుండి తిరిగొచ్చిన తర్వాత సిట్ దర్యాప్తుకు సహకరిస్తానని కోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. కాబట్టి చికిత్స చేయించుకుంటున్న నిందితుడిని అరెస్టుచేయటానికి వారెంటు జారీచేయటానికి కోర్టు సుముఖంగా లేదు. అలాగే పాస్ పోర్టు రద్దుచేయాలని రీజనల్ పాస్ పోర్టు ఆఫీసుకు సిట్ లేఖ రాసినా స్పందనలేదు.

విదేశాంగ శాఖ సిట్ కు అనుకూలంగా స్పందించి లేఖ రాస్తే కాని ఇంటర్ పోల్ సహకరించదు. జూన్లో అమెరికా నుండి ఇండియాకు వస్తానని గతంలోనే ప్రభాకరరావు సిట్ కు మెయిల్ పంపారు. అయితే తాజాగా చికిత్స కారణంగా రాలేకపోతున్నట్లు చెప్పారని సమాచారం. హైదరాబాద్ లోని సిట్ ఉన్నతాధికారుల ఎత్తులకు అమెరికాలో కూర్చున్న ప్రభాకర్ పై ఎత్తులు వేస్తున్నట్లు అర్ధమవుతోంది. ప్రభాకర్ వస్తే కాని దర్యాప్తు పూర్తికాదు, చికిత్స పూర్తయితే కాని ప్రభాకర్ ఇండియాకు రారు. క్యాన్సర్ చికిత్సంటే ఎంతకాలం పడుతుందో ఎవరూ చెప్పలేరు. ఆయనకు క్యాన్సర్ ఏ స్టేజ్ లో ఉంది ? తీసుకుంటున్న చికిత్స ఏమిటన్నది సిట్ అధికారులకు అర్ధంకావటంలేదు. మొత్తానికి చిక్కడు దొరకడు పద్దతిలో ప్రభాకరరావు సిట్ తో ఓ ఆటాడుకుంటున్నారు.

కేసీయార్ను అరెస్టు చేయాల్సిందే

ట్యాపింగ్ మొత్తానికి పాత్రదారి ప్రభాకరరావు అయితే సూత్రదారి కేసీయారే అని మంత్రులు, బీజేపీ నేతలు గోలగోల చేస్తున్నారు. కేసీయార్ పై అర్జంటుగా కేసు నమోదుచేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే సాక్ష్యాలు లేకుండా కేసీయార్ పై కేసు పెట్టడం అంత వీజీకాదు, పెట్టినా నిలవదని అందరికీ తెలుసు. ఇక ఏ కారణంతో కేసీయార్ పై సిట్ కేసు పెడుతుంది ? అరెస్టుచేస్తుంది ? కాబట్టి ప్రభాకరరావు సిట్ ముందు హాజరయ్యేంతవరకు దర్యాప్తు ముందుకు సాగదని అర్ధమైపోతోంది.

ట్యాపింగ్ తో సంబంధమే లేదు

ఇదే సమయంలో తనపై వచ్చిన ఆరోపణలను కేసీయార్ కొట్టేశారు. పోలీసులు ఎవరెవరి ఫోన్లలో ట్యాపింగ్ చేస్తే తనకేమి సంబంధమని ఎదురు ప్రశ్నించారు. పోలీసులు చేసే ట్యాపింగులన్నీ తనకు చెప్పిచేయరని అన్నారు. ట్యాపింగ్ విషయంలో ప్రచారంలో ఉన్న ఆరోపణలతో తనకు సంబంధమే లేదు పొమన్నారు. మొత్తానికి ట్యాపింగ్ విచారణ ఎప్పటికి ఒక కొలిక్కి వస్తుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. ట్యాపింగ్ విచారణను సిట్ ఎలా ముగిస్తుందో చూడాల్సిందే.

Read More
Next Story