టెలిఫోన్ ట్యాపింగ్ పై చేతులెత్తేసినట్లేనా ?
x
Telephone tapping

టెలిఫోన్ ట్యాపింగ్ పై చేతులెత్తేసినట్లేనా ?

డీజీపీ జితేందర్ మీడియాతో మాట్లాడుతు నిందితులను పట్టుకునేందుకు జారీచేసే రెడ్ కార్నర్ నోటీసులు అంత సులభంగా జారీ కావన్నారు.


తాజా డెవలప్మెంట్లు చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఆమధ్యేమో అమెరికాలో ఉన్న టెలిఫోన్ ట్యాపింగ్ నిందితులను హైదరాబాదుకు రప్పించేందుకు అమెరికాలోని ఇంటర్ పోల్ సాయం తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీచేయగానే నిందుతులిద్దరు ప్రభాకరరావు, శ్రవణ్ కుమార్ ను అమెరికా నుండి ఇంటర్ పోల్ అధికారులు ఇండియాకు పంపించేస్తారన్నట్లుగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు (సిట్) చెప్పారు. సిట్ అధికారులు ఢిల్లీలోని సీబీఐకి కేసు వివరాలు ఇచ్చారని సీబీఐ ఇంటర్ పోల్ అధికారులతో చర్చలు జరుపుతోందని రెడ్ కార్నర్ నోటీసులు జారీచేయాలని రిక్వెస్టు చేసినట్లు లీకులిచ్చారు. తీరా చూస్తే అదంతా పూర్తిగా వాస్తవం కాదని ఇపుడు అంటున్నారు. రెడ్ కార్నర్ నోటీసులు జారీచేయటం అంత సులువు కాదని చావు కబురు చల్లగా చెప్పారు.

టెలిఫోన్ ట్యాపింగ్ డెవలప్మెంట్లపై డీజీపీ జితేందర్ మీడియాతో మాట్లాడుతు నిందితులను పట్టుకునేందుకు జారీచేసే రెడ్ కార్నర్ నోటీసులు అంత సులభంగా జారీ కావన్నారు. రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యేందుకు చాలా సమయం పడుతుందన్నారు. రెడ్ కార్నర్ నోటీసు జారీ ప్రాసెస్ ను డీజీపీ వివరించారు. రెడ్ కార్నర్ నోటీసు జారీ అవ్వాలంటే అంతర్జాతీయ ఒప్పందాలు, ఇంటర్ పోల్ గైడెన్స్ పాటించాలని చెప్పారు. దేశాల మధ్య ఒప్పందాలను కూడా జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. చాలా స్ధాయిలో చాలా రకాల ప్రోటోకాల్స్ పాటించి, అన్నింటినీ నూరుశాతం పాటిస్తే కాని రెడ్ కార్నర్ నోటీసు జారీచేయటం సాధ్యం కాదన్నారు. ఈ ప్రక్రయలన్నీ పూర్తయి నిందితులు ఇద్దరికీ రెడ్ కార్నర్ నోటీసులు జారీ అవ్వాలంటే చాలా సమయం పడుతుందని జితేందర్ చెప్పారు. టెలిఫోన్ ట్యాపింగ్ కేసును హైదరాబాద్ కమీషనర్ ఆఫ్ పోలీసు, వెస్ట్ జోన్ డీసీపీ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.

సరే, కేసును ఎవరు పర్యవేక్షిస్తారు, ఎవరు సీబీఐతో మాట్లాడుతున్నారు అన్న విషయాలను పక్కన పెట్టేస్తే స్వయంగా డీజీపీ చెప్పిన విషయంలోనే రెడ్ కార్నర్ నోటీసులు జారీచేయటానికి చాలా సమయం పడుతుందన్న విషయంలో క్లారిటి వచ్చేసింది. కాబట్టి మన పోలీసులు వీలైనంత తొందరలోనే నిందితులను అమెరికా నుండి తీసుకొచ్చేస్తారని అనుకోవాల్సిన అవసరంలేదు. ట్యాపింగ్ కేసులోనే ఆల్రెడి అరెస్టయిన పోలీసు అధికారులు తిరుపతిరావు, ప్రదీప్ రావు, రాధాకిషన్ రావు, సంజీవరావు తదితరులు ఎంతకాలం పోలీసు కస్టడీలో ఉన్నా, జ్యుడీషియల్ రిమాండులో ఉన్నా పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా పనిచేసిన ప్రభాకరరావు ఆదేశాల మేరకే తాము టెలిఫోన్ ట్యాపింగ్ చేసినట్లు అంగీకరించారు. అయితే ఎవరి ఆదేశాల ప్రకారం ప్రభాకరరావు తన కిందిస్ధాయి సిబ్బందితో టెలిఫోన్ ట్యాపింగ్ చేయించారనే విషయం మాత్రమే తేలాలి.

ఇపుడు డీజీపీ చెప్పిందాని ప్రకారం ప్రభాకరరావును హైదరాబాదుకు తీసుకురావటం అంత తేలికకాదని అర్ధమవుతోంది. అసలు ప్రభాకరరావు ఇండియాకు వస్తారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మాజీ చీఫ్ ను విచారించనిదే కేసు ఒక కొలిక్కి రాదు. ప్రభాకరరావు దొరకనంత వరకు కేసు దర్యాప్తు ముందుకు వెళ్ళదన్నది వాస్తవం. కాబట్టి చాలా కేసుల లాగే టెలిఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కూడా ఎప్పటికి పూర్తవుతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు.

Read More
Next Story