
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. సుప్రీంకోర్టుకు సిట్
కస్టోడియల్ విచారణ చేస్తేనే కావాల్సిన సమాచారం బయటకు వస్తుందని నమ్ముతున్న సిట్ అధికారులు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు కల్పించిన రక్షణను తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సిట్ అధికారులు నిశ్చయించుకున్నారు. ఈ మేరకు సిట్ అధికారులు ఢిల్లీకి చేరుకున్నారు. సుప్రీంకోర్టు రక్షణ కల్పించడంతో అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రభాకర్ రావు.. విచారణకు ఏమాత్రం సహకరించడం లేదు. అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు దాటవేత ధోరణిలో సమాధానం ఇస్తున్నారు. దీంతో ప్రభాకర్ రావు విషయంలో సిట్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
అరెస్ట్ నుంచి ఆయనకు సుప్రీంకోర్టు కల్పించిన రక్షణను ఉపసంహరించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, సిట్ అధికారి ఏసీపీ వెంకటగిరి.. ఢిల్లీకి వెళ్లారు. ఈరోజే వారు తమ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం ముందు ఉంచనున్నారు. ఇప్పటి వరకు ప్రభాకర్ రావును 5సార్టు ప్రశ్నించినప్పటికీ ఆయన నుంచి ఎటువంటి సమాచారం రాలేదని, పైగా ఆయన ఇష్టారాజ్యంగా సమాధానాలు చెప్తున్నారని సిట్ అధికారులు పేర్కొన్నారు. “ఆధారాలు చూపించండి” అంటూ ఎదురు ప్రశ్నలు వేయడంపై అధికారులు అసహనం వ్యక్తం చేశారు.
అప్పుడే సమాధానాలు వస్తాయి..!
సుప్రీం కోర్టు నుంచి రిలీఫ్ ఉండటంతోనే ప్రభాకర్ రావు.. సిట్ అధికారులను లెక్కచేయడం లేదని, సమాధానాలు చెప్పకపోగా ఎదురు ప్రశ్నలు వేస్తున్నారని సిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అందువల్లే ఆయనకు ఇచ్చిన రిలీఫ్‌ను రద్దు చేయడంతో పాటు తమకు కస్టడీ ఇవ్వాలని కోరే ఆలోచనలో సిట్ ఉన్నట్లు సమాచారం. కస్టోడియన్ విచారణ జరిగితే కానీ ప్రభాకర్ రావు పెదవి విప్పరని, సమాచారం బయటకు రాదని సిట్ అధికారులు భావిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడు చాలా ప్రశ్నలకు తనకు గుర్తు లేదని చెప్పడం, ఆధారాలేవి చూపించండి అని ప్రభాకర్ రావు అడగడానికి సుప్రీంకోర్టు రిలీఫ్ కారణమని, అది ఒక్కసారి రద్దై.. కస్టోడియల్ విచారణ జరిగితే అన్ని గుర్తుకు వస్తాయని, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్న అనేక రహస్యాలు వెలుగులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాలివే..!
అమెరికాలో ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు ఇండియాకు రావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే విధంగా ఆయనకు మూడు రోజుల్లో పాస్‌పోర్ట్ జారీ చేయాలని అధికారులను ఆదేశించింది. దాంతో పాటుగానే ప్రభాకర్ రావు పట్ల అధికారులు కఠినంగా వ్యవహరించకూడదని, ప్రభాకర్ రావు.. ఫోన్ టాపింగ్ కేసుకు పూర్తిగా సహకరించాలని కూడా ఆదేశాలిచ్చింది. ఈ మేరకు అండర్ టేకింగ్ ఇవ్వాలని జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్రశర్మ ధర్మాసనం స్పష్టం చేసింది.