హెలిబోర్న్ సర్వేతో ఎస్ఎల్‌బీసీకి కొత్త ఊపిరి
x
శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (SLBC) టన్నెల్

హెలిబోర్న్ సర్వేతో ఎస్ఎల్‌బీసీకి కొత్త ఊపిరి

నల్గొండ కలకు మళ్లీ కదలిక.. 42 ఏళ్ల ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టుకు సాంకేతిక పునఃప్రారంభం


నల్గొండ కరవు సమస్యతోపాటు ఫ్లోరైడ్ బాధ తీర్చేందుకు నాలుగు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు మళ్లీ కొత్త ఊపిరి పీలుస్తోంది. 42 ఏళ్లుగా నెమ్మదిగా సాగిన శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (SLBCTunnel) టన్నెల్ నిర్మాణం ఇప్పుడు ఆధునిక సాంకేతికతతో మళ్లీ పునఃప్రారంభానికి సిద్ధమవుతోంది. ఇటీవల జరిగిన టన్నెల్ ప్రమాదం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా ముందడుగేస్తూ, దేశంలోనే మొదటిసారిగా హెలిబోర్న్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వేతో (heliborne survey) భూగర్భ రహస్యాలను ఛేదించేందుకు రంగం సిద్ధం చేసింది. తెలంగాణకు నీటిని, నల్గొండకు నూతన జీవాన్ని అందించాలన్న కల నిజం కావాలంటే... ఈ సారి సాంకేతికతే మోక్షమని అధికారులు నమ్ముతున్నారు.

- కాలం మారింది, ప్రభుత్వాలు మారాయి... కానీ ఆ సొరంగం మాత్రం రాతిలా నిలిచిపోయింది. 42 ఏళ్లపాటు ఆలస్యం, అవాంతరాలు, ప్రమాదాల ముసుగులో నలిగిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు మళ్లీ పునర్జన్మ పొందుతోంది. ఆధునిక సాంకేతికతతో, హెలిబోర్న్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే దారిలో భూగర్భాన్ని చదివే ప్రయత్నం మొదలైంది. ఈ సారి టన్నెల్ తవ్వకం కేవలం ఇంజనీరింగ్ ప్రాజెక్టు కాదు...నల్గొండ ప్రజల జీవితాలలో నీటివెలుగులు నింపే ఆశాకిరణం కానుంది.

42 ఏళ్లుగా నిర్మాణంలోనే...

నల్గొండ జిల్లాలోని కరవు పీడిత ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు 1983వ సంవత్సరంలో ప్రారంభించిన ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు 42 ఏళ్లుగా నిర్మాణంలోనే ఉంది. నల్గొండ జిల్లాలోని 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతోపాటు ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు తాగునీటిని అందించేందుకు ఉద్ధేశించిన ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా శ్రీశైలం జలాశయం ఎడమగట్టు జలాశయం నుంచి నీటిని నల్గొండకు తరలించేందుకు 43.93 కిలోమీటర్ల పొడవైన శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (SLBC) సొరంగం తవ్వకం పనులు ప్రారంభించారు.

ఎస్ఎల్ బీసీ టన్నెల్ ప్రస్థుత స్థితి
శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ లెట్ వైపు నుంచి 13.94 కిలోమీటర్ల సొరంగం పనులు, దేవరకొండ అవుట్ లెట్ వైపు నుంచి 20.4 కిలోమీటర్ల దూరం టన్నెల్ ను తవ్వారు. మరో 9.8 కిలోమీటర్ల దూరం సొరంగం తవ్వాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుకు నీరందించడానికి కాల్వ తవ్వాలంటే నల్లమల రిజర్వ్ ఫారెస్ట్ గుండా వెళుతుండటంతో పాటు గ్రానైట్ రాళ్లు, 15 నాలాలు దాటాల్సి ఉండటంతో సొరంగం తవ్వాలని నిర్ణయించారు.



టన్నెల్ నిర్మాణంలో ఆది నుంచి ఆవాంతరాలు

ఎస్ఎల్ బీసీ టన్నెల్ నిర్మాణంలో ఆది నుంచి ఆవాంతరాలు ఎదురయ్యాయి. 2009వ సంవత్సరంలో ఎస్ ఎల్ బీసీ టన్నెల్ బోరింగ్ మిషీన్ ను వరదనీరు ముంచెత్తడంతో నిర్మాణ పనుల్లో తీవ్రమైన జాప్యం జరిగింది. అలైన్ మెంట్ లోపాలు, షీర్ జోన్ ల వల్ల పనులు సజావుగా సాగలేదు.

కూలిన టన్నెల్‌తో నిలిచిన నిర్మాణ పనులు
ఎస్ఎల్ బీసీ టన్నెల్ టన్నెల్ బోరింగ్ మిషన్ సాయంతో కార్మికులు తవ్వుతుండగా 2025 ఫిబ్రవరి 22వ తేదీన ఒక్కసారిగా పై కప్పు కూలి పోయింది. టీబీఎం యంత్రం ముక్కలవడంతోపాటు భారీగా వరదనీరు, రాతి శిథిలాలు కూలిపోవడంతో 8 మంది కార్మికులు సజీవ సమాధి అయ్యారు. దీని వల్ల రెండున్నర కిలోమీటర్ల దూరం టన్నెల్ లోపల వరదనీరు ప్రవహించింది. టన్నెల్ బోరింగ్ మిషన్ 130 మీటర్ల బురదలో పూడుకుపోయింది.ఈ దుర్ఘటన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టన్నెల్ నిర్మాణ పనుల్లో భద్రతను పర్యవేక్షించడానికి ఉన్నతస్థాయి సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది.దేశంలోని ప్రముఖ టన్నెల్. రాక్ మెకానిక్స్ ఇంజనీర్లతో ఒక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇప్పటికే ఆరు సమావేశాలు జరిపింది.భారత సైన్యం మాజీ ఇంజనీర్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ ప్రత్యేక సలహాదారుగా పనిచేస్తున్నారు. ప్రఖ్యాత సొరంగం నిపుణుడు కల్నల్ పరీక్షిత్ మెహ్రాను ఒక సంవత్సరం పాటు కన్సల్ టెంట్ గా నియమించారు.

అధునాతన సాంకేతిక పద్ధతిలో...

ఎస్ఎల్ బీసీ టన్నెల్ కూలిపోయిన ఘటన తర్వాత తవ్వకంలో అధునాతన పద్ధతులను అనుసరించాలని ఉన్నతస్థాయి సాంకేతిక కమిటీ సిఫార్సు చేసింది. అధునాతన సాంకేతిక పద్ధతిలో సొరంగం తవ్వే ప్రతిపాదనలను 2025 అక్టోబరు 23వతేదీన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ సొరంగం నిర్మాణాన్ని 2028 వ సంవత్సరం లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.దేశవ్యాప్తంగా ఉన్న సొరంగాల నిపుణులు కూడా హెలి బోర్న్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వేను నిర్వహించాలని సిఫార్సు చేశారు.



హెలిబోర్న్ ఏరియల్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే ఏమిటి?

సాంకేతిక నిపుణుల సలహా మేరకు తెలంగాణ ప్రభుత్వం నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NGRI) ప్రముఖ శాస్త్రవేత్తలు నిర్వహించనున్న హెలికాప్టర్-బోర్న్ VTEM ప్లస్ మాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంజూరు చేసింది. దీంతో సోమవారం తెలంగాణ సీఎం ఎ రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సర్వేను స్వయంగా పర్యవేక్షించారు.ఈ సర్వేలో భాగంగా 200 కిలోమీటర్ల దూరం హెలికాప్టరుతో స్పెషలిస్ట్ అండర్ స్లంగ్ ట్రాన్స్ మీటర్ 24 మీటర్ల వ్యాసం గల లూప్ తో టన్నెల్ అలైన్ మెంట్ పై ఎగురవేశారు. ఇది భూమిలోకి విద్యుదయస్కాంత సంకేతాలను పంపి ఎడ్డీలను సృష్టిస్తుంది. తరువాత అవి ప్రతిబింబిస్తాయి. రీడింగ్‌లు చిన్న రిసీవర్ లూప్‌లో నమోదు చేస్తున్నారు. భూమి నుంచి 800-1000 మీటర్ల దిగువన ఉన్న భూగర్భ శాస్త్రం గురించి డేటాను పొందడానికి ఈ రీడింగ్‌లు ప్రాసెస్ చేయనున్నట్లు ఇంజినీరింగ్ అధికారులు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.ఇది బ్యాలెన్స్ అలైన్‌మెంట్‌లో ఏదైనా షీర్ జోన్‌లు లేదా చిక్కుకున్న నీటి వనరులను అంచనా వేయడానికి సహాయపడుతుంది. తద్వారా టన్నెల్ తవ్వకాన్ని సురక్షితంగా చేపట్టవచ్చు.

42 ఏళ్లుగా నిర్మాణ జాప్యం
ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ఎస్ఎల్ బీసీ టన్నెల్ నిర్మాణంలో 42 ఏళ్లుగా జాప్యం జరిగింది. టన్నెల్ కూలిపోయిన తర్వాత సోమవారం చేసిన హెలిబోర్న్ ఏరియల్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే అనంతరం దీని నిర్మాణ పనులు చేపట్టనున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా మన్నెవారి పల్లి గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి హెలిబోర్న్ ఏరియల్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే ను ప్రారంభింబించారు. ఈ సర్వేలో ఎన్ జీ ఆర్ ఐ డైరెక్టర్ డాక్టర్ ప్రకాశ్ కుమార్, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ హెచ్ సీ ఎస్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ సర్వే చేపట్టారు. ఎన్ జీ ఆర్ ఐ బృందం ఈ సర్వేను పరిశీలిస్తుంది.



సొరంగానికి మళ్లీ జీవం పోసే ప్రయత్నం

నల్గొండ నేల మీద వర్షం కురవక పోయినా, ఇప్పుడు ఆకాశంలో ఎగిరే హెలికాప్టర్ నుంచి సాంకేతిక ఆశ కురుస్తోంది. నాలుగు దశాబ్దాలుగా నిలిచిపోయిన సొరంగానికి మళ్లీ జీవం పోసే ప్రయత్నం మొదలైంది. ఎక్కడ బండరాళ్లు అడ్డుగా ఉన్నాయో, ఎక్కడ నీరు చిక్కుకుని ఉందో ముందుగానే తెలుసుకోవాలనే ఈ కొత్త సర్వే ప్రయత్నం. కేవలం యంత్రాల కదలిక కాదు, నల్గొండ రైతుల గుండెల్లో మళ్లీ మొలకెత్తుతున్న విశ్వాసం.ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఈసారి సాంకేతికతకు తోడు సంకల్పం ఉంది. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 2028 సంవత్సరం నాటికి టన్నెల్ పూర్తి అయితే ... 42 ఏళ్ల నిరీక్షణ నీటివెలుగులుగా మారి, కరవుతో ఎండిన నల్గొండ నేల మళ్లీ సస్యశ్యామలం కానుంది.ఈ సారి ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు కేవలం ఇంజినీరింగ్ విజయం కాదు... అది ఓ తరం ఆశల జలధార.


Read More
Next Story