భయంతో తమ రాష్ట్రాలకు వెళిపోతున్న ఎస్ఎల్బీసీ కార్మికులు
x
SLBC labour leaving for their states

భయంతో తమ రాష్ట్రాలకు వెళిపోతున్న ఎస్ఎల్బీసీ కార్మికులు

తమప్రాణాలను పణంగా పెట్టి ఎస్ఎల్బీసీ(SLBC Tunnel) టన్నెల్లోపల పనులు చేయాల్సిన అవసరంలేదని కార్మికులు అనుకున్నారు


శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ కార్మికులు భయంతో తమ సొంత రాష్ట్రాలకు తిరిగి వెళిపోతున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు ఈనెల 18వ తేదీన మొదలైన విషయం తెలిసిందే. నాలుగురోజుల తర్వాత అంటే 22వ తేదీన ఉదయం టన్నెల్లోని 14వ కిలోమీటర్ దగ్గర పనులు జరుగుతుండగా పై కప్పునుండి రాళ్ళు, మట్టి, నీళ్ళు పెద్దఎత్తున పడ్డాయి. దాంతో అక్కడ పనిచేస్తున్న అధికారులు, కార్మికులు 50 మందిలో 42 మంది భయంతో టన్నెల్ బయటకు పారిపోయి వచ్చేశారు. మిగిలిన 8మంది మాత్రం టన్నెల్లోనే చిక్కుకుపోయారు. టన్నెల్లోపల చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఇంతవరకు ఫలించలేదు. దాంతో బయటున్న కార్మికుల్లో భయం పెరిగిపోతోంది.

తమప్రాణాలను పణంగా పెట్టి ఎస్ఎల్బీసీ(SLBC Tunnel) టన్నెల్లోపల పనులు చేయాల్సిన అవసరంలేదని కార్మికులు అనుకున్నారు. అందుకనే శనివారం ఉదయం బస్సుల్లో, జీపుల్లో తమ సామగ్రిని మొత్తాన్ని తీసుకుని జార్ఖండ్(Jharkhand), పంజాబ్(Punjab) కు తిరిగి వెళిపోతున్నారు. తమప్రాంతాల్లో పనులులేకపోవటంతోనే అంతదూరం నుండి తెలంగాణకు పనులు చేసేందుకు వచ్చినట్లు కార్మికుడు అజయ్ సాహు చెప్పారు. తాము ప్రాణాలతో ఉంటేనే కదా తమ ఇంటికి డబ్బులు పంపగలం అని అజయ్ చెప్పాడు. పనులుచేసి డబ్బులు సంపాదించుకోవాలని వచ్చామే కాని ప్రాణాలను పణంగా పెట్టేందుకు కాదని సదరు కార్మికులు స్పష్టంగా చెప్పేశాడు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్లో పనిచేసి ప్రాణాలను పోగొట్టుకునేకన్నా తమ ఊరిలోనే ఏదో పనిచేసుకుందాం వచ్చేయమని తమింట్లో వాళ్ళు రోజూ ఫోన్లు చేస్తున్నట్లు అజయ్ చెప్పాడు. తనతో పాటు జార్ఖండ్ నుండి వచ్చిన సుమారు 30 మంది తిరిగి వెళిపోతున్నట్లు వివరించాడు.


ప్రమాదం జరిగినప్పటినుండి తమను ఎవరు పట్టించుకోలేదని అజయ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశాడు. తమ కాంట్రాక్టు సంస్ధ గడచిన 3 నెలలుగా కూలీడబ్బులు కూడా ఇవ్వలేదని మండిపడ్డాడు. తమ సహచర కూలీలు ప్రాణాపాయంలో కూరుకుపోవటం తమలో భయాందోళనలు పెంచేస్తున్నట్లు చెప్పాడు. అందుకనే ఇప్పటికైతే తాము తమ ఊర్లకు వెళిపోతున్నామని తర్వాత సంగతి తర్వాత ఆలోచిస్తామన్నాడు. కార్మికులు భయంతో తమఊర్లకు తిరిగి వెళ్ళిపోతుండటంతో ఇప్పట్లో టన్నెల్ పనులు జరిగేది అనుమానంగా మారింది. నిజానికి కార్మికులు ఇక్కడే ఉన్న టన్నెల్ పనులైతే ఇప్పట్లో జరగే అవకాశాలు లేవు. ఎందుకంటే టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం)(Tunnel Boring Machine) ముందుభాగంలో కీలకమైన కట్టర్ ముక్కలుగా విరిగిపోయింది. ఈ కట్టర్ ను తెప్పించాలంటే చాలాకాలం పడుతుంది. కట్టర్ లేకుండా టన్నెల్లో పనులు జరగవు. ఇదేసమయంలో టీబీఎంలోని మిగిలిన భాగాల్లో ఎంతమేర దెబ్బతిన్నాయో తెలీదు. పైనంతా పేరుకుపోయిన బురద, రాళ్ళు, మట్టిని తొలగిస్తే కాని టీబీఎం పరిస్ధితి ఏమిటో ఎవరికీ తెలీదు.

దెబ్బతన్న కట్టర్ తో పాటు టీబీఎం పరికరాలను కూడా ముందు బయటకు తీసుకురావాలి. ఆ తర్వాత టీబీఎంను టన్నెల్లోపల నుండి బయటకు తీసుకురావాలి. యంత్రపరికరాలన్నింటినీ టన్నెల్లోపల నుండి బయటకు తీసుకువచ్చిన తర్వాత టన్నెల్ పైకప్పుకు రిపేర్లు చేయాలి. రిపేర్లంటే భవిష్యత్తులో పై కప్పునుండి రాళ్ళు, మట్టి పడకుండా నీరు కారకుండా సిమెంటుతో గ్రౌటింగ్ చేయాలి. సిమెంట్ గ్రౌటింగ్ బాగా క్యూర్ అవ్వాలి. ఇవన్నీ అవ్వాలంటే కనీసం కొన్నినెలలు పడుతుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే కార్మికులు తమసొంతూళ్ళకు వెళ్ళిపోతున్నట్లున్నారు.


22వ తేదీ ఉదయం ప్రమాదం జరిగినపుడు భూకంపం వచ్చిందా అన్నట్లుగా టన్నెల్లోపలంతా కదిలిపోయి పై కప్పునుండి పెద్దఎత్తున పెద్ద పెద్ద రాళ్ళు, మట్టిపెళ్ళలు, నీరు పడిపవటంతో క్షణాల్లో ఆ ప్రాంతమంతా బురదగా మారిపోయింది. దానికితోడు టీబీఎం యంత్రాలపై పెద్ద బండరాళ్ళు పడటంతో వాటి ధాటికి యంత్రంలోని కొంతభాగం ముక్కలైపోయింది. అవన్నీ కూడా లోపలే చిక్కుకుపోయిన 8 మంది మీద పడిపోయాయి.

చుట్టూ బురద పైగా యంత్రాల శకలాలు మీదపడటంతో ఇద్దరు అధికారులు, ఆరుమంది కార్మికులు బురదలోనే చిక్కుకుపోయారు. గడచిన 8 రోజులుగా వారిని రక్షించేందుకు ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నిస్తున్నా ఏమాత్రం ఉపయోగం కనబడటంలేదు. టన్నెల్లోపల 13-14 కిలోమీటర్ల దాకా శుక్రవారం రాత్రి వెళ్ళగలిగిన రెస్క్యూ ఆపరేషన్లు చేస్తున్న నిపుణులు చిక్కుకుపోయిన 8 మంది బురదలో కూరుకుపోయుంటారని నిర్ధారణకు వచ్చారు. సుమారు 15 అడుగుల ఎత్తులో సుమారు 300 అడుగుల విస్తీర్ణంలో బురద దట్టంగా పేరుకుపోయినట్లు నిపుణులు గుర్తించారు. కూరుకుపోయినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి రెస్క్యూ ఆపరేషన్లు ఎప్పటికి పూర్తవుతాయో, చివరకు ప్రభుత్వం ఎలాంటి ప్రకటనచేస్తుందో చూడాలి.

Read More
Next Story