ప్రయాణికుల ప్రాణాలు తోడేస్తున్న స్లీపర్ బస్సులు
x
మంటల్లో చిక్కి పూర్తిగా కాలిపోయిన స్లీపర్ బస్సు

ప్రయాణికుల ప్రాణాలు తోడేస్తున్న స్లీపర్ బస్సులు

స్లీపర్ బస్సులే ఎక్కువగా ప్రమాదాలకు గురవడంపై ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.


భద్రతా చర్యలు పాటించక పోవడం, అధిక వేగం వల్ల బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి. వరుస బస్సు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో బస్సుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళుతున్న బస్సులు కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి.బస్సు ప్రమాదాలకు కారణాలేవైనా ప్రయాణికుల ప్రాణాలు మాత్రం గాల్లో కలిసిపోయాయి.


మూడు రోజుల్లో మూడు ప్రమాదాలు
మూడు రోజుల్లో మూడు ఘోర బస్సు ప్రమాదాలు గడచిన మూడు రోజుల్లో మూడు ఘోర బస్సు ప్రమాదాలు జరిగాయి. హైదరాబాద్, విజయవాడ,తిరుపతి, విశాఖ పట్టణాల నుంచి చెన్నై, తిరుపతి, బెంగళూరు, ఒడిశా తదితర దూర ప్రాంతాలకు బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. బస్సు ప్రమాదాలు, అందులోనూ స్లీపర్ బస్సుల ప్రమాదాల సంఖ్య పెరగడం అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది.

వరుస బస్సు ప్రమాదాలు...
- 2025 అక్టోబరు 24 : హైదరాబాద్ నగరం నుంచి బెంగళూరుకు గురువారం రాత్రి బయలు దేరిన వేమూరి కావేరి ట్రావెల్ బస్సు కర్నూల్ జిల్లా చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు ప్రమాదం జరిగి మంటల్లో పూర్తిగా కాలిపోయింది. బస్సును బైక్ ఢీకొట్టడంతో ముందుభాగంలో మంటలు చెలరేగి 19 మంది ప్రాణాలు కోల్పోయారు.
- 2025 అక్టోబరు 23వతేదీన తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెన్నేపల్లి వద్ద పెళ్లి బృందం బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. 35 మంది ప్రయాణికులు నెల్లూరు నుంచి బెంగళూరుకు వెళుతుండగా ఈ అగ్ని ప్రమాదం జరగడంతో అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే దిగాక బస్సు దగ్ధమైంది.
- 2025 అక్టోబరు 22వతేదీన హైదరాబాద్ నగరంలోని నాదర్ గుల్ ఢిల్లీ పబ్లిక్ స్కూలు బస్సులో మంటలు వ్యాపించాయి. పాఠశాల విద్యార్థులను ఇళ్ల వద్ద దింపి వెళుతుండగా బస్సులో నుంచి పొగ రావడంతో అప్రమత్తమైన డ్రైవరు బస్సును ఆపడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
- 2025 సెప్టెంబరు 14వతేదీన జైసల్మేర్ నుంచి జోథ్ పూర్ వైపు వెళుతున్న ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగడంతో 20 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. బస్సులో 57 మంది ప్రయాణికులుండగా 37 మంది ప్రమాదం నుంచి గాయాలతో బయటపడ్డారు.
- తిరుమల ఘాట్ రోడ్డులో వరుస ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మొదటి ఘాట్ రోడ్డులో 7 వ మైలు దగ్గర ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రెయిలింగ్ ను ఢీకొంది. బస్సు ముందు భాగం నజ్జు నుజ్జయింది. ఈ ప్రమాదంలో పది మంది భక్తులకు గాయాలయ్యాయి.
- 2021 నవంబరు 29 : కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎగువ అహోబిలం రహదారిలో అదుపుతప్పి ఆర్టీసీ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
- 2025 జనవరి 19 : తిరుమల ఘాట్ రోడ్డులో 7వ మైలు వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రెయిలింగ్ ను ఢీకొంది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. ఈ ప్రమాదంలో పదిమంది భక్తులు గాయపడ్డారు.ఈ ఘాట్ రోడ్డులోనే కారు అదుపు తప్పి బోల్తాపడింది.
- 2025 జనవరి 17వతేదీన నెల్లూరు జిల్లా నుంచి జగ్గయ్యపేటకు వస్తున్న సూపర్ లగ్జరీ బస్సు మన్నేటి కోట వద్ద అగ్నికి ఆహుతైంది.
- ఇటీవల అనంతపురం జిల్లా తలగాసిపల్లి వద్ద ట్రావెల్స్ ఏసీ బస్సు అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. ప్రయాణికులు అప్రమత్తమై అంతా క్షేమంగా బయటపడ్డారు.
- 2025 మే 15 : ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లక్నో కిసాన్‌పాత్‌లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీకి వెళ్తున్న స్లీపర్‌ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనమయ్యారు.
- 2022 నవంబర్ 8వ తేదీ రాత్రి 8.30 గంటలకు. జైపూర్ నుంచి ఢిల్లీకి వస్తున్న స్లీపర్ బస్సు(Sleeper Bus) గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఝర్సా ఫ్లైఓవర్ మీదుగా వెళుతోంది. అందులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటం ప్రారంభించాయి. డ్రైవర్ దూకి పారిపోయాడు. కొద్ది నిమిషాల్లోనే ఇద్దరు ప్రయాణికులు సజీవదహనమై 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.

మండే వస్తువులతో క్షణాల్లో వ్యాపించిన మంటలు
బస్సు ప్రమాదాలకు కారణాలెన్నో బస్సుల్లో మండే వస్తువులు ఇంధనం, ప్లాస్టిక్ భాగాలు, రెగ్జిన్, దూది వల్ల మంటలు త్వరగా వ్యాపించి ప్రాణ నష్టానికి దారి తీస్తుంది. ఇంధనం ట్యాంకు పైపులు దెబ్బతిని లీక్ అవడంతో మంటలు చెలరేగుతున్నాయి. బస్సుల్లో టీవీ, బల్బులు, ఫ్యాన్లు, ఏసీలకు వైరింగ్ సరిగా చేయక పోవడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వ్యాపిస్తున్నాయి.బస్సుల్లో ఇరుకు దారిలో మంటలు వ్యాపించినపుడు పొగ వల్ల ఊపిరి ఆడక ప్రయాణికులు సజీవ దహనం అవుతున్నారు. బస్సు ప్రమాదాలు జరిగినపుడు డోర్లు, ఎమర్జెన్సీ మార్గాలు, కిటికీలు తెరుకోక పోవడం వల్ల మృతుల సంఖ్య పెరుగుతుంది. అగ్ని ప్రమాదాలు జరిగినపుడు ఆర్పే వ్యవస్థలు బస్సుల్లో లేవు. కనీసం అద్దాలను పగులగొట్టి బయటకు వచ్చేందుకు సుత్తి కూడా బస్సులో లేక పోవడంతో మృతుల సంఖ్య పెరుగుతుంది.

ప్రమాదానికి గురై బస్సుకు 16 చలాన్లు
శుక్రవారం ఘోర ప్రమాదానికి గురైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సుకు తెలంగాణ రాష్ట్రంలో 16 చలాన్లు ఉన్నాయని వెలుగు చూసింది. 2024 వ సంవత్సరం జనవరి 27 వతేదీ నుంచి అక్టోబరు 9వతేదీ వరకు ఈ బస్సు 16 సార్లు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిందని తేలింది. డీడీ 01 ఎన్ 9490 బస్సు నంబరు పై 23,120 రూపాయల జరిమానా పెండింగులో ఉంది. ఈ బస్సును 2018వతేదీ మే 2వతేదీన డామన్ డయ్యూలో రిజిస్ట్రేషన్ చేశారు.

ప్రాణాలు తీస్తున్న స్లీపర్ బస్సులు
ఏసీ స్లీపర్ బస్సు ప్రయాణికుల ప్రాణాలు తీస్తున్నాయి. బస్సు డిజైన్ లోపాలతో అగ్ని ప్రమాదం జరిగితే ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుంది. అందుకే స్లీపర్ బస్సులను కదిలే శవపేటికలుగా పేర్కొంటూ వీటిని నిషేధించాలని రవాణ రంగ నిపుణులు డిమాండ్ చేస్తున్నా, పట్టించుకునే వారు లేరు. స్లీపర్ బస్సుల ఎత్తు వల్ల ప్రమాదాలు జరిగినపుడు దీనిలో నుంచి తప్పించుకోవడం సమస్యగా మారింది.

రాత్రివేళ బస్సు ప్రమాదాలు...
దూరప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో డ్రైవర్లకు సరైన నిద్ర లేక రెప్పవాల్చడం వల్ల బస్సుపై నియంత్రణ కోల్పోయి ప్రమాదాలకు కారణమవుతున్నారు.ఫైర్ అలారం, అగ్నిమాపక వ్యవస్థ లేనందువల్ల ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. డ్రైవరు నిద్ర పోతున్పపుడు అప్రమత్తం చేసే డ్రోసైనెస్ అలర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. కానీ ఏ బస్సులోనూ ఈ సౌకర్యం లేదు. కేంద్ర రోడ్డు రవాణ మంత్రిత్వశాఖ 2018వ సంవత్సరంలో డ్రైవర్లపై జరిపిన సర్వేలో 25 శాతంమంది డ్రైవర్లు నిద్రలోకి జారుకున్నట్లు అంగీకరించారు. బస్సు ప్రమాదాలు అర్దరాత్రి నుంచి ఉదయం 6 గంటల లోపు ఎక్కువగా జరుగుతున్నాయి. స్లీపర్ బస్సులో ప్రయాణీకులు పడుకోవడానికి ఉన్న సౌకర్యం అటూ ఇటూ తిరిగే గ్యాలరీలో ఉండదు. అందుకే ప్రమాదం జరిగినపుడు తప్పించుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అత్యవసర ద్వారం ఉన్న చోట్ల సీట్లను ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాల సమయంలో ఇవీ ఉపయోగపడటం లేదు.

చైనాలో నిషేధించినా దేశంలో తిరుగుతున్న స్లీపర్ బస్సులు
తరచూ ప్రమాదాలు జరిగాయని 2012వ సంవత్సరంలోనే చైనా దేశంలో స్లీపర్ బస్సులపై నిషేధం విధించారు. కానీ మన దేశంలో స్లీపర్ బస్సులు యథేచ్ఛగా తిరుగుతుండటంతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ప్రమాదాలకు గురైన బస్సుల్లో ఎక్కువ భాగం స్లీపర్ బస్సులు కావడం విశేషం. తరచూ స్లీపర్ బస్సులు అగ్నిప్రమాదాల పాలు అవుతుండటం వల్ల వీటిని నిషేధించాలని ప్రయాణికుల సంఘం అధ్యక్షుడు సయ్యద్ నూర్ డిమాండ్ చేశారు.

భద్రతా చర్యలు పాటించని బస్సులకు మంత్రి పొన్నం హెచ్చరిక
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లిన స్లీపర్ బస్సు ప్రమాద ఘటనపై దర్యాప్తు చేయాలని అధికారులను తెలంగాణ రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. బస్సుల్లో భద్రతా చర్యలు పాటించకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. త్వరలో ప్రైవేటు బస్సుల వేగ నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘోర ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల రవాణ శాఖ మంత్రులతో త్వరలో సమావేశాన్ని నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్న ఓల్వో బస్సు కర్నూల్ వద్ద ప్రమాదానికి గురైందని తెలిసి మంత్రి తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాద ఘటన పై కర్నూల్ జిల్లా అధికారులతో మంత్రి మాట్లాడారు.


Read More
Next Story