గంజాయి రవాణాకు స్మగ్లర్ల నయా ప్లాన్, మైనర్ బాలికలే క్యారియర్లు
x
గంజాయి రవాణకు కేంద్రం..,సికింద్రాబాద్ రైల్వేస్టేషన్

గంజాయి రవాణాకు స్మగ్లర్ల నయా ప్లాన్, మైనర్ బాలికలే క్యారియర్లు

ఈ చిత్రంలో కనిపిస్తున్నది సికింద్రాబాద్ రైల్వేస్టేషన్.స్మగ్లర్లు ఈ స్టేషన్ కేంద్రంగా గుట్టుగా గంజాయిని రవాణ చేసేందుకు నయా వ్యూహం పన్నారు.స్మగ్లర్ల ప్లాన్‌పై...


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ ఏజెన్సీ, ఒడిశా ప్రాంతాల నుంచి గంజాయిని వయా సికింద్రాబాద్ ముంబయి నగరానికి రైళ్లలో గంజాయిని రవాణ చేసేందుకు స్మగ్లర్లు నయా వ్యూహం పన్నారు.మైనర్ బాలికలే క్యారియర్లుగా గంజాయిని సికింద్రాబాద్ వయా ముంబయికు తరలిస్తున్నారని రైల్వే పోలీసుల దర్యాప్తులో తాజాగా వెల్లడైంది.

- ఒడిశా రాష్ట్రం నుంచి మహారాష్ట్రకు రూ.3.5 లక్షల విలువైన గంజాయిని కోణార్క్ రైలులో తరలిస్తుండగా సికింద్రాబాద్ రైల్వేస్టేషనులో ఓ 17 ఏళ్ల మైనర్ బాలికను రైల్వే పోలీసులు తాజాగా పట్టుకున్నారు. ఆ బాలికను ప్రశ్నించిన రైల్వే పోలీసులకు దిమ్మ తిరిగిపోయే గంజాయి స్మగ్లర్ల నయా రవాణ ప్లాన్ వెలుగుచూసింది. అసలు గంజాయి స్మగ్లర్లు మైనర్ బాలికలకు రూ.5వేల రూపాయలు, రైల్వే టికెట్ కొనిచ్చి గంజాయి ప్యాకెట్లతో కూడి సూట్ కేసులను ముంబయి తరలించేందుకు పథకం పన్నారని తేలిందని సికింద్రాబాద్ రైల్వే పోలీసు ఇన్ స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్
‘ఫెడరల్ తెలంగాణ’
కు చెప్పారు.

మైనర్ బాలికలే క్యారియర్లుగా...
పేద బాలికలను ఎంపిక చేసుకొని వారికి డబ్బు ఆశ చూపించి గంజాయి స్మగ్లింగ్ బాగోతంలో వారిని క్యారియర్లుగా మార్చారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.స్మగ్లర్లు ఇలా అమాయకపు బాలికలను ఎంపిక చేసుకొని గంజాయిని గుట్టుగా రైళ్లలోనే తరలిస్తున్నారు.దీనివల్ల అసలు గంజాయి స్మగ్లర్లు ఎవరనేది వెలుగుచూడటం లేదు. అయితే బాలికను పట్టుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా ఒడిశా రాష్ట్రంలోని చత్రాపూర్ ఏజెన్సీ ప్రాంతానికి చెందిన గంజాయి స్మగ్లర్లు కరణ్ పవార్, దీప్ కా పవార్ లు ఉన్నారని వెల్లడైంది.

రైల్వే పోలీసులు సీజ్ చేసిన గంజాయి

పేద యువకులు క్యారియర్లుగా గంజాయి రవాణ
గంజాయి స్మగ్లర్లు ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తూ బాలికలే కాకుండా నిరుపేద యువకులను కూడా క్యారియర్లుగా మార్చి గంజాయిని ముంబయికు తరలిస్తున్నారని రైల్వే పోలీసుల దర్యాప్తులో తేలింది. బీహార్ రాష్ట్రంలోని రాంపూర్ సంచాద్ గ్రామానికి చెందిన మణికాంత్ కుమార్ అనే 21 ఏళ్ల యువకుడు కోణార్క్ ఎక్స్ ప్రెస్ లోని ఏసీ కోచ్ లో ప్రయాణిస్తున్నాడు. ఇతని బెర్తు కింద సూట్ కేసులో ఏమున్నాయని పోలీసులు ప్రశ్నిస్తే తడబడ్డాడు. సూట్ కేస్ తెరచి చూడగా 12 కిలోల గంజాయి దొరికింది. తాను 5వేల రూపాయలు, ఏసీ రైల్వే టికెట్ ఇవ్వడంతో ఈ ప్యాకెట్లను ముంబయికు తీసుకువెళుతున్నానని యువకుడు వెల్లడించడంతో పోలీసులు నిర్ఘాంత పోయారు.

గజపతి జిల్లా నుంచి గంజాయి రవాణ
ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లాలో గంజాయిని విస్తారంగా పండించి, ఎండిన గంజాయిని రైళ్లలోనే ముంబయికు గుట్టుగా తరలించి స్మగ్లర్లు సొమ్ము చేసుకుంటున్నారని రైల్వే పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అసలు గంజాయి స్మగ్లర్లను పట్టుకోకుండా క్యారియర్లను అరెస్టు చేస్తుండటంతో అసలు గంజాయి స్మగ్లింగ్ కు తెరపడటం లేదు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కేంద్రంగా...
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ గంజాయి రవాణాకు కేంద్ర స్థానంగా మారింది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి రైళ్లలోనే గంజాయిని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ మీదుగా వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారని రైల్వే పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. రైల్వే పోలీసులు గంజాయిని సికింద్రాబాద్ స్టేషనులో పట్టుకొని, క్యారియర్లను అరెస్టులు చేస్తున్నా, గంజాయి రవాణా సాగుతూనే ఉంది.

ఎన్నెన్నో గంజాయి ఘాటు ఘటనలు...
- 2024 మే : ఒడిశా నుంచి నాందేడ్ నగరానికి రూ.15లక్షల విలువ చేసే 62 కిలోల గంజాయిని తరలిస్తుండగా రైల్వే పోలీసులు సికింద్రాబాద్ రైల్వేస్టేషనులో దాన్ని పట్టుకున్నారు.
2024 జూన్ : ఒడిశా గజపతి జిల్లాకు చెందిన కురేష్ అనే క్యారియర్ 5.5 లక్షల విలువైన 22 కేజీల గంజాయిని సికింద్రాబాద్ కు రైలులో తీసుకువచ్చి రిసీవర్ కోసం ఎదురు చూస్తుండగా రైల్వే పోలీసులు పట్టుకున్నారు.
-2024 జూన్ : సికింద్రాబాద్ రైల్వేస్టేషనులో 1వ నంబరు ప్లాట్ ఫాంపై గంజాయి సంచులున్న ట్రాలీ బ్యాగును కొందరు వదిలేసి వెళ్లారు. ఈ కేసులో గంజాయి క్యారియర్ కూడా తప్పించుకున్నారు. గంజాయిని రైల్వే పోలీసులు సీజ్ చేశారు.
- 2024: విశాఖ ఏజెన్సీ నుంచి ముంబయికు కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైలులో 54 కిలోల గంజాయిని తరలిస్తుండగా రైల్వే పోలీసులు సికింద్రాబాద్ రైల్వేస్టేషనులో పట్టుకొని ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.


Read More
Next Story