Prajavani | ఏడాది ప్రజావాణిలో ఎన్నెన్నో సమస్యలకు పరిష్కారం
x

Prajavani | ఏడాది ప్రజావాణిలో ఎన్నెన్నో సమస్యలకు పరిష్కారం

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమానికి నేటితో ఏడాది నిండింది. ఏడాది కాలంలో ప్రజల నుంచి వచ్చిన పలు సమస్యలను పరిష్కరించారు.


గత ఏడాది డిసెంబరు 8వతేదీన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ వేదికగా ప్రజల సమస్యలను తెలుసుకొని, వాటిని పరిష్కరించేందుకు వీలుగా ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

- తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి, ప్రజాపాలన ప్రత్యేక అధికారి దివ్య, ఇతర అధికారులు ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
- ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించి ఏడాది కాలం అయిన సందర్భంగా మంగళవారం ప్రజావాణి ప్రొగ్రెస్ రిపోర్టు వార్షిక నివేదికను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రతీ వినతికి ఓ ఐడీని క్రియేట్ చేసి, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలను ప్రజావాణి పోర్టల్ లో పెడుతున్నారు.
- ప్రజావాణిలో దరఖాస్తులు రాయడానికి హెల్ప్ డెస్క్, విచారణ డెస్క్, ప్రత్యేక డిపార్ట్ మెంటల్ డెస్క్ లు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక డెస్క్, ప్రవాసీ కుటుంబాల కోసం ప్రవాసీ ప్రజావాణి కౌంటర్, రూ.5రూపాయలకే భోజనం, తక్షణం వైద్య సహాయం కోసం వైద్య శిబిరం, అంబులెన్స్, బాలరక్షక్, సఖి వాహనం ఏర్పాటు చేశారు.

ఏడాది కాలంలో 82955 పిటిషన్లు
గత ఏడాది డిసెంబరు 8వతేదీ నుంచి ఇప్పటివరకు ఏడాది కాలంలో 84 ప్రజావాణి సెషన్లు నిర్వహించి, 82,955 పిటిషన్లు ప్రజల నుంచి వచ్చాయి. వచ్చిన దరఖాస్తుల్లో 43,272 సమస్యలను పరిష్కరించారు. ఫిర్యాదుల పరిష్కార శాతం 62 శాతంగా నమోదైంది.

ఎన్నెన్నో సమస్యల పరిష్కారం
- సంగారెడ్డి జిల్లా రామచంద్రాపూర్ మండలంలోని బెల్ లో తానియా తన కవల పిల్లల వైద్య సహాయం కోసం ప్రజావాణిని సంప్రదించారు. సీఎంఆర్ఎఫ్, క్రౌడ్ ఫండింగ్, సీఎస్సార్ నిధులతో కవల పిల్లల్లో ఓ శిశువు పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
- నల్గోండ జిల్లా కట్టంగూర్ మండలం యెరసాని గూడెం గ్రామానికి చెందిన కొమ్మనబోయిన పిచ్చయ్య తన పట్టాదార్ పాస్ పుస్తకం కోసం 46 ఏళ్లుగా పోరాడుతున్నారు. ప్రజావాణిని సంప్రదించడంతో దశాబ్దాల కల ఫలించి పిచ్చయ్యకు పాస్ పుస్తకం జారీ చేశారు.
- ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం నందిగాం గ్రామానికి చెందిన మెస్రం లచ్చుకు ఎలుగుబంటి దాడిలో తీవ్ర గాయాలయ్యాయి. లచ్చుకు రూ.2లక్షల పరిహారం ప్రజావాణి చొరవతో లభించింది.
- నాగర్ కర్నూల్ జిల్లా గుండాల గ్రామానికి చెందిన చరణ్ అనే విద్యార్థి గుండె ఆపరేషన్ చేయించుకోవడంతో అతన్ని సమీపంలోని పాఠశాలకు బదిలీ చేశారు.
- నల్గొండ జిల్లా పట్టంపల్లి గ్రామానికి చెందిన సుధాకరరెడ్డి తన భూమి రెవెన్యూ రికార్డుల్లో తప్పులు ఉన్నాయని ఫిర్యాదు చేశారు.పదేళ్లుగా పరిష్కారం కానీ సమస్య ప్రజావాణితో అతని సమస్యను 15 రోజుల్లో పరిష్కారమైంది. ఇలా పలు సమస్యలను ప్రజావాణి ద్వారా పరిష్కరించారు.


Read More
Next Story