
ఫిరాయింపు ఎంఎల్ఏల విచారణపై పెరుగుతున్న ఉత్కంఠ
నోటీసులకే సమాధానం పంపని దానం నాగేందర్ 13వ తేదీ విచారణకు హాజరవుతారా ?
బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏల రెండోవిడత విచారణను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 6వ తేదీనుండి మొదలుపెట్టబోతున్నారు. సుప్రింకోర్టు ఆదేశాల ప్రకారం పదిమంది ఫిరాయింపు ఎంఎల్ఏల(BRS Defection MLAs) విచారణను స్పీకర్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికి నలుగురు ఎంఎల్ఏల విచారణను ముగించారు. ఇంకా ఆరుగురు ఎంఎల్ఏలను విచారించాల్సుంది. పదిమంది ఎంఎల్ఏలను విచారించి రిపోర్టును అక్టోబర్ 31వ తేదీలోగా సమర్పించాలని స్పీకర్ ను సుప్రింకోర్టు పోయిన జూలైలో ఆదేశించిన విషయం తెలిసిందే.
కోర్టులో విచారణ జరిగినట్లుగానే ఇపుడు స్పీకర్ సమక్షంలో కూడా ఫిరాయింపు ఎంఎల్ఏలు, వారి తరపు లాయర్లు అలాగే ఫిరాయింపు ఎంఎల్ఏలపై సుప్రింకోర్టులో కేసులు దాఖలుచేసిన బీఆర్ఎస్ ఎంఎల్ఏలు, వారితరపు లాయర్లు వాద, ప్రతివాదనలు వినిపిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఎల్ఏల్లో అత్యధికులు తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని, పార్టీ ఫిరాయించలేదని బలంగా వాదిస్తున్నారు. ఫిర్యాదుచేసిన బీఆర్ఎస్ ఎంఎల్ఏలేమో పదిమంది ఎంఎల్ఏలు బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారని బల్లగుద్ది చెబుతున్నారు.
ఈనెల 6వ తేదీన భద్రాచలం ఎంఎల్ఏ తెల్లం వెకట్రావు, జగిత్యాల ఎంఎల్ఏ సంజయ్ కుమార్ విచారణ జరగబోతోంది. అలాగే 13వ తేదీన బాన్సువాడ ఎంఎల్ఏ పోచారం శ్రీనివాసరెడ్డి, ఖైరతాబాద్ ఎంఎల్ఏ దానం నాగేందర్ విచారణ జరుగుతుంది. ఈ నలుగురు ఎంఎల్ఏల విచారణ పూర్తయిన తర్వాత మిగిలిన ఇద్దరు ఎంఎల్ఏల విచారణకు కూడా స్పీకర్ తేదీలను ప్రకటిస్తారు. మొదట్లో పదిమంది ఫిరాయింపు ఎంఎల్ఏలకు స్పీకర్ నుండి నోటీసులు అందాయి. వారిలో ఎనిమిది మంది ఎంఎల్ఏలు నోటీసులకు సమాధానాలను కూడా ఇచ్చారు. తాము పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదనే అందరు సమాధానాలు చెప్పారు. మిగిలిన ఇద్దరు ఎంఎల్ఏలు దానం నాగేందర్, కడియం శ్రీహరి స్పీకర్ నోటీసులకు సమాధానాలను పంపలేదు.
నోటీసులకే సమాధానం పంపని దానం నాగేందర్ 13వ తేదీ విచారణకు హాజరవుతారా ? అన్నది అనుమానంగా ఉంది. విచారణకు హాజరుకాకపోతే స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. మహాయితే మరోసారి నోటీసులు జారీచేస్తారంతే. అప్పటికీ విచారణకు హాజరుకాకపోతే ఏమవుతుందో చూడాలి. ఈనేపధ్యంలో 6వ తేదీనుండి మొదలవ్వనున్న మలివిడత విచారణ ఉత్కంఠగా మారుతోంది. వివిధ కారణాలతో విచారణ ఆలస్యం అవుతోంది కాబట్టే విచారణ గడువును మరో రెండునెలలు పొడిగించాలని అసెంబ్లీ తరపు లాయర్ సుప్రింకోర్టులో 15 రోజుల క్రితమే పిటీషన్ దాఖలుచేశారు. ఇప్పటివరకు సుప్రింకోర్టు ఆపిటీషన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకున్నదో తెలీదు. ఈనేపధ్యంలోనే స్పీకర్ మలివిడత విచారణ మొదలుపెడుతున్నారు. ఇది ఎలాగ జరుగుతుందో చూడాలి.

