
ఇండియన్ ఆర్మీకి మద్ధతుగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు
ఆపరేషన్ సింధూర్ కార్యక్రమంలో భాగంగా వీరోచితంగా పోరాడుతున్న భారత సైనికులకు మద్ధతుగా శుక్రవారం తెలంగాణలోని దేవాలయాల్లో పూజలు చేయాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది.
పాకిస్థాన్ ఉగ్రవాదులు తరచూ భారత దేశంలో ఉగ్రదాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో భారత త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ ను చేపట్టాయి. పాక్ ముష్కరులను మట్టుబెట్టడంతోపాటు ఉగ్రవాదులకు ఊతం అందిస్తున్నా పాక్ పై వీరోచితంగా పోరాడుతున్న భారత సైనికులకు మద్ధతుగా శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ నిర్ణయించింది.
రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు
భారత సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా భారత వైమానిక దళం, నావికాదళం, సైన్యానికి దైవిక బల రక్షణ,ఆశీస్సులు ఉండాలని తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ సూచనలననుసరించి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ పార్వతీ సమేత రాజరాజేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చండీ సహిత రుద్ర హోమం
శౌర్యానికి, ధైర్యానికి ప్రతీకలైన భారత సైనికుల భద్రత, ఆరోగ్యం, శ్రేయస్సు కోసం దేశవ్యాప్తంగా శాంతి, సామరస్యం నెలకొనాలని ఆలయంలో చండీ సహిత రుద్ర హోమం నిర్వహించారు. భారతావని పై ఆ పరమేశ్వరుడి కృపా కటాక్షం ఉండాలని, భారత సాయుధ దళాలకు సంపూర్ణ దిగ్విజయం చేకూరాలని దక్షిణ కాశీ గా పేరు గాంచిన వేములవాడ ఆలయ అర్చకులు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.
ఆపరేషన్ సిందూర్ లో ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న 6ఎ , 6బి విభాగాల దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ పూజల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిథులు, ప్రముఖులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనవచ్చని దేవాదాయ శాఖ డైరెక్టరు కోరారు.