
Surrogacy Portal | ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ‘సరోగసీ’ పోర్టల్
అందుకనే అర్జంటుగా ప్రత్యేకంగా ఒక పోర్టల్ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది
సృష్టిఫెర్టిలిటీసెంటర్ దెబ్బకు ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కళ్ళు బైర్లు కమ్మినట్లున్నాయి. అందుకనే అర్జంటుగా ప్రత్యేకంగా ఒక పోర్టల్ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. విషయం ఏమిటంటే సరోగసీ(Surrogacy centers) అక్రమ కేసులు వెలుగుచూస్తున్న నేపధ్యంలో అక్రమాలకు అడ్డుకట్టవేయాలని రేవంత్(Revanth) ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఇందులో భాగంగానే సరోగసీ కోసమే ప్రత్యేకంగా పోర్ట(Special Portal for Surrogacy)ల్ తీసుకురావాలని నిర్ణయించింది. ఈమేరకు వైద్యా ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పోర్టల్ రెడీ అయిన తర్వాత సరోగసీ విధానాన్ని అనుసరించే ఫెర్టిలిటీ సెంటర్లు(Fertility Centers), సరోగసీ ద్వారా బిడ్డలు కావాలని అనుకుంటున్న తల్లి, దండ్రులు ఇద్దరూ ఈ ప్రత్యేక పోర్టల్ లోనే తమ వివరాలను నమోదు చేసుకోవాలి. ఈ పోర్టల్ ను వైద్యా ఆరోగ్య శాఖే నిర్వహిస్తుంది.
నిజానికి ఇప్పటికే సరోగసీ ద్వారా పిల్లలు కావాలని అనుకునేవారికి పోర్టల్ అందుబాటులో ఉంది. అయితే ఆ పోర్టల్ జిల్లా స్ధాయిలో, రాష్ట్రస్ధాయిలోనే కాకుండా న్యాయస్ధానం ద్వారా దరఖాస్తు చేసుకునేట్లుగా దేనికదే విడివిడిగా ఉంటోంది. దీనివల్ల ఏమవుతోందంటే ఏపోర్టల్లో ఎంతమంది తమపేర్లను నమోదుచేసుకుంటున్నారనే వివరాలు అందుబాటులో ఉండటంలేదు. దీన్నే ఫెర్టిలిటీ సెంటర్లు అవకాశంగా తీసుకుని అక్రమాలకు తెరలేపుతున్నాయి. ఇందులోకూడా ప్రభుత్వందగ్గర అనుమతులు తీసుకున్న కేంద్రాలు కొన్ని, అనధికారికంగా మరికొన్ని సెంటర్లు నడుస్తున్నాయి. దీనివల్ల జనాల్లోనే కాకుండా ప్రభుత్వంలో కూడా అయోమయం పెరిగిపోతోంది. మొన్నటి సృష్టి ఫెర్టిలిటి సెంటర్ దెబ్బకు తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని ఫెర్టిలిటీ సెంటర్లున్నాయో చూద్దామంటే ప్రభుత్వం దగ్గర లెక్కలు సరిగాలేవు.
ప్రభుత్వవర్గాల సమాచారం ప్రకారం మొత్తం 379 ఫెర్టిలిటీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇందులో సుమారు 80 కేంద్రాలకు మాత్రమే లైసెన్సులున్నట్లు తనఖీల్లో తేలింది. మిగిలిన కేంద్రాలన్నీ అనధికారికంగానే నడుస్తున్నాయి. హైదరాబాద్ జిల్లాలో 126, మేడ్చల్ లో 40, రంగారెడ్డిలో 47, వరంగల్ లో 27, కరీంనగర్లో 13, ఖమ్మంలో 8, నిజామాబాద్ లో 8 కేంద్రాలున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. మిగిలిన జిల్లాల్లో కూడా ఉన్నాయి కాని తక్కువగా ఉన్నాయి. అందుకనే ఫెర్టిలిటీ కేంద్రాల నమోదును కూడా ప్రత్యేక పోర్టల్ ద్వారానే నిర్వహించాలనే నిబంధనను ప్రభుత్వం తీసుకురాబోతోంది. పోర్టల్ రెడీ అయితే ఇటు కేంద్రాలు, అటు దంపతులు ఇద్దరు పోర్టల్ నమోదుచేసుకోవటం వల్ల వివరాలు సక్రమంగా ఉంటాయి. కేంద్రాలు నమోదుచేసుకునేటపుడే ప్రభుత్వం డాక్టర్ల లైసెన్సులను తనిఖీ చేస్తుంది. అలాగే వివరాలను నమోదుచేసుకునే దంపతుల బ్యాక్ గ్రౌండ్ కూడా చెక్ చేస్తుంది. దీనివల్ల అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తున్నది.
అలాగే కేంద్రాలను ఎప్పటికప్పుడు తనిఖీచేయటానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటుచేసింది. ఇవే బృందాలు ఇకముందు కూడా ఫెర్టిలిటీ కేంద్రాలను తనిఖీచేస్తు పోర్టల్లో వివరాలు ఇచ్చినట్లుగానే నిబంధనలను పాటిస్తున్నాయా లేదా అన్న విషయాలు చెక్ చేస్తాయి. ఏ కేంద్రమైనా నిబంధనలను అతిక్రమించినట్లు గుర్తిస్తే వెంటనే సదరు కేంద్రంపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని రేవంత్ ఆదేశించారు. ఇప్పటికే గుర్తించిన లోపాలను సవరించుకోవటానికి వైద్య, ఆరోగ్య శాఖ కేంద్రం నిర్వాహకులకు అవకాశమిచ్చారు. అలాగే అనధికార కేంద్రాలను మూయించేస్తు, నిర్వాహకులపై కేసులు నమోదుచేసి అరెస్టులు చేస్తున్నారు.