![మంత్రివర్గంలోకి రాబోయే ‘ఆ నలుగురు’ ఎవరో ? మంత్రివర్గంలోకి రాబోయే ‘ఆ నలుగురు’ ఎవరో ?](https://telangana.thefederal.com/h-upload/2025/01/26/508358-revanth.webp)
మంత్రివర్గంలోకి రాబోయే ‘ఆ నలుగురు’ ఎవరో ?
మంత్రివర్గంలో కొత్తగా నలుగురుకి ఛాన్సు దక్కచ్చని పార్టీవర్గాల సమాచారం
రేవంత్ ఢిల్లీకి చేరుకోగానే ఒక్కసారిగ ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. తొందరలో మంత్రివర్గ విస్తరణ ఖాయమనే ప్రచారం ఒకవైపు, మంత్రివర్గంలో చోటు దక్కొంచుకోబోయే అదృష్టవంతులు ఎవరనే విషయంలో ఊహాగానాలు మరోవైపు పెరిగిపోతున్నాయి. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కొత్తగా నలుగురుకి ఛాన్సు దక్కచ్చని పార్టీవర్గాల సమాచారం. అందుకనే ఆ నలుగురు ఎవరనే విషయంలో పార్టీలో విస్తృతమైన చర్చలు పెరిగిపోతున్నాయి. మంత్రివర్గ విస్తరణ అంశం చాలాకాలంగా పెండింగులో ఉంది. లోక్ సభ ఎన్నికలు అయినదగ్గర నుండి అదిగో మంత్రివర్గ విస్తరణ..ఇదిగో మంత్రివర్గ విస్తరణ అంటు ఊహాగానాలు వినబడుతునే ఉన్నాయి. ఇందులో భాగంగానే రేవంత్(Revanth) ఢిల్లీ పర్యటన సందర్భంగా క్యాబినెట్ లో చోటుదక్కించుకోబోయే అదృష్టవంతులు ఎవరో ? అనే విషయంలో కొందరిపేర్లు వినబడుతున్నాయి.
నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుండి ఇపుడు మంత్రవర్గంలో ప్రాతినిధ్యం లేదు. పార్టీవర్గాల సమాచారం ప్రకారం మంత్రివర్గ విస్తరణకు మాత్రమే రేవంత్ పరిమితం అవుతారా ? లేకపోతే ప్రక్షాళన కూడా చేస్తారా అన్నది అనుమానంగా మారింది. విస్తరణ మాత్రమే ఉంటుందంటే కొత్తగా కొంతమందిని మంత్రివర్గంలోకి తీసుకుంటారనే క్లారిటి వచ్చేస్తుంది. అలాకాకుండా ప్రక్షాళన తప్పదని అంటే కొత్తవారిని తీసుకోవటంతో పాటు ఇపుడున్న మంత్రుల్లో కొందరికి ఉధ్వాసన తప్పదు. ప్రక్షాళన అంటే అది వేరేసమస్యకు దారితీసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే, మంత్రివర్గంలో నుండి బయటకు వెళ్ళిన వాళ్ళు ఊరికే కూర్చోరుకదా ? రేవంత్ కు వ్యతిరేకంగా తయారవుతారు. తమనియోజకవర్గాల్లో అవకాశముంటే జిల్లాల్లో వ్యతిరేకవర్గాన్ని కూడగట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెడతారనటంలో సందేహంలేదు.
ఇపుడు విషయం ఏమిటంటే మంత్రివర్గం(Telangana Cabinet)లో చోటుకోసం చాలామంది ప్రయత్నిస్తున్నారు. దానం నాగేందర్, సుదర్శన్ రెడ్డి, మాణిక్ రావు, ప్రేమ సాగర్ రావు, ఆది శ్రీనివాసరావు, అజరుద్దీన్(Mohammed Azaruddin), షబ్బీర్ ఆలీ పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. ప్రస్తుత మంత్రివర్గంలో మైనారిటీలు( Muslim Minorities) ఎవరూ లేరు. రేవంత్ ప్రమాణస్వీకారం చేసేటపుడే షబ్బీర్ లేదా అజరుద్దీన్ ను తీసుకోవాలని ప్రయత్నంచేశాడు. అయితే అందుకు అధిష్టానం అంగీకరించకపోవటంతో సాధ్యంకాలేదు. ఎన్నికల్లో ఓడిపోయిన వారిని మంత్రివర్గంలోకి తీసుకోవటానికి అధిష్టానం అంగీకరించలేదు. షబ్బీర్, అజారుద్దీన్ ఇద్దరు నిజామాబాద్ రూరల్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో పోటీచేసి ఓడిపోయారు.
సరే, అప్పట్లో అంటే అధిష్ఠానం ఒప్పుకోలేదు కాబట్టి పై ఇద్దరిలో ఎవరినీ తీసుకోలేదు. కాని పార్టీ మొత్తంమీద గెలిచిన ముస్లిం మైనారిటీలే ఎవరూ లేరు. కాబట్టి ఐదేళ్ళ మంత్రివర్గం నుండి ముస్లింమైనారిటీలను దూరంగా ఉంచటం సాధ్యంకాదు. అందుకనే పై ఇద్దరిలో ఎవరో ఒకళ్ళని మంత్రివర్గంలోకి తీసుకునేట్లుగా అధిష్ఠానాన్ని ఒప్పించేందుకు రేవంత్ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు పార్టీవర్గాల సమాచారం. మొత్తంమీద ఈనెల 27వ తేదీన మూడు ఎంఎల్సీ సీట్లకు ఎన్నికలు అయిపోగానే మంత్రివర్గంపై అధిష్ఠానం ఏదో ఒక నిర్ణయం చెబుతుందనే ప్రచారమైతే పెరిగిపోతోంది. ఎంఎల్సీ ఎన్నికల పోలింగ్ అయిపోగానే, స్ధానిక సంస్ధల ఎన్నికల్లోగా మంత్రివర్గంపై నిర్ణయం ఉంటుందని అంటున్నారు. మరి అధిష్ఠానం ఆ ముచ్చట ఎప్పుడు చెబుతుందో చూడాలి.