Mahesh Kumar Goud
x

మంత్రుల మధ్య విభేదాలు.. చిన్న విషయమేనన్న మహేష్ కుమార్

మా కుటుంబ సమస్యలు తామే పరిష్కరించుకుంటామన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్.


కాంగ్రెస్ మంత్రుల మధ్య విభేదాలు ఆందోళన చెందాల్సినంత పెద్ద అంశాలు కాదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అది చాలా చిన్న విషయమని చెప్పారు. మంత్రుల మధ్య వివాదాలు అనేవి తమ కుటుంబ సమస్య అని, దానిని తామే పరిష్కరించుకుంటామని తేల్చి చెప్పారు. మంత్రుల మధ్య విభేదాలకు సమాచారలోపమే కారణమని అన్నారు. వాటిపై దృష్టి సారించామని, అన్ని సమస్యలు అతి త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే‌కు వైద్యులు ఇటీవల పేస్‌మేకర్‌ను అమర్చారు. ఈ నేపథ్యంలో సోమవారం ఖర్గేను మహేష్ కుమార్ గౌడ్.. ఢిల్లీలో కలిసి పరామర్శించారు. ఈ భేటీ అనంతరం ఆయన తెలంగాణలో మంత్రుల మధ్య తలెత్తిన వివాదాలు, విభేదాలపై స్పందించారు. ఆ పరిణామాలను ఖర్గేకు వివరించినట్లు చెప్పారు. అన్ని సమస్యలను అతి త్వరలోనే పరిష్కరిస్తామని కూడా వెల్లడించారు.

కొండా వర్సెస్ పొంగులేటి..

వరంగల్ జిల్లాలో మేడారం ఆలయ టెండర్ల విషయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ మధ్య వివాదం జరుగుతోంది. అసలు వరంగల్‌లో పొంగులేటి పెత్తనం ఏంటని కొండా దంపతులు నిలదీస్తున్నారు. అంతేకాకుండా పొంగులేటిపై పార్టీ హైకమాండ్‌కు కూడా ఫిర్యాదు చేశారు. పొంగులేటిపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ‘‘మేడారం టెండర్ల విషయంలో ఇన్‌ఛార్జ్ మంత్రి పొంగులేటి జోక్యం చేసుకుంటుననారు. దేవాదాయశాఖకు చెందిన రూ.71 కోట్ల టెండర్‌ను తన మనిషికి ఇప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు నాకు చెందిన దేవాదాయశాఖలో పొంగులేటి జోక్యం ఎందుకు?’’ అని ఆమె ప్రశ్నించారు. ఈ అంశంపై ఏఐసీసీ చీఫ్ ఖర్గే, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఫిర్యాదు చేసినట్లు కొండా దంపతులు చెప్పారు. ఈ అంశం తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయి. అంతేకాకుండా ఇవి ప్రతిపక్షాలకు మంచి ఆయుద్ధంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై పార్టీ హైకమాండ్.. ఫోకస్ పెట్టింది.

మొన్నటి వరకు లక్ష్మణ్, పొన్నం వివాదం..

మొన్నటి వరకు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య వివాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాను వెనకబడిన కులం వ్యక్తిని కాబట్టే తనను పొన్నం ప్రభాకర్ దుర్భాషలాడారని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, అడ్లూరి లక్ష్మణ్.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశానికి అడ్లూరి లక్ష్మణ్ కాస్త ఆలస్యంగా వచ్చారు. దాంతో ఆయన రాని సమయంలో లక్ష్మణ్‌ను ఉద్దేశించి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు అక్కడే ఉన్న మైక్‌లో రికార్డ్ అయ్యాయి. అవి కాస్తా తీవ్ర దుమారం రేపాయి. ఈ అంశంపై అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ జాతి వాడనని తనను అలా అనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ‘‘జరిగిన పొరపాటును ఒప్పుకుని క్షమాపణ చెప్తే పొన్నం ప్రభాకర్‌కు గౌరవంగా ఉంటుంది. మాదిగలు అంటే మీకు అంత చిన్న చూపా. అన్న మాటను సమర్థించుకుంటూ ఇప్పటి వరకు మౌనంగా ఉన్నావంటే ఈ విషయం నీ విజ్ఞతకే వదిలేస్తున్నా’’ అని అన్నారు. ఆ తర్వాత పొన్నం ప్రభాకర్.. అడ్లూరి లక్ష్మణ్‌కు క్షమాపణలు కూడా చెప్పారు. అనంతరం మంత్రులు అంతా కలిసి బ్రేక్‌ఫాస్ట్ కూడా చేశారు. దీంతో ఆ వివాదానికి అంతటితో శుభం కార్డు పడింది. దానిని మరువకముందే పొంగులేటి, కొండా ఎపిసోడ్ స్టార్ట్ అయింది.

ఈ విధంగా మంత్రుల మధ్య వరుస విభేదాలు అధికం అవుతున్న క్రమంలో ఈ అంశం హైకమాండ్‌కు చేరింది. దీనిపై ఫోకస్ పెట్టి మంత్రుల మధ్య వివాదాలకు చెక్ పెట్టాలని నిశ్చయించుకుంది. కాగా ఇవి పెద్ద అంశాలు కాదని, ఇది చాలా చిన్న అంశమని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అతి త్వరలోనే మంత్రుల మధ్య ఉన్న సమాచార లోపాన్ని పరిష్కరిస్తామని, విభేదాలకు చెక్ పెడతామని చెప్పారు. ఇప్పటికే అన్ని అంశాలను పార్టీ పరిశీలిస్తోందని చెప్పారు.

Read More
Next Story