
ఒక్కసారిగా కూలిన శ్రీశైలం టన్నెల్.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం
ఎస్‌ఎల్‌బీసీ ఎడమవైపు టన్నెల్ పనులు జరుగుతుండగా సుమారు 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం చోటుచేసుకుంది.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ దగ్గర భారీ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా టన్నెల్ పైకప్పు కూలిపోయింది. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట దగ్గర మూడు మీటర్ల మేరా టన్నెల్ పైకప్పు కూలింది. శనివారం ఉదయం 8:30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఎస్‌ఎల్‌బీసీ ఎడమవైపు టన్నెల్ పనులు జరుగుతుండగా సుమారు 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం చోటుచేసుకుంది. టన్నెల్ బోర్ మిషన్‌తో పని జరుగుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో టన్నెల్‌లో ఏడుగురు కార్మికులు ఉన్నారు. వారిని రక్షించడానికి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతన్నట్లు సమాచారం. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రమాద సమయంలో భారీ శబ్దం రావడంతో చుట్టుపక్క కార్మికులు టన్నెల్‌లోకి పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించి సమాచారం అందిన వెంటనే నీటిపారుదల శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. ఈ ఘటనపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలు కూడా ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశాయి.
సీఎం రేవంత్ కీలక ఆదేశాల
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదం పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్. ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు అందించాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇరిగేషన్ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక హెలీకాప్టర్ లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి బయలుదేరారు. అంతేకాకుండా ఈ ఘటనపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరా తీశారు. టెక్నికల్ అధికారులు, వర్క్ చేస్తున్న ఏజెన్సీ ప్రతినిధులతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
ప్రమాదం ఎలా జరిగింది: కవిత
శ్రీశైలం ప్రాజెక్ట్ ఎడమ కావుల టన్నెల్ కూలడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. అసలు ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఏంటి? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో పదికిలోమీటర్ల మేరా టన్నెల్ నిర్మించినా ఏ రోజూ ఇటువంటి ప్రమాదం జరగలదని, కానీ ఇప్పుడు ప్రమాదం జరగడానికి అసలు కారణం ఏంటని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభించిన నాలుగు రోజులకే ప్రమాదం జరిగింది? దీనికి బాధ్యులు ఎవరు? నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఈ ప్రమాదం స్పందించాలని డిమాండ్ చేశారు. రానున్న కాలంలో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.