ఒక రాజకీయ సభ,మృత్యు వేదికగా మారింది. తమిళనాట పెను విషాదంపై దేశం ఉలిక్కిపడింది.చోటుచేసుకుంది. తమిళ సినీ నటుడు, తమిళ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ శనివారం కరూర్‌లో నిర్వహించిన రోడ్‌షోలో తొక్కిసలాట ఏకంగా 42 మంది ప్రాణాలు తీసింది.భారీగా అభిమానులు తరలి రావడం కార్నర్ మీటింగ్ కావడం తొక్కిలలాటకు కారణమైంది.రోడ్లు మొత్తం కిక్కిరిసిపోయాయి. ఈ విషాదంలో 42 మంది మరణించగా,వంద మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో ఏడుగురు పిల్లలు, 17 మంది వరకు మహిళలు ఉన్నారు.తన సభల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న బస్సు పైకి ఎక్కి విజయ్ ప్రసంగం ప్రారంభించగానే, అభిమానులు ఉర్రూతలూగిపోయారు. ఆయన ప్రసంగం మధ్యలోనే తొక్కిసలాట మొదలైంది. దాంతో విజయ్ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. అక్కడే వున్న అంబులెన్స్ లలో తొక్కిల లాటలో గాయపడిన వారిని వెంటనే కరూర్ ఆసుపత్రికి తరలించినా , మృతుల సంఖ్య భారీగా పెరిగి పోయింది.
దర్యాప్తునకు తమిళనాడు ప్రభుత్వం ఆదేశం
కరూర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు స్టాలిన్ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున సాయం చేస్తామని సీఎం స్టాలిన్ తెలిపారు. తొక్కిసలాట ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి లక్ష రూపాయలు పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ హుటాహుటిన కరూర్ వెళ్లి అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు..మరోవైపు తొక్కిసలాట ఘటనపై విచారణకు ఆదేశించారు . తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులను తెలుసుకోడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సాక్ష్యాలను సేకరించే అవకాశం ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు.ఈ తొక్కిసలాటలో ఆరుగురు చిన్నారులు, 16 మంది మహిళలు మరణించారని రాష్ట్ర మంత్రి సుబ్రమణియన్ తెలిపారు. 40 మందికి పైగా గాయపడి కరూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఇతర ఆసుపత్రుల నుండి వైద్యులను, ఫోరెన్సిక్ నిపుణులను కరూర్ ప్రభుత్వ ఆసుపత్రికి రప్పించినట్లు ఆయన వెల్లడించారు.
”ప్రజలు ప్రాణాలు కోల్పోవడం అందరి హృదయాలను కలచివేసింది. ఈ పూడ్చలేని నష్టాన్ని చవిచూసిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఆసుపత్రిలో చేరిన వారందరికీ ఉత్తమ వైద్య చికిత్స అందించాలని ఆదేశించాను. మృతుల కుటుంబాలను కలవడానికి, నా సంతాపాన్ని తెలియజేయడానికి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించడానికి కరూర్‌కువచ్చాను” అని సీఎం స్టాలిన్ తెలిపారు.ఘటనపై దర్యాప్తు కోసం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి అరుణా జగదీశన్ నేతృత్వంలో ఏకసభ్య విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేశామని సీఎం స్టాలిన్ చెప్పారు.
ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
కరూర్ తొక్కిసలాట ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలియజేస్తూ, "తమిళనాడులోని కరూర్‌లో జరిగిన రాజకీయ ర్యాలీలో చోటుచేసుకున్న దురదృష్టకర సంఘటన చాలా బాధాకరం. ఆప్తులను కోల్పోయిన వారికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని ఆయన 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు.మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కరూర్ మృతులకు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ ఈ ఘటనపై వివరాలు సేకరిస్తోంది.అమిత్ షా సీఎం స్టాలిన్, గవర్నర్ రవిలతో ఫోనులో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరారు.
తొక్కిసలాట ఎలా జరిగింది?
తమిళ నటుడు విజయ్ టీవీకే పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభించారు. గత మూడు వారాలుగా ప్రతి శని, ఆదివారాల్లో ‘ర్యాలీ’లు నిర్వహిస్తున్నారు. శనివారం నామక్కల్, కరూర్‌లో సభలు ఏర్పాటు చేశారు. ఉదయం పది గంటలకు నామక్కల్ రావాల్సిన విజయ్, మూడు గంటలు ఆలస్యంగా అక్కడికి చేరుకున్నారు. సాయంత్రం 3 గంటలకు కరూర్‌లోని వేలుచామిపురం వద్దకు విజయ్ వస్తారని నిర్వాహకులు ప్రకటించారు. కానీ ఉదయం 11 గంటల నుంచే కరూర్ వీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు యువకులతోపాటు పిల్లలు, మహిళలూ భారీగా తరలి వచ్చారు. ఎండ మండిపోతున్నా లెక్క చేయకుండా గంటలకొద్దీ వేచి చూశారు. చివరికి నాలుగు గంటలు ఆలస్యంగా రాత్రి 7 గంటల తర్వాత విజయ్ అక్కడికి చేరుకున్నారు. దీంతో ఉదయం నుంచి ఆతృతగా వున్న జనం విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా ముందుకు తోసుకు వచ్చారు.ప్రసంగం మధ్యలో విజయ్ నీళ్ల బాటిల్స్ జనం పైి విసరడం కూడా తోపులాకు కారణం గా చెబుతున్నారు.