నాగార్జునసాగర్ టు శ్రీశైలం లాహిరి లాహిరిలో...
x

నాగార్జునసాగర్ టు శ్రీశైలం లాహిరి లాహిరిలో...

కృష్ణానదీ నీటి వరవళ్లు..నాగార్జునకొండ, నందికొండ, సలేశ్వరం నల్లమల్ల అందాలను తిలకిస్తూ సాగుతున్న నాగార్జునసాగర్ టు శ్రీశైలం లాంచీ ప్రయాణం శనివారం ప్రారంభమైంది.


గల గల పారుతున్న కృష్ణానదిలో లాంచీలో విహార యాత్రను తెలంగాణ పర్యాటక శాఖ శనివారం ప్రారంభించింది. నాగార్జునసాగర్ టు శ్రీశైలం 120 కిలోమీటర్ల దూరం 6 గంటల ప్రయాణం పర్యాటకుల కేరింతల మధ్య ప్రారంభమైంది. నాగార్జున కొండ, నందికొండ, సలేశ్వరం నల్లమల్ల అటవీ అందాల మధ్య సాగిన ఈ అద్భుత ప్రయాణం పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంది.


కార్తీకమాసం తొలిరోజే...
తెలంగాణ ప్రకృతి పర్యాటకులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు అద్భుత బోటు ప్రయాణాన్ని కార్తీక మాసం తొలిరోజు తెలంగాణ పర్యాటకశాఖ ప్రారంభించింది. గత ఐదేళ్లుగా ప్లాన్ చేస్తున్నప్పటికీ నాగార్జునసాగర్ డ్యాం లో సరైన మట్టంలో నీటి లభ్యత లేకపోవడం, కరోనా మహమ్మారి తదితర కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది.

కృష్ణానదీ పరవళ్లు
ప్రస్తుతం వర్షాకాల సీజనులో విస్తృతస్థాయిలో వర్షాలు కురవడం వల్ల కృష్ణానదిలో నీటి పరవళ్లు కొనసాగుతున్నాయి. కృష్ణానది తీరం వెంట అటు శ్రీశైలం నుంచి ఇటు నాగార్జునసాగర్ డ్యాం వరకు గరిష్ఠ మట్టంలో నీటి లభ్యత ఉండటం వల్ల రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ శనివారం నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీప్రయాణాన్ని ప్రారంభించింది.120 కిలోమీటర్ల దూరం ఉండే ఈ లాంచీ ప్రయాణానికి మొట్టమొదటి రోజున తెలంగాణ రాష్ట్రం తో పాటు పరిసర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు తరలి వచ్చారు.



మర్చిపోలేని మధుర అనుభూతి

పర్యాటకులు నాగార్జున సాగర్ నుంచి నందికొండ మీదుగా, ఏలేశ్వరం, సలేశ్వరం, తూర్పు కనుమలు, నల్లమల అటవీ ప్రాంత అందాలను చూసేలా లాంచీ ప్రయాణానికి పర్యాటక శాఖ శనివారం శ్రీకారం చుట్టింది.కృష్ణానదిలో ప్రయాణం వినూత్న అనుభూతినిచ్చిందని నల్గొండ జిల్లాకు చెందిన హెడ్మాస్టర్ గంజి మారయ్య ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. కృష్ణాతీరంలో లాంచీలో ప్రయాణం తమ కుటుంబ సభ్యులకు మర్చిపోలేని మధుర అనుభూతినిచ్చిందని ఆయన చెప్పారు.



సోమశిల నుంచి శ్రీశైలం టూర్

మరో టూరిజం ప్యాకేజి నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ సేవలను కూడా శనివారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. కొల్హాపూర్ మండలం సోమశిల తీరంలో 120మంది ప్రయాణించేలా ఏసీ లాంచీని అధికారులు శనివారం ప్రారంభించారు.శ్రీశైలం వరకు 120 కిలోమీటర్లు) 7 గంటల పాటు లాంచీ ప్రయాణం ఉంటుంది.నాగార్జునసాగర్‌ డ్యాంలో నీటి మట్టం 575 అడుగులు ఉన్నంత వరకు ప్రయాణికుల రద్దీని బట్టి శ్రీశైలానికి లాంచీలు నడిపిస్తామని పర్యాటక అధికారి వెంకటరమణ చెప్పారు.


Read More
Next Story