పాత బస్తీలో కొత్త దేవత,  బీజేపీ కోర్కెలు తీర్చేనా!
x
Bhagyalakshmi Temple

పాత బస్తీలో 'కొత్త దేవత', బీజేపీ కోర్కెలు తీర్చేనా!

పార్లమెంట్ ఎన్నికల వేళ హైదరాబాద్ చార్మినార్ చెంత ఉన్న భాగ్యలక్ష్మీ దేవాలయం దర్శనానికి బారులు తీరుతున్నారు. ఎందుకంత హడావిడి... వివరాలు


హైదరాబాద్ పాత నగరంలోని చార్మినార్ మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయం విశేషమయినది.

కొత్త దేవాలయాలు వస్తుంటాయి. కొత్త ఉత్సవాలు జరుగుతుంటాయి. కాని, కొత్త దేవతలు పుట్టుకురావడం జరగదు. ఎందుకంటే, దేవతలు ఆద్యంతాలు లేని వాళ్లు. వాళ్ల పేరుతో గుళ్లు గోపురాలు నిర్మాణమవుతుంటాయి. వీటికి ఆసక్తికరమయిన స్థలపురాణం ఉంటుంది.అది ఇప్పటి రాజకీయాలకు అతీతంగా ఉంటుంది. అయితే, హైదరాబాద్ లోని పాత బస్తీలో ఒక కొత్త దేవత వెలిశారు. ఆమ్మవారి పేరు భాగ్య లక్ష్మి.

ఆమె పేరుతో చార్మినార్ పక్కనే గుడి కట్టారు. ఈ గుడికి యాభై అరవై సంత్సరాలకంటే ఎక్కువ చరిత్ర ఉండదు. ఆలయం ఉనికిలోకి ఎలా వచ్చినా, ఇపుడది ఒక వర్గానికి రాజకీయాాలయంగా మారింది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న పాతబస్లీలో ఉండటం, దానికి తోడు హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో ఎఐఎంఐఎం అభ్యర్థి అసదుద్డీన్ ఒవైసీని ఓడించాలనే ధ్యేయం ఉండటంతో ఈ గుడి భారతీయ జనతా పార్టీకి గ్రౌండ్ జీరో అయింది. గుడి చుట్టూ భక్తి భావం కంటే రాజకీయ సందడే ఎక్కువ ఉంటుంది.... ఈ వాతావారణం మీద ఫెడరల్ తెలంగాణ ప్రత్యేక కథనం

కిటకిట లాడుతోంది

భాగ్యలక్ష్మి ఆలయం రాజకీయ నాయకుల ప్రదక్షిణలతో కిటకిటలాడుతోంది. సాధారణ భక్తులే కాకుండా రాజకీయ నేతల కోరిన కోర్కెలను తీర్చే అమ్మవారిగా పేరుంది. దీంతో వివిధ పక్షాల నేతలు అమ్మవారి దర్శనం చేసుకునేందుకు తరలివస్తున్నారు.

అత్యంత పురాతన చార్మినార్ చెంత ఆగ్నేయ మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం 1960వ సంవత్సరంలో ప్రతిష్ఠించారు. ప్రస్థుతం ఈ ఆలయాన్ని హిందూ ట్రస్ట్ నిర్వహిస్తోంది. 2012వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని విస్తరిస్తుండగా హైకోర్టు దాన్ని నిలిపివేసింది. ఆలయ చరిత్ర ఎలా ఉన్నా, భాగ్యలక్ష్మీ ఆలయం రాజకీయ నేతలకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారింది. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిగా కొంపెల్ల మాధవీలతను ప్రకటించగానే ఆమె కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కలిసి భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకొని, అక్కడ ప్రత్యేక పూజలు చేసి ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
2020 మార్చి 11 వతేదీ : కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది. అంతే ఆయన మొట్టమొదటిసారి చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేసి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఎన్నికలు వచ్చినా, సందర్భం ఏదైనా బండి సంజయ్ అమ్మవారి దర్శనంతోనే కార్యక్రమాలు మొదలు పెట్టారు.

అమ్మవారి సన్నిధిలో బండి సంజయ్


2020 జీహెచ్ఎంసీ ఎన్నికలు...2020 డిసెంబరులో జరిగిన కీలకమైన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ అభ్యర్థుల ఖరారు తర్వాత అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్ ఎన్నికల్లో గెలవాలని మొక్కుకున్నారు. అప్పట్లో భాగ్యలక్ష్మీ దేవాలయం కేంద్రంగానే రాజకీయాలు సాగాయి. అప్పట్లో వరద సాయం నిలిపివేతకు బీజేపీనే కారణమని టీఆర్ఎస్ ఆరోపించడంతో తాను ఈసీకి లేఖ రాయలేదని బండి సంజయ్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేశారు. కేసీఆర్ ను కూడా దేవాలయానికి రావాలని బండి సవాలు విసిరారు. ఆ ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన అమిత్ షా కూడా భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ ఎన్నికల్లో బీజేపీకి 48 సీట్లు రావడంతో బండి సంజయ్ కార్పొరేటర్లతో కలిసి దేవాలయానికి వచ్చి మొక్కు తీర్చుకున్నారు.

2022 జనవరి 2 : భాగ్యలక్ష్మీ టెంపుల్ ను టచ్ చేసి సూడుర్రి అని బండి సంజయ్ సవాలు విసిరారు. చార్మినార్ వద్ద నమాజ్ కోసం రషీద్ ఖాన్ సంతకాల సేకరణ చేపట్టారు. దీంతో ఇన్ని సంవత్సరాలుగా గుర్తుకు రాని నమాజ్ ఇప్పుడే గుర్తుకు వచ్చిందా అని బండి ప్రశ్నించారు. భాగ్యలక్ష్మి గుడి తొలగించి చూడండి చూస్తాం అని ఆయన హెచ్చరించారు. చార్మినార్ వద్ద బీజేపీ సభ పెట్టి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నాం,
2022 : బీజేపీ అప్పటి రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను భాగ్యలక్ష్మీ దేవాలయం నుంచి ప్రారంభించారు.
2022 : భాగ్యలక్ష్మీ దేవాలయంలో అమ్మవారికి అప్పటి సీఎల్పీ నేత, ప్రస్థుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పూజలు చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ భాగ్యలక్ష్మి టెంపుల్ బండి సంజయ్ జాగీరా, ఎవరైనా నీకు రాసిచ్చారా అని ప్రశ్నించారు.

భాగ్యలక్ష్మీ దేవాలయంలో పూజలు చేస్తున్న బీజేపీ శాసనసభ్యులు


2024 డిసెంబరు : అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు అయ్యే ముందు భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశాకే వెళ్లారు.

2024 జనవరి : బీజేపీ విజయ సంకల్ప యాత్రను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయం నుంచి ప్రారంభించారు. ఇలా సందర్భం ఏదైనా బీజేపీ నేతలు ఆలయం చుట్టూనే ప్రదక్షిణలు చేస్తున్నారు. అమిత్ షానే కాదు యూపీ సీఎం యోగిఆదిత్యనాథ్, కేంద్రమంత్రులు అనురాగ్ ఠాకూర్, జ్యోతిరాదిత్య సింధియా, జి కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ లు ఈ అమ్మవారిని దర్శించుకున్నారు.
బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి,బండారు దత్తాత్రేయ, లక్ష్మణ్ లు కొన్ని వందలసార్లు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారని ఆలయ ట్రస్టీ శశికళ చెప్పారు.

అమ్మవారి సన్నిధిలో అమిత్ షా పూజలు


రాజకీయ నేతల వరుస ప్రదక్షిణలు

భాగ్యలక్ష్మీ దేవాలయానికి ఎక్కువగా బీజేపీ నేతలు నిత్యం సందర్శిస్తుంటారు.దీంతో అమ్మవారి మహత్యం గురించి తెలుసుకున్న ఇతర పార్టీల నేతలు కూడా ఈ ఆలయానికి బారులు తీరుతున్నారు. బీఆర్ఎస్ నేతలు కల్వకుంట్ల కవిత, పోచారం శ్రీనివాసరెడ్డి, హరీష్ రావు, మాజీ గవర్నర్ తమిళసై లు కూడా ఆలయాన్ని సందర్శించారు. వీరే కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రస్థుత ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతోపాటు దామోదర్ రాజనర్సింహ, అంజన్ కుమార్ యాదవ్ తదితర కాంగ్రెస్ నేతలు కూడా ఈ ఆలయానికి వచ్చారు.


అమ్మవారికి పూజలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి


భాగ్యలక్ష్మీ ఆలయం...ప్రమాణం చేద్దాం రండి
బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లకు కూడా భాగ్యలక్ష్మీ ఆలయం వేదికగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీలోకి వస్తానని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వరరెడ్డి స్వయంగా చెప్పారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన మహేశ్వరరెడ్డి ఐదుగురు కాంగ్రెస్ మంత్రులు తమ బీజేపీతో టచ్ లో ఉన్నారని,48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించి సంచలనం రేపారు. దీనిపై స్పందించిన కోమటిరెడ్డి ప్రతి సవాలు విసిరారు. ‘‘కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, అమిత్ షాలతో నేను మాట్లాడానని చెప్పారు కాబట్టి వారితో కలిసి చార్మినార్ ఆలయానికి వస్తే ప్రమాణం చేద్దామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాలు చేశారు. నేతల ప్రత్యేక పూజలకే కాదు ప్రమాణాలు చేసేందుకు కూడా భాగ్యలక్ష్మీ ఆలయం వేదికగా మారింది.

ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది : ఆలయ ట్రస్టీ శశికళ
సాధారణ భక్తులే కాదు వివిధ పార్టీల రాజకీయ నేతలు భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయ సందర్శనకు వస్తున్నారని ఆలయ ట్రస్టీ శశికళ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ‘‘పార్లమెంట్ ఎన్నికల వేళ తమ ఆలయాన్ని సందర్శించే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది, వివిధ పార్టీలకు చెందిన బడా నేతలు సైతం అమ్మవారి దర్శనం కోసం తరలివస్తున్నారు’’ అని ఆలయ ట్రస్టీ శశికళ చెప్పారు. తన సోదరులు పూజారులుగా ఉండగా, తాను ఆలయ ట్రస్టీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని ఆమె చెప్పారు. చార్మినార్ ఎంత ఫేమస్సో తమ భాగ్యలక్ష్మీ ఆలయానికి అంత పేరు ప్రఖ్యాతులు లభించాయని,దీంతో ఆలయంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిందని శశికళ చెప్పారు. ఉగాది, దసరా సందర్భంగా తాము దేవాలయంలో అష్టమి హోమం నిర్వహిస్తున్నామని చెప్పారు. దీపావళి, బోనాల సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని ట్రస్టీ వివరించారు.

పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల కోరికలు తీరేనా?
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శనం చేసుకొని, తమను ఎన్నికల్లో గెలిపించాలని అమ్మవారిని కోరికలు కోరుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు వారి కోరికలు తీరుతాయో లేదో పార్లమెంట్ ఓట్ల లెక్కింపు తేదీ జూన్ 4వతేదీ వరకు వేచిచూడాల్సిందే.


Read More
Next Story