పెద్దమనసున్న తెలంగాణ పేద ఎమ్మెల్యే కథ ఇది...
x
కలెక్టరు సత్పతికి చెక్కు అందిస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

పెద్దమనసున్న తెలంగాణ పేద ఎమ్మెల్యే కథ ఇది...

కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పెద్దమనసు చాటుకున్నారు. తనకు ఎమ్మెల్యేగా వచ్చే మొదటి నెల జీతాన్ని మేడిపల్లి సత్యం కలెక్టరు పమేలా సత్పతికి అందించారు.


కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పెద్దమనసు చాటుకున్నారు. తాను చదువుకునే సమయంలో పడిన కష్టాలు తన అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పడకూడదనే నిశ్చయించుకున్నారు. తనకు ఎమ్మెల్యేగా వచ్చే మొదటి నెల జీతాన్ని మేడిపల్లి సత్యం కరీంనగర్ జిల్లా కలెక్టరు పమేలా సత్పతికి అందించి, దాన్ని పిల్లల అల్పాహారం కోసం వినియోగించాలని కోరి అందరికీ ఆదర్శంగా నిలిచారు. భవిష్యత్‌లో తన చొప్పదండి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద పిల్లల కష్టాలు తీరుస్తానంటున్న ఎమ్మెల్యే సత్యంను పలువురు అభినందించారు. నేడు ఎమ్మెల్యే అయిన మేడిపల్లి సత్యం బాల్యంలో పడిన కష్టాలేమిటి? ఆయన సమస్యలను అధిగమించి పీహెచ్‌డీ వరకు చదివి సాధించిన విద్యా విజయాలేమిటి? విద్యార్థి నేత నుంచి ఎమ్మెల్యే దాకా ఎదిగిన వైనంపై ‘ద ఫెడరల్ తెలంగాణ’ స్ఫూర్తిదాయక కథనంలో తెలుసుకుందాం రండి.

ఆకలితో అలమటిస్తూనే చదువుకున్నా...

‘‘నేను రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటలో నిరుపేద దళిత కుటుంబంలో జన్మించి, కష్టపడి చదివి ఉన్నత విద్య అభ్యసించారు. నాడు నా ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వల్ల టిఫిన్ చేయకుండా, మధ్యాహ్న భోజనం బాక్సు కూడా లేకుండానే ఆకలితోనే పాఠశాలకు వెళ్లి చదువుకున్న రోజులున్నాయి. చదువు అంటే ఎంతో ఇష్టంతో పీహెచ్‌డీ చేశాను. నాడు పేదరికం వల్ల నేను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవుకున్నాను. పదవ తరగతిలో రిజల్ట్స్ కోసం పాఠశాలలో అదనపు తరగతులు నిర్వహించేవారు. కడుపునిండా తినక పోవడంతో ఆకలితో అలమటిస్తూనే నాడు నేను చదువుకున్న రోజులు నేడు నాకు ఇప్పటికీ గుర్తుకు వస్తుంటాయి. అందుకే నేను కరీంనగర్ జిల్లా చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఇటీవల ఘన విజయం సాధించిన తర్వాత తనలాగా తన నియోజకవర్గ పిల్లలు బాధలు పడొద్దని నా జీతం డబ్బును పిల్లల అల్పాహారం కోసం వెచ్చించాను’’ అంటారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. తాను చేస్తున్న సేవలకు తన భార్య, ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన రూపాదేవి కూడా సహకారం ఉందంటారు ఎమ్మెల్యే సత్యం. ఉస్మానియా యూనివర్శిటీలో చదువుకునే సమయంలో ప్రేమించి పెద్దల ఆమోదంతో కులాంతర వివాహం చేసుకున్న సత్యం ప్రజా సేవల్లో ముందుంటున్నారు. పీహెచ్‌డీ లాంటి ఉన్నత చదువులు చదివిన సత్యం తమ నియోజకవర్గ ఎమ్మెల్యే అవడం తమ ప్రజల అదృష్టమంటారు చొప్పదండి మండల కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాసరెడ్డి. పిల్లల కష్టాలు తెలిసిన ఉన్నత విద్యావంతుడు కాబట్టే ఆయన జీతాన్ని పేద పిల్లల కోసం విరాళంగా అందించారని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

పేద విద్యార్థుల అల్పాహారం కోసం ఎమ్మెల్యే నెల జీతం విరాళం

పేద దళిత కుటుంబంలో జన్మించిన మేడిపల్లి సత్యం ఆత్మవిశ్వాసంతో కష్టపడి పీహెచ్‌డీ వరకు చదివారు. ప్రభుత్వ వసతిగృహాల్లో ఉండి పీహెచ్‌డీ వరకు చదివిన తనకు పేద విద్యార్థుల కష్టాలు తెలుసునంటారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. విద్యార్థి దశలో ప్రభుత్వ హాస్టళ్లలో పడిన కష్టాలు తనకు తెలుసు కాబట్టే తన మొదటి నెల జీతం డబ్బును పేద విద్యార్థుల అల్పాహారం కోసం అందించానని సత్యం చెప్పారు. చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తన మొదటి నెల జీతం రూ.1.50 లక్షల చెక్కును తన నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థుల అల్పాహారం కోసం విరాళంగా కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి అందించారు. తాను పీహెచ్‌డీ చదివేందుకు నాటి ఉస్మానియా యూనివర్శిటీ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ తిరుపతిరావు ప్రోత్సహించారని చెబుతుంటారు మేడిపల్లి సత్యం. పేదరికం నుంచి వచ్చినా తన గురువు ప్రోత్సాహం వల్లనే తాను ఉన్నత చదువు అభ్యసించానంటారు. చదువులో చురుకుగా ఉంటూ విద్యార్థి నాయకుడిగా ఉస్మానియా యూనివర్శిటీలో తోటి విద్యార్థులకు సేవలందిస్తున్న మేడిపల్లి సత్యంకు విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలున్నాయంటారు ఉస్మానియా యూనివర్శిటీ మాజీ వీసీ ఆచార్య తిరుపతిరావు. విద్యార్థి దశ నుంచి మానవతా విలువులున్న సత్యం ప్రజాప్రతినిధి అయితే ప్రజలకు మేలు జరుగుతుందని నిరూపించారని తిరుపతిరావు వ్యాఖ్యానించారు.

కోరుట్లపేటలో జననం

చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే కొనసాగింది. ఈయన పదవ తరగతి వరకు బొప్పాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో చదివారు. అనంతరం 1999వ సంవత్సరంలో కామారెడ్డి పట్టణంలోని జీవీఎస్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివారు. తర్వాత 2012వ సంవత్సరంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో బీఏ చదివారు. ఆ తర్వాత 2005వ సంవత్సరంలో ఉస్మానియా యూనివర్శిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేశారు. 2012వ సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే పొలిటికల్ సైన్సులో పీహెచ్‌డీ చేశారు.

మలుపు తిప్పిన విద్యార్థి రాజకీయాలు

విద్యార్థి రాజకీయాలు, తెలంగాణ ఉద్యమ పోరాటం మేడిపల్లి సత్యం జీవితాన్ని మలుపు తిప్పాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సత్యం చదువుకుంటూనే విద్యార్థి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ఎస్‌యూఐ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం ఉస్మానియా యూనివర్శిటీ ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడిగా తెలంగాణ కోసం ఉద్యమించారు. అనంతరం 2012వ సంవత్సరంలో కరీంనగర్ లోక్‌సభ యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మేడిపల్లి సత్యం ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించి ప్రజాసేవలో అడుగుపెట్టారు.

చొప్పదండి నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా రూపొందిస్తా...

ఒక విద్యాధికుడిగా తన చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా రూపొందిస్తానని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో చొప్పదండిలో డిగ్రీ కళాశాలతోపాటు మరిన్ని ప్రభుత్వ విద్యాసంస్థలు ఏర్పాటు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తన నియోజకవర్గంలోని ప్రభుత్వ వసతిగృహాలను మెరుగుపర్చి, నిరుపేదలు చదువుకునేందుకు తన వంతు సాయం చేస్తానంటారు సత్యం. పేద విద్యార్థులైనా చదువుతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని చెబుతూ పిల్లల్లో విద్యా స్ఫూర్తి నింపుతున్న మేడిపల్లి సత్యంను అందరూ అభినందిస్తున్నారు.


Read More
Next Story