మూగబాలుడిపై వీధికుక్కల దాడి
x

మూగబాలుడిపై వీధికుక్కల దాడి

స్పందించిన రేవంత్ రెడ్డి


హయత్ నగర్ మన్సూరాబాద్‌లో మూగబాలుడిపై కుక్కల దాడి ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పందించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి అధికారులను అడిగి వివరాలు సేకరించారు. అతడికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. వీధికుక్కల సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు.

ఎల్బీనగర్‌ మన్సూరాబాద్‌ సమీపంలోని శివగంగ కాలనీలో వీధికుక్కల సమస్య నెలలతరబడి ఉంది. ఎన్నిసార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో మంగళవారం పొద్దుపోయాక 15 నుంచి 20 వీధి కుక్కలు ఒకేసారి దాడి చేయడంతో మూగ బాలుడు తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. ప్రకాశం జిల్లాకు చెందిన సీహెచ్‌ తిరుపతిరావు, చంద్రకళ దంపతులు మన్సూరాబాద్‌ సమీపంలోని కాలనీలో ఉంటున్నారు. వీరి కుమారుడు చింటు పుట్టుకతో మూగ అని కుటుంబ సభ్యులు తెలిపారు. చింటూ ఇంటి నుంచి వీధిలోకి వెళ్లినప్పుడు ఒక్కసారిగా కుక్కలు దాడి చేశాయి. మూగబాలుడు కావడంతో పెద్దగా కేకలు వేయలేకపోయాడు. కుక్కలు తరుముతూ అతడిపై దాడి చేశాయి. కాలి పిక్కలు కొరికేసి మరీ కరిచాయి. ఇది గమనించిన ఓ స్థానికుడు కర్రతో కుక్కలను తరిమికొట్టి 108కు సమాచారం ఇచ్చారు. తొలుత నల్లకుంటలోని ఫీవర్‌ ఆసుపత్రికి, తర్వాత వైద్యుల సూచనతో నిలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అత్యవసర వార్డులో ఉంచి చికిత్స చేస్తున్నారు. ఈ ఘటనలో బాలుడి చెవి తెగి పోయింది. కుక్కల దాడివల్ల తల, నడుము, వీపు భాగాల్లో రక్త సిక్తమైంది. స్థానికుడి జోక్యంతో కుక్కల దాడిలో చింటూ ప్రాణాలతో బయటపడ్డాడని వైద్యులు తెలిపారు.


చలించిపోయిన రేవంత్ రెడ్డి

ఈ ఘటన గూర్చి పత్రికల ద్వారా తెలుసుకున్న ముఖ్యమంత్రి చలించిపోయారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన జీహెచ్ ఎంసీ కమిషనర్ కు ఫోన్ చేసి బాధితుడిని స్వయంగా పరామర్శించి తక్షణం మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. బాలుడి ఆరోగ్యం మెరుగుపడాలని ముఖ్యమంత్రి ఆకాక్షించారు.

బాలుడి తల్లిదండ్రులు తాపీ మేస్త్రీ పని చేసేవారని పోలీసులు తెలిపారు. మూగబాలుడు కావడంతో చింటూ ఇంట్లోనే ఉంటున్నట్లు వారు చెప్పారు.

Read More
Next Story