‘ఆపరేషన్ సిందూర్’పై దుష్ప్రచారం.. కీలక ప్రకటన చేసిన సైబర్ సెల్
x

‘ఆపరేషన్ సిందూర్’పై దుష్ప్రచారం.. కీలక ప్రకటన చేసిన సైబర్ సెల్

సోషల్ మీడియాను నిశితంగా పర్యవేక్షిస్తున్న అధికారులు.


పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ చేసింది. అర్థరాత్రి సమయంలో పాకిస్థాన్, పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు చేసింది. ఈ ఆపరేషన్‌ను దేశమంతా కొనియాడుతుంటే.. కొందరు మాత్రం దుష్ప్రచారం చేస్తున్నారు. అసలు ఆపరేషన్ సింధూర్ జరగలేదని అంటున్నవారు కూడా ఉన్నారు. ఇంకొందరు ఈ ఆపరేషన్‌పై సెటైర్లు కూడా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆపరేషన్ సిందూర్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తామని తెలిపింది. శత్రువులపై భారత్ చేసిన ఈ సర్జికల్ స్ట్రైక్స్‌ను ఉద్దేశించి ఎవరైనా తప్పుడు సమాచారం, తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేసింది.

‘‘ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించి తప్పుడు వార్తలు, సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. సోషల్ మీడియాను నిశితంగా పర్యవేక్షిస్తున్నాం. అలాంటి సందేశాలు ఎవరైనా షేర్ చేసినట్లు తెలిస్తే వారి సమాచారాన్ని 8712672222కు వాట్సాప్ ద్వారా పంపవచ్చు’’ అని సైబర్ సెక్యూరిటీ సెల్ వెల్లడించింది.

తెలంగాణలోని శాతవాహన యూనివర్సిటీలో ప్రొఫెసర్, తెలంగాణ విద్యాకమిషన్ సభ్యురాలు ఎస్ సుజాత.. ఆపరేషన్ సిందూర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రమంతా దుమారం రేపాయి. ‘సింధూరం అంటే రక్త సింధూరం లాంటిదా ? నేనేదో భక్తి, పూజ, శుభానికి సంకేతం అనుకునేదాన్ని...యుద్ధాలు శవాలను, శకలాలను మిగులుస్తాయి కాని శాంతిని కాదు’ అని ఆమె చేసిన కామెంట్‌పై నెటిజన్లు మండిపడ్డారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన వారు అనేకం. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి తప్పుడు సమాచారం, తప్పుడు వార్తలు జోరుగా ప్రచారం అవుతుండటాన్ని ప్రభుత్వం గమనించింది. వాటిని అడ్డుకోవాలని సైబర్ సెల్‌కు సూచించింది. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో ‘ఆపరేషన్ సింధూర్’పై తప్పుడు పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదని స్పష్టం చేస్తూ సైబర్ సెక్యూరిటీ సెల్ హెచ్చరికలు జారీ చేసింది.

మరోవ్యక్తి అయితే అసలు సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదు. ఓ గేమ్‌లో విజువల్స్‌ను స్ట్రైక్స్ పేరుతో షేర్ చేస్తున్నారని కూడా రాసుకొచ్చారు. ‘గేమింగ్ వీడియో ఫుటేజ్‌లను షేర్ చేసి.. అవి భారత ఆర్మీ జరిపిన దాడి వీడియోస్ లాగా తెగ చేస్తున్న గొర్రెలు, అవి నిజమే అన్నట్టు పబ్లిష్ చేస్తున్న కొన్ని మీడియా, యూట్యూబ్ ఛానెళ్లకు రెండు నిమిషాలు మౌనం పాటిస్తూ’ అని సదరు వ్యక్తి చేసిన పోస్ట్ కూడా సంచలనంగా మారింది. ఇలాంటి ప్రతి పోస్ట్‌లు అధికం అవుతున్న క్రమంలో తెలంగాణ సైబర్ సెల్ అలెర్ట్ అయింది. ఆపరేషన్ సిందూర్‌కు వ్యతిరేకంగా ఎవరు పోస్ట్ పెట్టినా, పోస్ట్‌ను షేర్ చేసినా చర్యలు తప్పవని హెచ్చరించింది.

Read More
Next Story