పెద్ద రైతులే తెలంగాణ ‘రైతు బంధువులు: సెస్ అధ్యయనం
x

పెద్ద రైతులే తెలంగాణ ‘రైతు బంధు'వులు: సెస్ అధ్యయనం

రైతు బంధు ద్వారా పెద్ద రైతులే సరాసరి ఎక్కువ లాభపడ్డారు; యిది సమ్మిళిత విధానం కాదు


దేశంలో రైతులకోసం ఎన్నో పథకాలు ప్రారంభించినా తెలంగాణలోని రైతు బంధు వాళ్ళ పెట్టుబడి అవసరాలను తీర్చటంలో ఒక పెద్ద ముందడుగు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అది చిన్న, సన్నకారు, మధ్యతరగతి రైతులు వాళ్ళ పెట్టుబడి అవసరాలకు అనధికారిక ఋణాల మీద, వడ్డీవ్యాపారస్తుల పై ఆధారపడతటాన్ని తగ్గించింది.

తెలంగాణలో మొదలైన ఈ పథకం దేశంలోని అనేక రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ పిఎం కిసాన్ పథకాల అమలుకు నాంది పలికింది. భూమి కలిగిన ప్రతి రైతుకు ఎకరాకు రు. 10,000 యివ్వటం దీని ప్రత్యేకత. అయితే నిజమైన భూసాగుదారులైన కౌలు రైతులను మినహాయించటం ద్వారా భూమి పట్టాకలిగిన వారికే దాని లబ్ది చేకూరింది. భూమి కలిగి వ్యవసాయం చేయని వారిని, పన్ను చెల్లింపుదారులను యిందులో చేర్చటంతో యిది రాష్ట్ర ఖజానాకు భారంగా మారింది.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం 91 శాతం లబ్దిదారులు చిన్న సన్నకారు రైతులే. 52 లక్షల పథకం లబ్దిదారులలో ఐదు ఎకరాల కంటే తక్కువ ఉండే 47 లక్షల మంది రైతుల వద్ద 90 లక్షల ఎకరాలు భూమి ఉంది. ఐదు ఎకరాల లోపు ఉన్న చిన్న రైతు కుటుంబాలకు సరాసరి నగదు బదిలీ ద్వారా సంవత్సరానికి రు. 14,500 వస్తుండగా, అంతకంటే ఎక్కువ భూమి కలిగిన కేవలం ఐదు లక్షల కుటుంబాలు రు. 89,075 పొందుతున్నాయి. ఈ గణాంకాలు పథకం వలన చిన్న రైతులకంటే పెద్ద వారికే ఎక్కువ మేలు జరుగుతోందని స్పష్టం చేస్తున్నాయి. వివిధ అధ్యయనాలు తెలంగాణ తో సహా వివిధ రాష్ట్రాలలో రైతుల ఆత్మహత్యలలో కౌలు రైతుల శాతం ఎక్కువగా వుండటాన్ని నమోదు చేస్తున్నాయి.

కౌలు రైతులకు కూడా ప్రయోజనాలు దక్కేలా పథకాన్ని మార్పు చేయాలని ‘సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్’ (Centre for Economic and Social Studies: CESS) అసిస్టెంట్ ప్రొఫెసర్ వై. శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. ఆయన విశ్లేషణ 'ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ' (Economic and Political Weekly : EPW)లో అచ్చయింది.

రాష్ట్రంలో భూ యాజమాన్యం:

రాష్ట్రంలో ఒక హెక్టార్ కంటే తక్కువ వున్న రైతుల సంఖ్య 1970-71 లో 38.45 శాతం నుండి 2015-16 లో 64.56 శాతానికి పెరిగింది. ఇదే కాలంలో వారు వ్యవసాయం చేసే భూమి 5.53 శాతం నుండి 23.69 శాతానికి పెరిగింది. భూకమతాలలో 1970-71 లో చిన్న రైతులు 57.53 శాతం భూములు కలిగి వుండి, 14.46 శాతం భూమిని సాగుచేశారు. ఇవి 2015-16 నాటికి 88.25 శాతం భూకమతాలకు పెరిగాయి. వారు 61.67 శాతం భూమిని సాగుచేస్తున్నారు. ఇలా వ్యవసాయంలో చిన్న భూకమతాల సంఖ్యలో పెరుగుదల నమోదు అయ్యింది. యిదే సమయం లో పెద్ద రైతుల వద్ద సరాసరి 14.22 హెక్టార్లు వున్నాయి.

వ్యవసాయం చేసే కుటుంబాలలో 24 శాతం కౌలు రైతులు వారు మొత్తం భూమిలో 13.65 శాతాన్ని సాగుచేస్తున్నారు. వీరు సాగుచేస్తున్న భూమిని అధికారిక గణాంకాలు తక్కువ చేసి చూపుతున్నాయి. దేశంలో రైతుల ఆత్మహత్యలలోనూ 80 శాతం వీరే. పెరుగుతున్న కౌలు యితర ఖర్చులు తద్వారా వారిపై పడే భారాన్ని భరించలేక వీరు తనువు చాలిస్తున్నారు. ఈ మరణాలను ఆపటానికి చాలా రాష్ట్రాలు తెలంగాణ పథకాన్ని ఆదర్శంగా తీసుకుని నగదు బదిలీ పథకాలను ప్రవేశపెట్టాయి.

2018 ఖరీఫ్ లో 58.33 లక్షల రైతులకు ఎకరాకు రు. 4,000 తో మొదలై అమలు అయ్యింది. రాష్ట్ర వ్యవసాయ విభాగం ప్రతి సీజన్ లో ను ఎంత మంది రైతులకు ఎంత భూమికి నగదు బదిలీ జరిగిందనే గణాంకాలు విడుదల చేస్తుంది. ఈ సంఖ్య 2020-21 నాటికి 61.08 లక్షల రైతులకు పెరిగింది. వారు సాగుచేస్తున్న భూమి 132.12 లక్షల ఎకరాలకు పెరిగింది. తద్వారా దీని క్రింద జరిగే నగదు బదిలీ, పథకం మొదలు పెట్టినప్పుడు అయిన రు. 10,488.19 కోట్ల నుండి రు. 14,565.55 కోట్లకు పెరిగింది.

కౌలు రైతుల సంఖ్య పెరుగుతున్న నేపధ్యంలో ఈ సొమ్ము వ్యవసాయం చేయని వారికి, పెరగుతున్న కౌలుతో తద్వారా ఏ సహాయం అందని వీరికి జరుగుతున్న నష్టం పై తగిన అధ్యయనం జరగలేదు, ఆ లోటును పూడ్చడానికే నాలుగు గ్రామాలను తీసుకుని పరిశీలన చేశామని శ్రీనివాసులు చెప్పారు.

నాలుగు గ్రామాల అధ్యయనం:

“ఈ పరిశీలన కోసం నాలుగు గ్రామాలను ఎంచుకున్నాం. అందులో ఒకటి కాలువలు, మరోటి బోర్ పంపులు, చెరువులతో పాటు ఒక వర్షాధార ఆధారంగా వ్యవసాయం చేసే గ్రామాలను వేరువేరు జిల్లా నుండి ఎంచుకున్నాం. మొత్తం ఐదు జిల్లాలలో 817 రైతు కుటుంబాల పైన అధ్యాయనం జరిగింది. యిందులో ఉత్తర తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా కు చెందిన వేములవాడ మండలం చెక్కపల్లి గ్రామం, తూర్పు వైపున భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలలోని బుస్సాపూర్, గరీబ్పేట గ్రామాలను ఎంచుకున్నాం. నాలుగవదిగా దక్షిణ తెలంగాణ సూర్యాపేట జిల్లా, నేరెడచర్ల మండలం, బాదలదిన్నే గ్రామాన్ని విశ్లేషణ చేశాం. వీరిలో 495 మంది (60.6 శాతం) బీసీ వర్గానికి చెందిన వారు అని తేలింది. భూకమతల శాతంలో 1/3 వ వంతు సెమీ మీడియం వర్గానికి చెందిన వారు అని తేలింది,” అని శ్రీనివాసులు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగాను బీసీ రైతులే అధిక సంఖ్యలో లాభపడ్డారని గణాంకాలు చెప్తున్నాయని ఆయన అన్నారు.

తెలంగాణ ప్రభుత్వ 2021 రాష్ట్ర వ్యాప్త గణాంకాలు యిదే విషయాన్ని దృవీకరిస్తున్నాయి. 70.82 లక్షల ఎకరాలు సాగుచేస్తున్న బీసీ లు రు. 3,540.82 కోట్లు నగదు బదిలీ ద్వారా పొందారు. 12.7 లక్షల అగ్రకులాల కుటుంబాలు 30 శాతం డబ్బు పొందారు. ఎస్సీ లబ్ధిదారులు 13 శాతం వున్నా వారు పొందిన లాభం తక్కువ.

లబ్ది పొందటంలో సామాజిక వర్గాల మధ్య వున్న ఈ అసమానతలను తొలగించటానికి మరింత లక్షిత జోక్యం అవసరాన్ని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.

రైతు బంధు పథకం పరిధిలోకి రాని వర్గాలు, కారణాలు:

అధ్యయనం జరిగిన గ్రామాలలో ఎస్టి లకు చెందిన 50 శాతం భూమికి రైతు బంధు రావటం లేదని తేలింది. వారికి పట్టాదార్ పాస్ పుస్తకం యితర అవసరమైన డాక్యుమెంట్స్ లేకపోవటం వలన రావటం లేదు. అదే అగ్రకులాలకు చెందిన 80.32 శాతం భూమికి రైతు బంధు వస్తుండగా మిగిలిన భూములకు ఆధార్, బ్యాంకు ఖాతాలు లింకు కాకపోవటం యితర అవసరమైన డాక్యుమెంట్ లు లేకపోవటం తో రావటం లేదు. పెద్ద రైతులకు చెందిన 85.53 శాతం భూమికి రైతు బంధు వస్తోంది. భూమి డాక్యుమెంట్ లను సరిచేసి వివిధ సామాజిక వర్గాల మధ్య ఈ వ్యత్యాసం పరిష్కరించి అసమానతలను తొలగించాల్సిన అవసరం వుంది.

అగ్రకులానికి చెందిన మిశ్రమ కౌలుదారులు (స్వంత భూమి వున్న కౌలుదారులు) 31.2 శాతం కాగా, బీసీ లలో వారిది 29 శాతం. పూర్తిగా భూమిలేని కౌలు రైతుల సంఖ్య ఎస్సీ లలో ఎక్కువ. అయితే వారు కేవలం 6.7 శాతం భూమిని మాత్రమే సాగుచేస్తున్నారు.

ఒరిస్సా కు చెందిన కాలియ పథకాన్ని (Krushak Assistance for Livelihood and Income Augmentation) రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమి వున్న రైతులకు పరిమితం చేశారు. అక్కడ భూమిలేని రైతులకు, కౌలు రైతులకు, చేతివృత్తి కళాకారులకు సంవత్సరానికి రు. 10,000 నుండి రు. 11,000 యివ్వడం ద్వారా మరింత సమ్మిళిత పథకం గా అమలు అవుతోంది. అయితే రాష్ట్రంలోని రైతు బంధు పథకం కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులను పూర్తిగా మినహాయిస్తోంది.

పథకంలో మార్పు అవసరం, చర్యలు:

పథకాన్ని రైతు భరోసా గా పేరు మారుస్తూ 2023 లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పడావు పడ్డ భూములు, సాగుచేయని భూములు, రియల్ ఎస్టేట్ గా మారిన భూములను దాని పరిధి నుండి తీసి వేయటానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యం లో ఒక కమిటీ ని ఏర్పాటు చేసింది. దీని మార్గదర్శకాలు ప్రకారం ఐదు ఎకరాలకు భరోసా సాయాన్ని పరిమితం చేయాలని పేర్కొన్న అది అమలు కాలేదు.

కాంగ్రెస్ ప్రభుత్వం జూన్, 2025 లో 15 ఎకరాలు వున్న 67.01 లక్షల రైతులకు రు. 8,284.66 కోట్లు రైతు భరోసా గా యిచ్చింది. ఒక అంచనా ప్రకారం పథకాన్ని ఐదు ఎకరాలకు పరిమితం చేస్తే 34 శాతం రైతు బంధు క్రింద పెడుతున్న ఖర్చు తగ్గుతుందని అంచనా.

ఒక అధ్యయనం ప్రకారం తెలంగాణ లో 23 శాతం భూమిని కౌలు రైతులు సాగుచేస్తున్నారు. నీటి పారుదల సౌకర్యం వున్న చోట్ల కౌలుతో పాటు కౌలు రేట్ లు ఎక్కువగా వున్నాయని అది తేల్చింది.

పరిస్థితి లో మార్పు కోసం కౌలు రైతులను గుర్తించేందుకు గ్రామం లో సర్పంచ్, వీఆర్వొ, స్వయం సహాయక సంఘాల నుండి యిద్దరు మహిళలతో ఒక కమిటీని ఏర్పాటుచేసి వారిని గుర్తించాలని, శ్రీనివాసులు తన విశ్లేషణ లో ప్రతిపాదించారు. వారి ద్వారానే లోన్ ఎలిజిబిలిటీ కార్డులు యివ్వాలని చెప్పారు.

ఆంధ్ర ప్రదేశ్ కౌలు రైతుల చట్టం 2011 క్రింద కౌలు రైతులకు బ్యాంకు అప్పు, ఇన్షూరెన్స్ తదితర ప్రభుత్వ సహాయం అందే అవకాశం వున్నా అది రాష్ట్రం లో అమలులో లేదు. దేశంలో 75 శాతం రైతు ఆత్మహత్యలు చిన్న రైతులు, కౌలు రైతులవే అయినా పరిస్థితి లో మార్పు కోసం ప్రయత్నాలు మృగ్యం.

తెలంగాణ లో పంట విలువలో కౌలు గా 50 శాతం చెల్లిస్తున్నారని శ్రీనివాసులు చేసిన అధ్యయనం తేల్చింది.

కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక లో కౌలు రైతులను గుర్తిస్తామని వారికీ రు. 15,000 రైతు భరోసా యిస్తామని చెప్పినా మాట నిలబెట్టుకోలేదు. రైతు బంధు పొందుతున్న భూములకు భరోసా మొత్తాన్ని రు. 10,000 నుండి రు. 12,000 కు మాత్రం పెంచింది, అని రైతు స్వరాజ్య వేదిక కార్యకర్త బి. కొండల్ రెడ్డి చెప్పారు.

22 లక్షల మంది కౌలు రైతులు రాష్ట్రం లో వున్నారని. 40 శాతం భూమి వారే సాగు చేస్తున్నారని. తాము అధికారం లోకి రాగానే వాళ్ళను పంట నష్టాలు జరిగినప్పుడు ఆదుకుంటామని, రైతు బంధు రు. 15,000 వారికి వర్తింప చేస్తామని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి వారికి హామీ యిస్తూ ఒక బహిరంగ లేఖ రాశారు. అయితే ఇంత వరకు వారిని గుర్తించటానికి అటువంటి ప్రయత్నం జరగక పోవడం కొసమెరుపు.

Read More
Next Story