
పాపం.. ర్యాంకుతో సరిపెట్టుకున్న సుదర్శనరెడ్డి
క్యాబినెట్ లో చోటు ఆశిస్తే చివరకు క్యాబినెట్ ర్యాంకు పదవి దక్కిందని స్వయంగా పొద్దుటూరే చెప్పారు
మనం చాలా అనుకుంటాము కాని ఒక్కోసారి అనుకున్నది అనుకున్నట్లు జరగదు. ఇపుడు పొద్దుటూరి సుదర్శనరెడ్డి విషయంలో కూడా అలాగే జరిగింది. బుధవారం ప్రభుత్వసలహాదారుగా క్యాబినెట్ పోస్టులో బాధ్యతలు తీసుకున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఉమ్మడి నిజామాబాద్(Nizamabad)జిల్లాలోని బోధన్(Bodhan segment) నియోజకవర్గం నుండి పొద్దుటూరి(P Sudarsan Reddy)సుదర్శనరెడ్డి 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు. చాలా సీనియర్, గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది అందులోను(Revanth)ఎనుముల రేవంత్ రెడ్డితో అత్యంత సన్నిహితముంది కాబట్టి మంత్రిపదవి గ్యారెంటీ అనుకున్నారు. అయితే రేవంత్ క్యాబినెట్లో పొద్దుటూరికి మంత్రిపదవి దక్కలేదు. పోనీ విస్తరణలో అయినా దక్కుతుందని తనకు తాను సర్దిచెప్పుకున్నారు.
విస్తరణ ముచ్చట దగ్గరపడే కొద్దీ పొద్దుటూరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని రేవంత్ కూడా చాలా ప్రయత్నించాడు. అయితే అధిష్ఠానం నో చెప్పేసింది. దాంతో విస్తరణలో కూడా అవకాశం జారిపోయింది. సామాజికవర్గ సమీకరణలు, సీనియారిటి లాంటి అనేక అంశాలను భేరీజు వేసుకుంటే మాజీమంత్రికి ఇప్పట్లో మంత్రిపదవి వచ్చే అవకాశం లేదని రేవంత్ కు అర్ధమైపోయింది. అందుకనే ఇదే విషయాన్ని చెప్పేసి ఒప్పించి చివరకు క్యాబినెట్ మంత్రి కాకపోయినా క్యాబినెట్ ర్యాంకుతో పదవిని కట్టబెట్టారు.
అంటే క్యాబినెట్ మంత్రి పదవిని ఆశించిన పొద్దుటూరి సుదర్శనరెడ్డి చివరకు క్యాబినెట్ ర్యాంకున్న సలహదారు పదవితో సరిపెట్టుకోవాల్సొచ్చింది. కాదు కూడదంటే చివరకు ఈ పోస్టు కూడా పోతుందేమో అని మాజీమంత్రి కూడా ఇష్టంలేకపోయినా అంగీకరించాల్సొచ్చింది. ఇందులో భాగంగానే బుధవారం మధ్యాహ్నం ప్రభుత్వ సలహదారుగా బాద్యతలు తీసుకున్నారు. ఇంతకీ ప్రభుత్వ సలహాదారుడంటే ఏమిచేస్తారు ? ప్రభుత్వానికి ఏ విషయంలో సలహాలు ఇస్తారు ? వీళ్ళిచ్చే సలహాలను ముఖ్యమంత్రి తీసుకుంటారా ?.. ఈవిషయాలను మాత్రం అడక్కూడదంతే.

