
తెలంగాణ కాంగ్రెస్‌కు ‘మహిళ’ కాక
తెలంగాణ కాంగ్రెస్ మహిళా వింగ్ అధ్యక్షురాలు సునీతారావుపై వేటు తప్పదా..!
ముందు నుయ్యి వెనక గొయ్యి.. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ఇదే. ఒకవైపు ప్రతిపక్షాలు విమర్శలు, ఆరోపణలతో ఊదరగొడుతుంటే. మరోవైపు సొంత పార్టీలో వర్గ పోరులు పంటికింద రాయిలా మారాయి. ముందుగా ఇంటి కష్టాలు తీర్చుకోవాలో.. రచ్చను బాగుచేసుకోవాలో అర్థం కావట్లేదు. ఇంతలో కాంగ్రెస్‌కు మహిళా నేతల నుంచి చిక్కొచ్చిపడింది.
మహిళా సాధికారతే తమ లక్ష్యం అని చెప్తున్న తెలంగాణ కాంగ్రెస్‌కు ఇప్పుడు మహిళా నేతలతోనే తలపోటు వచ్చి పడింది. కోటి మందిని కోటీశ్వరులం చేస్తామంటున్న కాంగ్రెస్.. కనీసం పదవులు కూడా ఇవ్వడం లేదని ఇటీవల మహిళా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ చీఫ్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతరావు అధ్యక్షతన నిరసన కూడా చేప్పట్టారు. కాంగ్రెస్ మహిళలంతా ఏకతాటిపై ఉన్నారు.. పార్టీ పదవుల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు? పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు ఇవ్వాలని పోరాటం చేస్తున్నారు అని అనుకోలోపే వారిలో కూడా వర్గాలు ఏర్పడ్డాయి. మొన్నటి వరకు పార్టీ జెండా మోసిన మహిళలకే పదవులు ఇవ్వాలన్న సునీతారావుకు వ్యతిరేకంగా ఇప్పుడు మరో వర్గం అవతరించింది. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు మంగళవారం గాంధీభవన్ మెట్లపై కొందరు మహిళా నేతలు నిరసన చేశారు.
‘సునీతారావు కో హటావో’ అంటూ నినాదాలు చేశారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ మేరకు కాంగ్రెస్ గోషామహల్ కంటెస్టెడ్ కార్పొరేటర్లు, నాయకులు పార్టీ అధిష్టానానికి ఓ లేఖ రాశారు. అందులో పలు కీలక అంశాలను పేర్కొన్నారు. ఇటీవల గాంధీభవన్‌లో చేసిన నిరసనలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌పై సునీతా రావు చేసిన అనుచిత వ్యాఖ్యలను కూడా వారు తమ లేఖలో పేర్కొన్నారు. సునీతారావుకు గోషామహాల్ ఎమ్మెల్యే టిక్కెట్, డబ్బులు ఇచ్చి పార్టీ సముచిత న్యాయం చేసిందని గుర్తు చేశారు. కానీ ఆమె మాత్రం నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎవరినీ కలవలేదని, సమస్యలను గాలికి వదిలేశారని, డబ్బులు తీసుకుని ప్రచారం చేయకుండా ఇంట్లో కూర్చున్నారంటూ వారు పేర్కొన్నారు. సునీతరావు బీఆర్ఎస్‌తో లోపాయికారి ఒప్పందంలో ఉన్నారని కూడా ఆరోపించారు.
రెండు వర్గాలుగా మహిళా నేతలు
దీంతో కాంగ్రెస్ పార్టీలోని మహిళా నేతలు రెండు వర్గాలుగా మారారన్న విషయం తేటతెల్లం అవుతోంది. సునీతారావు వర్గం.. జెండా మోసిన వారికి మొండి చేయి చూపుతోందని, తనకు రేవంత్ ఆసరాగా నిలవడం లేదని, మరోవైపు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ తనను టార్గెట్ చేశారని ఆరోపించారు. అంతేకాకుండా పార్టీ పదవులను కుటుంబీకులకు పప్పులుబెళ్లాలు పంచినట్లు పంచుతున్నారని విమర్శించారు. ఇప్పుడు ఆమెకు వ్యతిరేకంగా పార్టీలో మరో వర్గం ఏర్పడటంతో కాంగ్రెస్ అంతర్గత విభేదాలు టాక్ ఆఫ్ ది స్టేట్‌గా మారాయి.
సునీతపై వేటు తప్పదా..
ఈ క్రమంలోనే సునీతరావుపై వేటు తప్పదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే సునీతారావు వ్యవహారం పార్టీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి దృష్టికి వెళ్లినట్లు సమాచారం. పార్టీ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే నటరాజ్ తన యాక్షన్ ప్లాన్‌ను షురూ చేశారు. పార్టీలో కష్టపడిన వారికే పదవులు ఉంటాయని భరోసా ఇచ్చారు. అదే విధంగా ఎవరైనా పార్టీ గీత దాటి ప్రవర్తిస్తే మాత్రం వేటు తప్పదని హెచ్చరించారు. హెచ్చరించినట్లుగానే బీసీ డిక్లరేషన్ సమయంలో రెచ్చిపోయిన మాట్లాడిన తీన్మార్ మల్లన్నపై పార్టీ కఠిన చర్యలు తీసుకుంది. కాగా ఇప్పుడు సునీతా రావు కూడా అదే బాటలో నడుస్తున్నారు. పార్టీ నిర్ణయాలను పెడచెవిన పెట్టడమే కాకుండా, వాటికి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై వేటు తప్పదని విశ్లేషకులు బలంగా అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఎవరెవరికి పదవులు ఇవ్వాలన్న నిర్ణయాలు అయిపోయాయని, అందుకు పార్టీ అధిష్టానం కూడా ఆమోద ముద్ర వేసేసిందని తెలుస్తోంది. ఈ క్రమంలో సునీతారావు చేస్తున్నదంతా పబ్లిసిటీ కోసమే అన్న వ్యాఖ్యలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి.