
‘జూబ్లీలో నైతిక విజయం నాదే.. కానీ’
అత్యంత అప్రజాస్వామికంగా జరిగిన ఎన్నిక జూబ్లీహిల్స్ ఉపఎన్నికేనన్న మాగంటి సునీత.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నైతికంగా విజయం తనదేనంటూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత వ్యాఖ్యానించారు. ఉపఎన్నికలో ఓట్ల పరంగా మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచారని ఆమె అన్నారు. జూబ్లీ ఫలితాలపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నిక “ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా” జరిగిందని ఆరోపించారు. ప్రజలను భయపెట్టే విధంగా ఓట్లు పొందాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది అని ఆమె పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ ద్వారా గెలిచిందని ఆరోపించారు. అంతేకాకుండా ఎన్నికల సంఘం తన విధులు సరిగ్గా నిర్వర్తించలేదని వ్యాఖ్యానించారు. అయితే, ఆమె వ్యక్తిగతంగా నైతిక విజయం తనదేనని స్పష్టం చేశారు.
నిరాశ చెందాల్సిన అవసరం లేదు: రాకేశ్ రెడ్డి
జూబ్లీ ఉపఎన్నిక ఫలితాలపై బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి స్పందించారు. ఈ ఫలితాలను చూసి నిరాశ చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా గెలిచినా, నైతికంగా మాత్రం బీఆర్ఎస్ విజయం సాధించిందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్‌కు మద్దతుగా ఉన్నప్పటికీ, భారీ సంఖ్యలో నకిలీ ఓట్లు, బెదిరింపులు, దాడులు, అలాగే చీరలు, మిక్సీలు, కుక్కర్లు, గ్రైండర్‌ల వంటి ఉచిత బహుమతుల పంపిణీ కారణంగా కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరిందని ఆయన ఆరోపించారు.
ఓటుకు ఐదు వేల రూపాయల వరకూ చెల్లించి, వీధి వెంబడి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రచారానికి దింపారని, వారం రోజుల పాటు ముఖ్యమంత్రి తానే పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారని ఆయన వ్యాఖ్యానించారు. పోలింగ్ రోజు కూడా డిప్యూటీ సీఎం బూతుల వద్ద తిరుగుతూ ప్రభావితం చేసే ప్రయత్నాలు చేశారని, పలువురు ఎమ్మెల్యేలు బూతుల దగ్గర పోల్ స్లిప్‌లు అందిస్తూ డబ్బులు పంచారని రాకేశ్ రెడ్డి తెలిపారు. మొత్తం 55 పోలింగ్ బూతుల్లో రిగ్గింగ్ జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రజల్లో “ఇంకా మూడేళ్లు ప్రభుత్వం ఉండబోతోంది… ఇప్పుడే కాంగ్రెస్‌ను ఓడిస్తే మనకు ఎలాంటి ప్రయోజనం ఉండకపోవచ్చు” అనే భావన కలిగిందని, అదనంగా నవీన్ యాదవ్ గతంలో రెండు సార్లు ఓడిపోయిన నేపథ్యంలో ఓటర్లలో సానుభూతి పెరిగిందని ఆయన విశ్లేషించారు. ఈ అంశాలన్నీ కలిసి ప్రజాభిప్రాయాన్ని మార్చాయని, చివరికి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని పేర్కొన్నారు. “ఇది కాంగ్రెస్ లేదా సీఎం రేవంత్ రెడ్డి గెలుపు అని చెప్పడం కంటే, నవీన్ యాదవ్ వ్యక్తిగత విజయం అని చెప్పడం చాలా తగినది” అని ఏనుగుల రాకేశ్ రెడ్డి అన్నారు.

