‘సునీత గెలుపు ఖాయం..’
x

‘సునీత గెలుపు ఖాయం..’

కాంగ్రెస్ తమ టికెట్‌ను రౌడీ షీటర్ ఫ్యామిలీకి ఇచ్చిందన్న కేసీఆర్.


జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో మాగంటి సునీత గెలుపును నియోజకవర్గ ప్రజలు ఇప్పటికే ఖరారు చేసేశారని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పేర్కొన్నారు. మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యమైన ఉపఎన్నికలో ఎవరిని గెలిపించాలన్న అంశంపై ప్రజలు ఫుల్ క్లారిటీతో ఉన్నారని చెప్పారు. ఈ ఉపఎన్నిక ప్రచారంలో పార్టీ నేతలు ప్రజలతో మమేకం కావాలని, కాంగ్రెస్ దుష్టపాలన గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. భారీ మెజార్టీనే టార్గెట్‌గా ప్రయత్నించాలన్నారు. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీ పాలనతో ఇప్పటికే రాష్ట్రం గుల్ల గుల్ల అయ్యిందని, ఇక జూబ్లీహిల్స్ లో తన అభ్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ ఓ రౌడీషీటర్ ను నిలబెట్టి హైదరాబాద్ ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

విజ్ఞులైన జూబ్లీ హిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన రౌడీ షీటర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అభ్యర్థిని చిత్తుగా ఓడించి, జూబ్లీ హిల్స్ గౌరవాన్ని హైదరాబాద్లో శాంతి భద్రతలను కాపాడుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో, బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ భారీ మెజారిటీతో గెలుపు లక్ష్యంగా కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి నివాస ప్రాంగణంలో సన్నాహక సమావేశం జరిగింది. ఇందులో మాగంటి సునీత, కేటీఆర్, హరీష్ రావు, సబిత ఇంద్రారెడ్డి, తలసాని యాదవ్ సహా తదితరులు పాల్గొన్నారు. వారికి ఉపఎన్ని ప్రచారం పాటించాల్సిన, అనుసరించాల్సిన వ్యూహాలపై, లేవనెత్తాల్సిన అంశాలను కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశం సందర్భంగా... పార్టీ అభ్యర్థి గెలుపు దిశగా ఇప్పటికే ప్రజల్లో సానుకూల స్పందన వ్యక్తమవుతున్న నేపథ్యంలో... క్షేత్రస్థాయిలో ఇప్పడిదాకా కొనసాగుతున్న ప్రచారం సంబంధిత అంశాల మీద కేసీఆర్‌కు ఇంచార్జీలు రిపోర్ట్ చేశారు. పార్టీ అభ్యర్ధి మాగంటి సునీత గోపీనాథ్ భారీ మెజారిటీతో గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహాలు ఎత్తుగడలు, కార్యాచరణకు సంబంధించి కేసీఆర్ సమావేశంలో సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో దిగజారిన అభివృద్ధి గురించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తలెత్తిన ప్రమాదకర పరిస్థితులను గురించి వారికి ఇంటింటికీ తిరిగి వివరించాలని పార్టీ నేతలకు కేసీఆర్ ఉద్ఘాటించారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనా కాలంలో అమలు చేసిన అభివృద్ధికార్యక్రమాలు, మానవీయ కోణంలో అమలుచేసిన సంక్షేమ పథకాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎందుకు మాయమయ్యాయనే విషయాన్ని ప్రజలతో కలిసి చర్చించాలని కేసీఆర్ సూచించారు.

ప్రతి ఇంటికీ బాకీ కార్డులు..

మాగంటి గోపీనాథ్ మరణించారన్న బాధను దిగమించుకుని ధైర్యంగా ఎన్నికలను ఎదర్కోవాలని సమావేశంలో.. మాగంటి సునీత, పార్టీ క్యాడర్‌కు కేసీఆర్ సూచించారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రతి ఇంటికి అందించాలని కేసీఆర్ చెప్పారు. ‘‘రేవంత్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రమంతా ఆగమైంది. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హైడ్రా పేరుతో పేదలను వేధిస్తోందీ ప్రభుత్వం. కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుధేలైంది. అభివృద్ధి మాయమైంది. కాంగ్రెస్ చేతకాని పాలనపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలి’’ అని దిశానిర్దేశం చేశారు కేసీఆర్.

అంతేకాకుండా పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు గుర్తు చేయాలని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలిత ప్రభావం జీహెచ్ఎంసీ ఎన్నికలపైనా ఉంటుందని ఆయన అన్నారు. జూబ్లీహిల్స్‌లో గెలిస్తే.. స్థానిక ఎన్నికల్లో కూడా ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉంటారని కేసీఆర్ పేర్కొన్నారు.

Read More
Next Story