ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఝలక్
x

ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఝలక్

మరో వారం రోజులు కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ.


ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఇప్పటికే మధ్యంతర రక్షణను తొలగించి సిట్ కస్టడీకి అప్పగించింది. సిట్ కస్టోడియల్ విచారణలో ప్రభాకర్ రావు పెదవి విప్పడంలేదని అధికారులు చెప్తున్నారు. ఈక్రమంలోనే విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని, ప్రభాకర్ రావు కస్టడీని మరింత పొడిగించాలని సిట్ అధికారులు కోరారు. తాజాగా వారి అభ్యర్థనను పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం అందుకు అంగీకరించింది. అంతేకాకుండా విచారణకు సహకరించాలని ప్రభాకర్ రావుకు స్పష్టం చేసింది. అనంతరం ఆయన కస్టడీని మరో వారం రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

శుక్రవారం, కోర్టు విచారణలో భాగంగా ప్రభాకర్ రావు కస్టడీ విచారణకు సంబంధించి రిపోర్ట్‌ను సిట్.. కోర్టుకు అందించింది. ‘‘ప్రభాకర్ రావువిచారణకు సహకరించడం లేదు. కీలక విషయాలను దాటవేస్తున్నారు’’ అని సిట్ అధికారులు తమ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయనను మరికొన్ని రోజులు విచారించాల్సిన అవసరం ఉందని, కావున ఆయన కస్టడీని పొడిగించాలని సిట్ కోరింది. ఈ అభ్యర్థనను సోలిసిటర్ జనరల్.. న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లగా అందుకు ధర్మాసనం అంగీకారం తెలిపింది.

డిసెంబర్ 25 వరకు ప్రభాకర్ రావు కస్టడీని పొడిగించిన సుప్రీంకోర్టు.. కస్టడీ పూర్తయిన మరుసటి రోజు ఆయనను విడుదల చేయాలని తెలిపింది. ఆయన విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని తెలిపింది.

Read More
Next Story