
నల్లమల్ల సాగర్ కేసులో సుప్రీంకోర్ట్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణ అర్హత లేదన్న అత్యున్నత న్యాయస్థానం.
పోలవరం నల్లమల్ల సాగర్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ అంశంలో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని పేర్కొంది. అంతేకాకుండా ఈ కేసులో కర్ణాటక, మహారాష్ట్ర అంశాలు ముడిపడి ఉన్నాయని పేర్కొంది సుప్రీంకోర్ట్. అయితే ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కారం పొందేందుకు అనుమతి ఇచ్చింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ సింగ్వి తెలిపారు.
గోదావరి నది జలాల విషయంలో మహారాష్ట్ర, కర్ణాటక వాదనలు కూడా వినాల్సి ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. నీటి కేటాయింపుల ఉల్లంఘనలపై అన్ని రాష్ట్రాల వాదనలు వినేందుకు సివిల్ సూట్ ఫైల్ చేయాలని సూచించింది సుప్రీం. ఈ అంశంలో రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్న తెలంగాణ ప్రభుత్వం.. సివిల్ సూట్ దాఖలు చేయనున్నట్లు తెలిపింది. సుప్రీంకోర్టు నిర్ణయంపై తెలంగాణ నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. రెండు రోజుల్లో సివిల్ సూట్ దాఖలు చేస్తామన్నారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాపై పోరాటం ఆగదని, నీటి వాటాల విషయంలో ఏపీ సర్కార్.. ఒకటి చెప్తూ మరొకటి చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
సుప్రీం దృష్టికి ఏపీ ఉల్లంఘనలు
‘‘నీటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక ఉల్లంఘనలకు పాల్పడుతుంది. వాటన్నింటిని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చాం. స్టాప్ వర్క్ ఆర్డర్‌ను అమలు చేయట్లేదని న్యాయస్థానానికి వివరించాం. ఏపీకి 484.5 టీఎంసీల నీటిని కేటాయిస్తే.. అంతకన్నా ఎక్కువ వినియోగించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండానే ఏపీ ముందుకెళ్తోంది’’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
‘‘ఈ విషయంలో సివిల్ సూట్‌తో మళ్లీ రావాలని సీజేఐ సూచించారు. అదే విధంగా రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నాం. మరో రెండు రోజుల్లో సివిల్ సూట్ దాఖలు చేస్తాం. అన్ని అంశాలను న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చాం’’ అని ఆయన పునరుద్ఘాటించారు. అయితే ఈ అంశం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చలకు దారితీస్తోంది. విచారణకు పనికిరాని పిటిషన్లు దాఖలు చేసి రేవంత్ సర్కార్.. కంటితుడుపు చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు.
ఏపీలో ఉన్న తమ గురువుకి ఇబ్బందులు రాకూడదన్న ఉద్దేశంతోనే రేవంత్ ఇలాంటి చిల్లర పిటిషన్లు వేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టులో వేసిన బలహీన రిట్ ద్వారా ఏపీ ప్రభుత్వం అక్రమంగా పోలవరం–నల్లమల సాగర్ ప్రాజెక్టులకు పరోక్ష సహకారం చేసిందని. రిట్లను ఉపసంహరించి సివిల్ సూట్ ఫైల్ చేయమని చెప్పడం తెలంగాణకు గడువు ఇచ్చినట్లే అని విమర్శించారు
ఢిల్లీ సమావేశం అవినీతి అద్దం: హరీష్
ఢిల్లీలో రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశంపై కూడా హరీష రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అజెండా లేని అంశంపై అందులో చర్చించారని, దానిపై మళ్లీ సంతకం పెట్టి తెలంగాణ నదీ జలాలకు మరణశాసనం రాశారు రేవంత్ అని హరీష్ పేర్కొన్నారు. బనకచర్లను అడ్డుకుంటామని గప్పాలు కొట్టి సుప్రీంకోర్టు వెళ్లిన రేవంత్ సర్కార్.. కుట్రపూరితంగానే బలహీన పిటిషన్ వేసి తెలంగాణను మోసం చేశారని ఆరోపించారు.
తెలంగాణ నీటి హక్కులు
చర్చల పేరుతో తెలంగాణ నీటి హక్కులను ఏపీకి అప్పగించడమే ప్రభుత్వ ఉద్దేశమని హరీష రావు చెప్పారు. చంద్రబాబు–ఏపీ ప్రభుత్వంతో దోస్తీ కట్టి తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమైన రేవంత్ రెడ్డిని సమాజం క్షమించదని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ పార్టీగా తెలంగాణ నీటి హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టులో పిటిషన్ ఎందుకు?
పోలవరం నుంచి బనకచర్ల లేదా నల్లమల సాగర్‌కు లింక్ చేయడానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఎటువంటి అనుమతులు లేకుండానే ఏపీ ప్రభుత్వం ఏ చర్యలు చేపడుతుందని తెలంగాణ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఈ విస్తరణ పనులను వెంటనే ఆపేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం.. సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న విస్తరణ పనులను వెంటనే ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఇందులో తెలంగాణ ప్రభుత్వం పలు అంశాలను లేవనెత్తింది. పోలవరం విస్తరణ పనులను చేపట్టడం చట్టబద్ధం కాదని పేర్కొంది. తెలంగాణ అభ్యంతరాలను తుంగలోతొక్కుతూ ప్రీ ఫీజిబులిటీ రిపోర్ట్‌లను కేంద్ర ప్రభుత్వం పరిశీలించడం సరైన పద్దతి కాదని తెలంగాణ ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది.

