కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీం ట్విస్ట్
x

కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీం ట్విస్ట్

సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పెద్ద ట్విస్ట్ ఇచ్చింది.


సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. ఈడీ, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. స్పందన తెలియజేయాలని కేంద్ర ఏజెన్సీలను కోరింది. ఈ కేసుపై విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ ధర్మాసనం తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది. అలాగే, కవితకి మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌పై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే కవితకు ట్రయల్ కోర్టు, ఢిల్లీ హై కోర్టు బెయిల్ నిరాకరించాయి. దీంతో బెయిల్ పై సుప్రీంకోర్టు పైనే పెట్టుకున్నారు. తనపై ఈడీ, సీబీఐలు నమోదు చేసిన కేసుల్లో బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ కవిత ఈ నెల 8న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు జూలై 1న ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో సవాల్‌ చేశారు. సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (క్రిమినల్‌) దాఖలు చేశారు. దీంతో సుప్రీం కోర్టులోనూ ఆమెకి నిరాశే ఎదురైంది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది.

ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై ఆమె సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. వారం రోజుల్లో ఆమెకి బెయిల్ రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకంటే ముందు కేటీఆర్, హరీష్ రావులు తీహార్ జైలుకి వెళ్లి కవితని కలిసిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ తన చెల్లెలు జైల్లో చాలా ఇబ్బంది పడుతోందని చెప్పారు. ఇప్పటివరకు 11 కిలోల బరువు తగ్గిందని, బీపీ కూడా వచ్చిందని చెప్పారు. అనారోగ్యం కారణంగా ఆమె రోజూ రెండు టాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తోందని తెలిపారు.

దేశంలో రాజకీయంగా పోరాడాల్సి వచ్చినప్పుడు ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయన్నారు. గురువారం బెయిల్ కోసం అప్పీల్ చేశామని కేటీఆర్ చెప్పారు. వచ్చే వారంలో బెయిల్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మనీష్ సిసోడియాకి వచ్చింది కాబట్టి మిగిలినవారికి రావచ్చని అభిప్రాయపడ్డారు. కానీ వారి ఆశల్లో సుప్రీం ధర్మాసనం నీళ్లు చల్లింది. ఇక, లిక్కర్ కేసులో మార్చ్ 15న అరెస్టైన కవిత దాదాపు నాలుగు నెలలుగా తీహార్ జైల్లోనే గడుపుతున్నారు. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రతిసారి నిరాశే మిగులుతోంది.

Read More
Next Story