
ఎంఎల్ఏల ఫిరాయింపుపై సుప్రింకోర్టు సంచలన తీర్పు
కేసులు దాఖలుచేసిన బీఆర్ఎస్ ఎంఎల్ఏలకు ఈ తీర్పు నిరాసపరిచింది.
ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హతపై సుప్రింకోర్టు సంచలన తీర్పిచ్చింది. ఎంఎల్ఏల ఫిరాయింపులపై 3 నెలల్లోగా అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఎంఎల్ఏల ఫిరాయింపుల కేసును చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం విచారించింది. బీఆర్ గవాయ్ తీర్పులో ఎంఎల్ఏల ఫిరాయింపులపై స్పీకర్(Telangana Speaker) వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎంఎల్ఏల ఫిరాయింపులపై కాలపరిమితి లేదన్న సాకుతో విచారణ జరపకుండా కాలయాపన చేసేందుకు లేదని స్పష్టంగా చెప్పారు. బీఆర్ఎస్(BRS Defection MLAs)) నుండి పదిమంది ఎంఎల్ఏలు కాంగ్రెస్ లోకి ఫిరాయించిన విషయం తెలిసిందే. తమపార్టీ నుండి కాంగ్రెస్(Congress) లోకి ఫిరాయించిన ఎంఎల్ఏలపై వెంటనే అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కేపీ వివేకానందగౌడ్, పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్(KTR) పిటీషన్లు దాఖలు చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేసులు దాఖలుచేసిన బీఆర్ఎస్ ఎంఎల్ఏలకు ఈ తీర్పు నిరాసపరిచింది.
ఎందుకంటే ఫిరాయింపు ఎంఎల్ఏలపై వెంటనే అనర్హత వేటు వేయాలని వీళ్ళు తమ పిటీషన్లలో సుప్రింకోర్టు(Supreme Court)ను కోరారు. అయితే వీళ్ళ విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. అనర్హత వేటు విషయాన్ని సుప్రింకోర్టు తోసిపుచ్చింది. అనర్హత విషయమై స్పీకర్ తగిన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. తమ పిటీషన్లపై విచారణ జరిగింది కాబట్టి కచ్చితంగా వారందరిపై సుప్రింకోర్టు అనర్హత వేటు వేస్తుందని కేటీఆర్ తదితరులు అనుకున్నారు. అందుకనే సుప్రింకోర్టు తాజా తీర్పు వీళ్ళకు నిరాసమిగిల్చింది.
బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎంఎల్ఏలు ఖైరతాబాద్ ఎంఎల్ఏ దానం నాగేందర్, భద్రాచలం ఎంఎల్ఏ తెల్లం వెంకటరావు, స్టేషన్ ఘన్ పూర్ నుండి కడియం శ్రీహరి, బాన్సువాడ నుండి పోచారం శ్రీనివాసరెడ్డి, గద్వాల నుండి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, చేవెళ్ళ నుండి కాలే యాదయ్య, రాజేంద్రనగర్ నుండి ప్రకాష్ గౌడ్, శేరిలింగంపల్లి నుండి అరెకపూడి గాంధీ, పటాన్ చెరు నుండి గూడెం మహిపాల్ రెడ్డి, జగిత్యాల నుండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. అనర్హత పిటీషన్లను బీఆర్ఎస్ కోర్టులో దాఖలుచేయగానే ఫిరాయింపు ఎంఎల్ఏల్లో మహిపాల్ రెడ్డి, సంజయ్, అరెకపూడి గాంధి లాంటి కొందరు తాము పార్టీ ఫిరాయించలేదని బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే దీన్ని కారుపార్టీ నేతలు అంగీకరించటంలేదు.
స్పీకర్ ఏమిచేస్తారు ?
అనర్హత వేటు నిర్ణయం సుప్రింకోర్టు నుండి ఇపుడు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ రావు కోర్టులోకి చేరింది. అందుకనే ఇపుడు అందరి దృష్టి స్పీకర్ నిర్ణయంపైనే పడింది. అనర్హతపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. కారణం ఏమిటంటే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ఆదేశాల ప్రకారమే స్పీకర్ నడుచుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. ఫిరాయింపు ఎంఎల్ఏలపై అనర్హత వేటుపడటం రేవంత్ కు ఎంతమాత్రం ఇష్టంలేదు. ఆమధ్య అసెంబ్లీలో రేవంత్ మాట్లాడుతు ఫిరాయింపు ఎంఎల్ఏల్లో ఎవరిపైనా వేటుపడదని ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ హయాంలో జరిగిన ఫిరాయింపులపై అప్పట్లో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇపుడు కూడా దాదాపు అదే పద్దతి నడిచే అవకాశముంది. సుప్రింకోర్టు తీర్పు నేపధ్యంలో మహాయితే స్పీకర్ ఏమిచేస్తారంటే విచారణ పేరుతో కాలయాపన చేసే అవకాశముంది. మూడునెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పిందే కాని అనర్హత వేటు వేయాలని చెప్పలేదు. కాబట్టి అనర్హత పిటీషన్లపై స్పీకర్ మూడునెలల్లో విచారణ మొదలుపెట్టే అవకాశాలున్నాయి. ఈ విచారణ ఎంతకాలం సా.......గుతుందన్నది స్పీకర్ విచక్షణపైన ఆధారపడుంది. చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.