బిగ్ బ్రేకింగ్ : కోర్టులో లొంగిపోయిన లగచర్ల సురేష్
x
Bogamoni Suresh

బిగ్ బ్రేకింగ్ : కోర్టులో లొంగిపోయిన లగచర్ల సురేష్

సురేష్ కోర్టులో లొంగిపోయాడన్న విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ నిమ్మితం తమకు అప్పగించాలని కోర్టులో పిటీషన్ వేశారు.


లగచర్ల సురేష్ గా పాపులరైన బోగమోని సురేష్ మంగళవారం సాయంత్రం కొడంగల్ కోర్టులో లొంగిపోయాడు. కొడంగల్(Kodangal) నియోజకవర్గం లగచర్ల(Lagacharla) గ్రామసభలో కలెక్టర్ ప్రతీక్ జైన్(Collector Pratik Jain) మీద జరిగిన దాడికి సురేష్ సూత్రదారిగా పోలీసులు చెబుతున్నారు. అందుకనే దాడిఘటనలో బోగమోని(Bogamoni Suresh)ని ఏ2గా పోలీసులు ప్రస్తావించారు. ఎప్పుడైతే సురేష్ కోర్టులో లొంగిపోయాడన్న విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ నిమ్మితం తమకు అప్పగించాలని కోర్టులో పిటీషన్ వేశారు. అయితే కోర్టు మాత్రం ఏ2కి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అంటే సురేష్ ను విచారించాలంటే పోలీసులు 14 రోజులు ఆగాల్సిందే.

దాదాపు రెండువారాల క్రితం లగచర్ల గ్రామసభ జరుగుతున్నపుడు గ్రామస్తులు, రైతుల్లో కొందరు సడెన్ గా కలెక్టర్ ప్రతీక్ జైన్ మీద దాడిచేశారు. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా యూనిట్ల ఏర్పాటును రైతులు, గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఫార్మా యూనిట్ల ఏర్పాటుకు 3500 ఎకరాలను తాము ఇచ్చేదిలేదని రైతులు చెబుతున్నారు. అయితే రైతులు, గ్రామస్తులను బీఆర్ఎస్ రెచ్చగొట్టి తప్పుదోవపట్టిస్తోందని ప్రభుత్వం మొదటినుండి ఆరోపిస్తోంది. కలెక్టర్ మీద జరిగిన దాడికూడా బీఆర్ఎస్ రెచ్చగొట్టడం వల్లే జరిగిందని రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా మండిపోతున్నారు.

కలెక్టర్ మీద దాడి జరిగిన తర్వాత వీడియోలను పోలీసులు విశ్లేషించారు. ఆ నేపధ్యంలోనే సురేష్ రెచ్చగొట్టడం వల్లే గ్రామస్తులు, రైతుల ముసుగులో బీఆర్ఎస్ వాళ్ళు దాడిచేసినట్లు పోలీసులు నిర్ధారించారు. దాడిచేసిన వారిలో సుమారు 50 మందిని పోలీసులు అరెస్టుచేసినా సురేష్ మాత్రం మాయమైపోయాడు. దాడి జరిగినప్పటినుండి పోలీసులు ఎన్నిచోట్ల వెతికినా సురేష్ మాత్రం దొరకలేదు. అలాంటిది సడెన్ గా నిందితుడు కొడంగల్ కోర్టులో లొంగిపోవటం సంచలనంగా మారింది. సురేష్ లొంగుబాటు నేపధ్యంలో పోలీసులు ఏమిచేస్తారో చూడాలి.

Read More
Next Story