దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల ఖైదీ మృతి... ఎలాగంటే?
x

దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల ఖైదీ మృతి... ఎలాగంటే?

దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న సయ్యద్ మక్బూల్ అలియాస్ జుబేర్ మరణించాడు.


దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న సయ్యద్ మక్బూల్ అలియాస్ జుబేర్ మరణించాడు. అనారోగ్యంతో బాధపడుతున్న మక్బూల్(44) గురువారం కన్నుమూశాడు. పలు సంచలన కేసుల్లో దోషిగా తేలిన అతను ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక సభ్యుడు. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన మక్బూల్ ఇండియన్ ముజాహిదీన్ సంస్థ ఆపరేషన్స్ తోపాటు, దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుడు కేసుల్లో దోషిగా తేలాడు. ప్రస్తుతం 18 మంది ప్రాణాలు కోల్పోయి, 130 మందికి పైగా గాయపడిన దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లలో తన ప్రమేయం విషయంలో జీవిత ఖైదును అనుభవిస్తున్నాడు.

మక్బూల్ పాకిస్థాన్‌లో ఉన్న రియాజ్ భత్కల్, భారతదేశంలోని తీవ్రవాద కార్యకర్తలతో సహా ఇండియన్ ముజాహిదీన్ పెద్దలతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నాడని NIA ఆరోపించింది. ఈ టెర్రర్ మాడ్యూల్ హైదరాబాద్‌ ను ప్రధాన లక్ష్యంగా చేసుకుని దేశవ్యాప్తంగా వరుస దాడులకు ప్లాన్ చేసిందని పేర్కొంది. ఈ కేసుల్లో అరెస్టైన మక్బూల్‌ కి 2023 అక్టోబర్‌ లో ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించింది. తెలంగాణలో నమోదైన కేసులకు సంబంధించి అదే సంవత్సరం నవంబర్‌లో అతన్ని చర్లపల్లి జైలుకు తరలించారు.

కాగా, మక్బూల్ కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నెలరోజుల క్రితం అతనికి గుండె ఆపరేషన్ కూడా జరిగింది. ఇటీవల అతనికి మూత్రపిండాలు కూడా దెబ్బతినడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో పోలీసు అధికారులు అతనిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గురువారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

తీవ్ర విషాదం నింపిన దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల ఘటన...

దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల ఘటనలు ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపాయి. 2013 ఫిబ్రవరి 21 సాయంత్రం 6.45 గంటలకి దిల్‌సుఖ్‌నగర్‌ లోని ఆనంద్ టిఫిన్స్ తోపాటు రూట్ నెంబర్ 107 బస్ స్టాప్ లో వరుస బాంబ్ బ్లాస్ట్స్ జరిగాయి. ఈ పేలుళ్లలో 18 మంది మరణించగా దాదాపు 130 మంది గాయాలపాలయ్యారు. ఈ వరుస పేలుళ్ల కేసును ఎన్ఐఏ సంస్థ మూడేండ్లపాటు దర్యాప్తు చేసింది. 157 మంది నుంచి సాక్ష్యాలను రికార్డ్ చేసింది. ఇండియన్ ముజాహిదీన్ సంస్థే పేలుళ్లకు పాల్పడినట్లు తేల్చింది.

బాంబు పేలుళ్ల కేసులో యాసిన్‌ భత్కల్‌, అసదుల్లా అఖ్తర్‌, వకాస్‌, తెహసీన్‌ అఖ్తర్‌, ఎజాజ్‌ షేక్‌, మక్బూల్‌ను దోషులుగా తేల్చింది. ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించింది. ప్రధాన నిందితుడైన భత్కల్‌ పాక్‌లో తలదాచుకోగా, మిగిలిన నిందితులు చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే వీరిలో సయ్యద్‌ మక్బూల్‌ బాంబులు తయారు చేసేవాడు. ఇండియన్‌ ముజాహిదీన్‌ వ్యవస్థాపకుడు ఆజం ఘోరీకి సన్నిహితుడిగా అతనికి పేరుంది. 2006లో వారణాసి, 2007లో ముంబై వరుస పేలుళ్లు, 2008లో జైపూర్‌, ఢిల్లీ, అహ్మదాబాద్‌, బెంగళూరుతోపాటు దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల వెనుక అతని పాత్ర ఉన్నట్లు ఎన్‌ఐఏ నిర్ధారించింది.

Read More
Next Story