కేసీయార్ కు అవమానం ?
x
KCR

కేసీయార్ కు అవమానం ?

కేసీఆర్ ను తెలంగాణా ప్రభుత్వం అవమానించిందా ? ఈ విషయాన్ని ఊహించే కేసీఆర్ అసెంబ్లీకి రావటంలేదా ?


కేసీఆర్ ను తెలంగాణా ప్రభుత్వం అవమానించిందా ? ఈ విషయాన్ని ఊహించే కేసీఆర్ అసెంబ్లీకి రావటంలేదా ? ఇపుడీ విషయంపైనే గులాబీ పార్టీ నేతల మధ్య పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీ ఆవరణలోని ఔటర్ లాబీలో ప్రత్యేకమైన ఛాంబర్ కేటాయించారు. అయితే ఈ ఛాంబర్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. ఇదివరకు ఉన్నట్లే కేసీఆర్ కు ఇన్నర్ లాబీలోని ఛాంబరే కేటాయించాలని ఎన్నిసార్లు అడిగినా స్పీకర్ పట్టించుకోలేదు.

అసెంబ్లీ ఆవరణలోని ఇన్నర్ లాబీలో ఛాంబర్ చాలా విశాలంగా ఉంటుంది. ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్ళు కేసీఆర్ దాన్నే ఉపయోగించుకునేవారు. అయితే పార్టీ ఓడిపోయి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఆ ఛాంబర్ ను కేసీఆర్ కు రద్దుచేసి అధికారపార్టీకి స్పీకర్ కేటాయించారు. అప్పటినుండి కారుపార్టీ నేతలు స్పీకర్ తో పాటు రేవంత్ రెడ్డిపై మండిపోతున్నారు. కేసీఆర్ ను ఉద్దేశ్యపూర్వకంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అవమానిస్తోందని నానా గోల చేస్తున్నారు. పదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ కు ఇంతచిన్న ఛాంబర్ ఇస్తారా అంటూ స్పీకర్ ను నిలదీస్తున్నారు. వెంటనే ఔటర్ లాబీలో కేటాయించిన ఛాంబర్ ను రద్దుచేసి మళ్ళీ ఇన్నర్ లాబీలోని పాత ఛాంబర్నే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే విషయమై మాట్లాడుతు ఛాంబర్ ను అడ్డం పెట్టుకుని అధికారపార్టీ చీప్ రాజకీయాలు చేస్తోందని మండిపోయారు. పాత ఛాంబర్ స్ధానంలో కొత్త ఛాంబర్ కేటాయించటంలోనే కాంగ్రెస్ పార్టీ నీచత్వం బయటపడిందన్నారు. కొత్తగా కేటాయించిన ఛాంబర్లో సమస్య ఏమిటంటే ఇందులో బాత్ రూమ్ సౌకర్యం కూడా సరిగాలేదని కారుపార్టీ నేతలంటున్నారు. పైగా ఛాంబర్ కూడా చాలా చిన్నదని చెబుతున్నారు. రెండుసార్లు సీఎంగా పనిచేసి, ఇపుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా క్యాబినెట్ మంత్రి ర్యాంకు ఉన్న కేసీఆర్ ను అధికారపార్టీ కావాలనే అవమానిస్తోందని కారుపార్టీనేతలు నానా యాగీ చేస్తున్నారు. అయితే స్పీకర్ కాని మంత్రులు, అధికారపార్టీ నేతలు ఏమీ పట్టించుకోవటంలేదు. బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నట్లుగా కేసీఆర్ ను ప్రభుత్వం నిజంగానే అవమానిస్తోందా ?

Read More
Next Story