రుణమాఫీ నిధుల్లో భారీ కోత  రైతుల్లో టెన్షన్
x
Telangana farmer

రుణమాఫీ నిధుల్లో భారీ కోత రైతుల్లో టెన్షన్

రుణమాఫీకి రు. 31 వేల కోట్ల ఖర్చుచేయబోతున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం తాజా బడ్జెట్లో రు. 26 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పటం ఆశ్చర్యంగా ఉంది.


రుణమాఫీ పథకానికి నిధుల కేటాయింపుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ కోత విధించింది. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏకంగా రు. 5 వేల కోట్లలో కోతపెట్టింది. మొత్తం రుణమాఫీకి రు. 31 వేల కోట్ల ఖర్చుచేయబోతున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం తాజా బడ్జెట్లో రు. 26 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. మరి ప్రకటనకు, బడ్జెట్ కేటాయింపుకు మధ్య రు. 5 వేల కోట్లను ఎందుకు కోతపెట్టిందో అర్ధంకావటంలేదు. ప్రభుత్వ చర్యతో రుణమాఫీ అవుతుందని ఎదురుచూస్తున్న లక్షలాది మంది రైతుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. రుణమాఫీ అర్హుల జాబితా నుండి తమను ఎక్కడ తప్పిస్తారో అనే ఆందోళన రైతుల్లో పెరిగిపోతోంది. ఆందోళన ఎందుకంటే మొదటి విడతలోనే రుణమాఫీకి అన్నీ అర్హతులున్న లక్షలాది మంది రైతులకు లబ్ది దొరకలేదనే ఆరోపణలు తెలిసిందే.

రుణమాఫీని మూడు విడతలుగా అమలుచేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతలో లక్ష రూపాయలు రుణాలు, రెండో విడతలో లక్ష నుండి 1.50 లక్షల రూపాయల రుణాలు, మూడో విడతలో 2 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేయాలని డిసైడ్ అయ్యింది. మొదటివిడత లక్ష రూపాయల రుణమాఫీలో భాగంగా 11.50 లక్షల మంది రైతులకు సుమారు రు. 6,014 కోట్లను బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. ఏడు వేల కోట్ల రూపాయలు మంజూరుచేస్తున్నట్లు చెప్పిన ప్రభుత్వం చివరకు వెయ్యి కోట్లకు కోతేసింది. దీంతో రుణమాఫీకి అర్హులైన లక్షలమంది రైతులకు లబ్దిజరగలేదని గోల పెరిగిపోయింది.

ఇక ఈనెలాఖరులో రెండో విడత లక్షన్నర రూపాయల రుణమాఫీ జరుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించిన విషయం తెలిసిందే. రెండో విడత కోసం మరో రు. 8 వేల కోట్లు, మూడో విడతలో రు. 15 వేల కోట్లు పథకానికి కేటాయించబోతున్నట్లు రేవంత్ ప్రకటించారు. అంటే చివరి రెండు విడతల్లో రుణమాఫీకి ప్రభుత్వం కేటాయించాల్సింది రు. 23 వేల కోట్లు. మరి గతంలో చేసిన ప్రకటనతో పోలిస్తే బడ్జెట్లో రు. 5 వేల కోట్లలో కోతపడింది. దీంతో రెండో విడత, మూడో విడత లబ్దిదారుల్లో ఇంకెంతమంది అర్హులపై వేటుపడుతుందో అనే ఆందోళన రైతాంగంలో పెరిగిపోతోంది. పథకంలో సుమారు 45 లక్షల మంది రైతులు లబ్దిపొందుతారని ప్రభుత్వం ప్రకటించింది. బడ్జెట్లోనే రు. 5 వేల కోట్లకు కోతపడిందంటే అదే దామాషాలో లబ్దిదారుల సంఖ్య కూడా తగ్గిపోవటం ఖాయమనే గోల పెరిగిపోతోంది.

ఇక్కడే అర్హతలుండి కూడా లబ్ది దక్కని రైతుల సంఖ్య ఎంతుంటుంది ? ఎవరెవరిపైన దెబ్బ పడుతుందనే టెన్షన్ రైతుల్లో పెరిగిపోతోంది. ముందు చెప్పినట్లుగా నెలాఖరులో రెండోవిడత రుణమాఫీ జరిగితే నిధుల కేటాయింపు, అర్హుల జాబితా బయటపడుతుంది. దాన్నిబట్టి మూడో విడత వ్యవహారంతో మొత్తం రుణమాఫీ హామీ విషయం ఏమిటో తేలిపోతుంది.

Read More
Next Story