మోడి ప్రభుత్వంపై  తిరుగుబాటు మొదలైందా ?
x
Narendra Modi

మోడి ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందా ?

కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర అసెంబ్లీలో చర్చించటం, తీర్మానం చేయటం ఏ రాష్ట్రంలోను జరగలేదు. మొట్టమొదటిసారిగా తెలంగాణాలోనే ఈ డెవలప్మెంట్ జరిగింది.


తెలంగాణా అసెంబ్లీలో జరిగింది చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర అసెంబ్లీలో చర్చించటం, తీర్మానం చేయటం ఏ రాష్ట్రంలోను జరగలేదు. మొట్టమొదటిసారిగా తెలంగాణా అసెంబ్లీలోనే ఈ డెవలప్మెంట్ జరిగింది. అందుకనే మోడి ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం తిరుగుబాటు చేసినట్లుగానే అందరు చూస్తున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో తెలంగాణా అభివృద్ధికి ఒక్కరూపాయి కూడా కేటాయించలేదన్న ఆగ్రహం మెజారిటి సభ్యుల్లో కనబడింది. అందుకనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బుధవారం ప్రత్యేకంగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పైనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్చ, తీర్మానాన్ని చేసింది.

ముందుగా అనుకున్నట్లుగా కేంద్రంతీరును సభలోని మెజారిటి సభ్యులు తీవ్రంగా గర్హించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతు కేంద్రం తీరు ఫెడరిలిజం స్పూర్తికి పూర్తిగా వ్యతిరేకంగా ఉందన్నారు. కేంద్రప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే స్పూర్తి దెబ్బతింటుందని హెచ్చరించారు. రాష్ట్రాల నుండి కేంద్రానికి వెళుతున్న పన్నుల ఆదాయం దామాషాలో తిరిగి రాష్ట్రాలకు కేంద్రం నిధులను కేటాయించటంలేదని మండిపడ్డారు. ఇదే విషయామై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతు మోడి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పదేళ్ళ కేసీఆర్ పాలనలో కూడా తెలంగాణాను కేంద్రం పట్టించుకోలేదన్నారు. విభజన చట్టంలో తెలంగాణాకు కేటాయించిన వాటిని కూడా కేంద్రం గాలికొదిలేసినట్లు మండిపడ్డారు. కేంద్రం వైఖరిపై పోరాటం చేయాల్సిందే అని సూచించారు. ఎంఐఎం, సీపీఐ సభ్యులు కూడా కేంద్రం తీరును నిరసించారు. తెలంగాణాకు మోడి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.

తర్వాత మాట్లాడిన రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని లెక్కల రూపంలో వివరించారు. గడచిన ఐదేళ్ళల్లో తెలంగాణా నుండి కేంద్రానికి రు. 3 లక్షల కోట్ల పన్నుల ఆదాయం అందితే కేంద్రం తిరిగి తెలంగాణాకు చెల్లించింది కేవలం రు. 1.5 లక్షల కోట్లు మాత్రమే అన్నారు. ఐదు ధక్షిణాది రాష్ట్రాల నుండి కేంద్రానికి గడచిన ఐదేళ్ళల్లో రు. 22 లక్షల కోట్ల పన్ను ఆదాయం అందితే తిరిగి ఐదు రాష్ట్రాలకు అందిన మొత్తం కేవలం రు. 6.4 లక్షల కోట్లు మాత్రమే అని చెప్పారు. అయితే దీనికి ఉత్తరప్రదేశ్ వ్యవహారం రివర్సులో ఉందన్నారు. గడచిన ఐదేళ్ళల్లో యూపీ నుండి కేంద్రానికి అందిన మొత్తం రు. 3.41 లక్షలు కోట్లయితే తిరిగి కేంద్రం చెల్లించింది మాత్రం రు. 6 లక్షల కోట్లని చెప్పారు.

అసెంబ్లీలో ఈ లెక్కలను వివరించటం ద్వారా కేంద్రం రాష్ట్రాలపై సవతితల్లి ప్రేమ చూపిస్తున్నట్లు ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎక్కువ నిధులను కేటాయిస్తే బీజేపీయేతర రాష్ట్రాలను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నట్లు మండిపడ్డారు. ఇందుకు తెలంగాణాయే ఉదాహరణగా చెప్పారు. బడ్జెట్ కు ముందే రాష్ట్రాభివృద్ధికి అనేక వినతిపత్రాలు అందిస్తే, మోడిని వ్యక్తిగతంగా కలిసి వివరించినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. మూసినది అభివృద్ధికి రు. 10 వేల కోట్లు, రీజనల్ రింగ్ రోడ్డు, ఫార్మాసిటి అభివృద్ధికి నిధులు, ఖాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, రద్దుచేసిన ఐటిఐఆర్ తిరిగి మంజూరు చేయాలని, ఐఐఎం ఏర్పాటుచేయాలనే డిమాండ్లను రేవంత్ వ్యక్తగతంగా మోడిని మూడుసార్లు కలసి విజ్ఞప్తిచేశారు. మోడితో పాటు చాలామంది కేంద్రమంత్రులను రేవంత్, భట్టి తదితరులు కలిసినా ఉపయోగం కనబడలేదు.

విచిత్రం ఏమిటంటే ఏపికి బడ్జెట్లో నిధులు కేటాయించిన కేంద్రం తెలంగాణాకు మాత్రం ఎందుకు కేటాయించలేదని నిలదీయమే. ఇక్కడ వీళ్ళకు అర్ధంకాలేదో లేకపోతే కావాలని కేంద్రంపై బురదచల్లాలని కంపారిజన్ తీసుకొచ్చారో అర్ధంకావటంలేదు. తాజా బడ్జెట్లో కేంద్రం ఏపీకి కూడా రూపాయి విదిల్చలేదు. అమరావతికి రు. 15 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. అయితే ఆ 15 వేల కోట్ల రూపాయలు కేంద్రం రాష్ట్రప్రభుత్వానికి కేటాయించటంలేదు. కేవలం 15 వేల కోట్లరూపాయల అప్పు వెసులుబాటును కల్పించిందంతే. ఆర్ధికసంస్ధల నుండి అమరావతి నిర్మాణానికి అప్పు తెచ్చుకునే అవకాశాన్ని ఏపీ ప్రభుత్వానికి కేంద్రం వెసులుబాటు కల్పించిందంతే. తీసుకున్న మొత్తానికి ఏపీ ప్రభుత్వం అసలుతోపాటు వడ్డీ చెల్లించాల్సిందే. అప్పు వెసులుబాటు కల్పించటాన్ని తెలంగాణా ప్రభుత్వం కేంద్రం ఏపీకి కేటాయించిన నిదులుగా ఎలా పరిగణిస్తోందో అర్ధంకావటంలేదు.

సరే, ఏపీ విషయం ఎలాగున్నా బుధవారం తెలంగాణా అసెంబ్లీలో జరిగిన చర్చ, తీర్మానాన్ని గమనించిన తర్వాత కేంద్రప్రభుత్వంపై రేవంత్ ప్రభుత్వం తిరుగుబాటు చేసినట్లుగానే భావించాల్సుంటుంది. ఇదే విషయమై తొందరలోనే ధక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని కూడా రేవంత్ ఏర్పాటు చేయబోతున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్, కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. చంద్రబాబునాయుడు ఏమిచేస్తారో చూడాలన్నారు. బహుశా ధక్షిణాది ముఖ్యమంత్రుల సమావేశం కూడా తొందరలోనే ఏర్పాటుచేస్తారేమో. ఇదే సమయంలో నరేంద్రమోడి ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీన జరగబోతున్న నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు రేవంత్ ప్రకటన కూడా తిరుగుబాటునే సూచిస్తోంది. సవరణ బడ్జెట్లో అయినా తెలంగాణాకు న్యాయంచేయాలన్న అసెంబ్లీ రిక్వెస్టును మోడి ప్రభుత్వం పట్టించుకుంటుందా లేదా అన్నది చూడాలి.

తెలంగాణా బాటలోనే తమిళనాడు అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. తమిళనాడు అభివృద్ధిని కేంద్రప్రభుత్వం పట్టించుకోవటంలేదని ముఖ్యమంత్రి స్టాలిన్ ధ్వజమెత్తారు. ఇదే పద్దతిలో పంజాబ్ అభివృద్ధిని మోడి ప్రభుత్వం పట్టించుకోలేదని పంజాబ్ ఎంపీలు పార్లమెంటు ముందే నానా రచ్చచేశారు. చూస్తుంటే కేంద్రప్రభుత్వం వివక్ష చూపిస్తోందంటు బీజేపీయేతర ప్రభుత్వాలు ఒక్కోటి నరేంద్రమోడి ప్రభుత్వంపై తిరుగుబాటు బాటలో ప్రయాణించబోతున్నాయా అనే సందేహం పెరిగిపోతోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

Read More
Next Story