కెసిఆర్ పాలన ఏమీ బాలేదు...మంచి రోజులొచ్చాయంటున్నగవర్నర్
x
Tamilsi

కెసిఆర్ పాలన ఏమీ బాలేదు...మంచి రోజులొచ్చాయంటున్నగవర్నర్

తొలిరోజు సభకు రాని ప్రతిపక్షనాయకుడు కె చంద్రశేఖర్ రావు. కాళోజీ కవితతో దునుమాడిన తమిళిసై ప్రసంగం షురూ


తెలంగాణ గవర్నర్ తమిళిసై.. ఎప్పుడూ సంచలనమే.. తాను చేయాలనుకున్నది చేస్తారు, చెప్పాలనుకున్నది చెప్తారు. ఈవేళ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ ఆమె తనదైన శైలిలో కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలున్నప్రసంగాన్ని చదివారు. అయితే పేరు నేరుగా చెప్పకున్నాటార్గెట్ మాత్రం కేసీఆర్ అనే అంటున్నారు పరిశీలకులు.

‘‘ అధికారమున్నదని హద్దు పద్దు లేక.

అన్యాయమార్గాల నార్జింపబూనిన...

అచ్చి వచ్చే రోజులంతమైనాయి...

అచ్చి వచ్చే రోజులంతమైనాయి!’’

ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు కవిత ఇది. గవర్నర్ తమిళిసై ఈ కవితతో తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఆ కవితలో గత ప్రభుత్వం తీరును ఎండగడుతూ గవర్నర్ వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ చదివిన ఈ కవిత ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

గవర్నర్ ప్రసంగం ఇలా సాగింది...


“రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలన్నింటినీ నెరవేరుస్తుంది. సంస్కరణలను అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుంది. సంపద సృష్టిలో కొత్త శిఖరాలకు చేరుస్తుంది. ప్రజాధనాన్ని నిర్వహించడంలో ప్రభుత్వం వివేకాన్ని, విజ్ణతను ప్రదర్శిస్తుంది” అని శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఉభయ శాసనసభల సభ్యులను ఉద్దేశించి తమిళిసై చెప్పారు.

ఈసందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే పలు అభివృద్ధి-సంక్షేమ చర్యలను ప్రస్తావించారు. త్వరలో మరో రెండు హామీలను –అంటే......500 రూపాయలకే వంట గ్యాస్ సిలెండర్, అర్హులైన కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గ్యారంటీలను అమలు చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో కులగణనను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని, వెనుకబడిన తరగతుల సామాజిక, విద్య, ఆర్ధిక, ఉద్యోగ, రాజకీయ అవకాశాలను అంచనా వేసేందుకు ఈ చర్య దోహదపడుతుందని అన్నారు.

హద్దుల్లో పద్దును ఉంచడం మా లక్ష్యం...

ఆర్ధిక క్రమశిక్షణకి , పారదర్శకతకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతూ – 2 లక్షల ఉద్యోగాల భర్తీ, సాగునీరు, విద్యారంగం లాంటి పలు రంగాల అభివృద్ధి తమ భావి ప్రణాళికల్లో ఉన్నాయన్నారు. వ్యవసాయ రంగంలో ఎదురయ్యే ప్రతి సవాలును గుర్తించి రైతుల అభివృద్ధికి పటిష్ట విధానాలను అమలు చేస్తామని చెప్పారు. స్థానిక యువతకు నైపుణ్యం కల్పించడానికి చర్యలు చేపడుతూనే, ఉపాధి కల్పనలో ప్రాంతీయ అసమానతలు తొలగించేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చెప్పారు. ఐటీ, ఫార్మా రంగాలకు ప్రాధాన్యత కొనసాగిస్తుందని, 10-12 ఫార్మా విలేజ్ క్లస్టర్ లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్న గవర్నర్, ఇంటర్నెట్ ను రాష్ట్రంలో ప్రాధమిక హక్కుగా అమలు చేయడంతోపాటు, సార్వజనీన సమగ్ర డిజిటల్ అక్షరాస్యతా కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతుందని చెప్పారు.

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీకి వంద ఎకరాలు...

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీకు సంబంధించి రాష్ట్రాన్ని ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేస్తూ కృత్రిమ మేధో నగరాన్ని దాదాపు `100 ఎకరాలలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. హరిత ఇంధనాల వాటాను 2030 నాటికి రాష్ట్రంలో గణనీయంగా పెంచుతున్నట్లు, సరికొత్త ఇంధన విధానాన్నీ రూపొందించనున్నట్లు చెప్పారు. అలాగే, రాష్ట్ర పర్యాటక సామర్ధ్యాన్ని వినియోగించుకుని ఉపాధి అవకాశాలు పెంచేలా సమగ్ర పర్యాటక విధానాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు.

బడ్జెట్ ను కేవలం ఆర్ధిక పత్రం లాగా కాకుండా, అభివృద్ధి చోదకంగా, ప్రజల ఆకాంక్షలు ప్రతిఫలించేదిగా ఉంటుందని గవర్నర్ పేర్కొన్నారు. వనరులను సమర్ధంగా కేటాయిస్తూ, ఖర్చుచేసే ప్రతి రూపాయీ, రాష్ట్ర సంక్షేమం, పురోగతికి దోహద పడేలా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. స్వల్ప కాలంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలను అధికార పక్ష సభ్యుల హర్షాతిరేకాల మధ్య గవర్నర్ వివరించారు. ప్రజాకవి కాళోజీ నారాయణ రావు రచించిన ..... అధికారమున్నదని హద్దు పద్దు లేక...... అన్న కవితా పంక్తులతో ప్రారంభించిన గవర్నర్ ప్రసంగం ---- దాదాపు 40 నిముషాల పాటు సాగి ---విత్త నిర్వహణకు వివేకా కాంతి పుంజం కావాలన్న----- ప్రముఖ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి మాటలను ఊటంకిస్తూ ముగిసింది.

మొహం చాటేసిన కేసీఆర్

నన్నూ, నా పార్టీని టచ్ చేసి చూడు, ఏమవుతుందోనని సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించిన బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇవాళ శాసనసభకు రాలేదు. బీఆర్‌ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గైర్హాజరు శాసనసభ లాబీల్లో పెద్ద చర్చనీయాంశమే అయింది. అందరూ వస్తారని ఊహించడమే దీనికి కారణం. ఎమ్మెల్యేగా ప్రమాణం స్వీకారం చేసినందున ఆయన తప్పకుండా సభకు హాజరవుతారని ఎమ్మెల్యేలు భావించారు. అయితే రేపు ధన్యవాద తీర్మానంపై చర్చ ఉన్నందున దానికి సిద్ధమయి వస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి. శస్త్ర చికిత్స చేయించుకున్న కారణంగా గత అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరుకాలేదు.

Read More
Next Story