తాటికొండ రాజయ్య గృహనిర్భంధం ,వేడెక్కిన స్టేషన్ ఘన్ పూర్ రాజకీయం
x

తాటికొండ రాజయ్య గృహనిర్భంధం ,వేడెక్కిన స్టేషన్ ఘన్ పూర్ రాజకీయం

కడియం వర్సెస్ రాజయ్య పోరుతో నియోజకవర్గంలో ఆసక్తికర రాజకీయాలు,రాజయ్య పాదయాత్రకు పోలీసుల బ్రేక్


స్టేషన్ ఘన్ పూర్ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి.ఎమ్మెల్యే కడియం శ్రీహరి. మాజీ ఉప ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య మధ్య రాజకీయ విభేదాలు నియోజకవర్గంలో చర్చనీయాంశమయ్యాయి. కడియంపై పోరులో భాగంగా రాజయ్య సోమవారం చేపట్టిన పాదయాత్రకు పోలీసులు బ్రేక్ వేసారు. రాజయ్యను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రఘునాథపల్లి మండలంలో పాదయాత్ర చేపట్టాలని రాజయ్య నిర్ణయించుకోవడం అందుకు సిద్ధం కావడంతో నియోజక వర్గంలో ఉద్రిక్తతలు నెలకొంటాయని పోలీసులు తగిన జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధంతో ఉద్రిక్తతలు ఉన్నందున, పాదయాత్రకు వెళ్లడం సరికాదని పోలీసులు సూచించారు. అయినా రాజయ్య వెనక్కి తగ్గకపోవడంతో శాంతిభద్రతల దృష్ట్యా ఆయన్ను గృహ నిర్బంధం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయం తెలియగానే బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగడంతో కొంతసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది.

రాజయ్య సంచలన ఆరోపణలు
ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై రాజయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. "కడియం శ్రీహరికి సిగ్గు, శరం ఉంటే, వరంగల్ గడ్డ పౌరుషం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి"అంటూ సవాలు విసిరారు."కూతురు రాజకీయ భవిష్యత్ కోసం 200 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయిన మనిషి కడియం " అంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహరిపై స్పీకర్ వెంటనే అనర్హత వేటు వేయాలని కూడా రాజయ్య డిమాండ్ చేశారు.కడియం ను అడ్డుకొని తీరతామని నియోజక వర్గంలో తిరగనీయమన్న రాజయ్య,రాజీనామా చేసి మళ్లీ గెలవాలన్నారు.
రాజయ్య ఆరోపణలకు కడియం మద్దతుదారులు, కాంగ్రెస్ నేతలు ధీటుగా జవాబిస్తూ , ఎదురుదాడి చేస్తుండటంతో నియోజక వర్గంలో ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న ఆందోళన మొదలైంది.ఈ నేపధ్యంలోనే రాజయ్య పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు కడియం ఆదేశాలను పాటిస్తున్నారని, తనను ఎందుకు ఇంటి నుంచి బయటకు రానాయడం లేదని కూడా రాజయ్య ప్రశ్నిస్తున్నారు.
Read More
Next Story