తీన్మార్ రివర్స్ స్ట్రాటజీ అదిరింది
x
Teenmar mallanna

తీన్మార్ రివర్స్ స్ట్రాటజీ అదిరింది

మల్లన్న ఏమిచేశారంటే నామినేషన్ వేసే సమయంలోనే తనతో పాటు తన కుటుంబానికి ఉన్న ఆస్తులన్నింటినీ ప్రభుత్వానికి రాసిచ్చేశారు. తీన్మార్ వైఖరితో జనాలు ఆశ్చర్యపోయారు.


రాజకీయమంటేనే ఎత్తులు పై ఎత్తులతో నిండినదని అందరికీ తెలిసిందే. ప్రత్యర్ధులను చిత్తుచేయటానికి ప్రతి ఒక్కరు ఒక్కో ఎత్తు, పై ఎత్తు వేస్తుంటారు. ఎవరి ఎత్తు పారుతుందో ఎవరి పై ఎత్తు వర్కవుటవుతుందో వాళ్ళదే పై చేయవుతుంది. ఇపుడు ఇదంతా ఎందుకంటే వరంగల్-ఖమ్మ-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎంఎల్సీ కాంగ్రెస్ అభ్యర్ధిగా నామినేషన్ వేశారు. అభ్యర్ధులుగా పోటీచేసే వారు ఎవరైనా నామినేషన్ వేయటం మామూలే. అయితే మల్లన్న ఏమిచేశారంటే నామినేషన్ వేసే సమయంలోనే తనతో పాటు తన కుటుంబానికి ఉన్న ఆస్తులన్నింటినీ ప్రభుత్వానికి రాసిచ్చేశారు. ఆస్తులను ప్రభుత్వానికి రాసిచ్చేసిన తీన్మార్ వైఖరితో జనాలు ఆశ్చర్యపోయారు.

ఇప్పటివరకు జనాలకు తెలిసింది ఏమిటంటే రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులను సంపాదించుకున్నవాళ్ళే. రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుండి అంటే కార్పొరేటర్ స్ధాయి నుండి తీసుకుంటే ఎంఎల్ఏలు, మంత్రులు, ఎంపీలుగా పనిచేసిన, చేస్తున్నవాళ్ళ ఆస్తులను పరిశీలిస్తే ఎవరేమిటో తెలుస్తుంది. ప్రజాసేవ చేయటానికే రాజకీయాల్లోకి వచ్చినట్లు ప్రతి ఒక్కళ్ళు చెప్పేది పడికట్టుమాటలే అని జనాలకు బాగా తెలుసు. అలాంటిది నామినేషన్ సమయంలోనే తీన్మార్ రు. 1.5 కోట్ల విలువైన తన ఆస్తులను ప్రభుత్వం పేరుతో బాండు పేపర్లో రాసి రిజిస్టర్ చేసేశారు. ఆ పేపర్లను చీఫ్ సెక్రటరీకి అందించాలని నల్గొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అందించారు.

దీనివల్ల ఏమైవుతుందంటే జనాలకు ముఖ్యంగా పై జిల్లాల్లోని పట్టభద్రుల ఓటర్లకు తీన్మార్ పై గౌరవం పెరుగుతుంది. అలాగే ప్రత్యర్ధులుగా పోటీచేయబోయే అభ్యర్ధుల ఆస్తులపై చర్చ జరుగుతుంది. తన ఆస్తులను తీన్మార్ ప్రభుత్వానికి రాసిచ్చేసిన విషయాన్ని ప్రచారానికి వచ్చిన మిగిలిన అభ్యర్ధుల దగ్గర ఓటర్లు ప్రస్తావించే అవకాశముంది. ఆస్తులపై చర్చ జరిగేకొద్దీ తీన్మార్ కు మిగిలిన అభ్యర్ధులకు మధ్య పోలికపై జనాలు మాట్లాడుకుంటారు. తీన్మార్ కు కావాల్సింది కూడా ఇదే. ఎన్నికల కమీషన్ కు అభ్యర్ధులు ప్రకటించే ఆస్తులు, అప్పుల్లో ఎంత నిజముందో ప్రత్యేకించి ఎవరికీ చెప్పక్కర్లేదు.

నామినేషన్ సమయానికి ముందే అభ్యర్ధి తన ఆస్తులను ప్రభుత్వానికి రాసిచ్చేయటం రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఇదే మొదటిసారేమో. ఇదే విషయమై నామినేషన్ తర్వాత తీన్మార్ మాట్లాడుతు ‘రాజకీయాల్లో తాను క్లీనుగా ఉండాలని కోరుకుంటున్న’ట్లు చెప్పారు. ‘తనతో పాటు తన ప్రత్యర్ధులు కూడా అంతే క్లీన్ గా ఉండాల’ని తీన్మార్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా పనితీరు ఆధారంగా తనపై తానే రీకాల్ సిస్టమ్ కూడా పెట్టుకుంటానన్నారు. నిజానికి మనదేశంలో రీకాల్ సిస్టమ్ అన్నది లేదు. కేసీయార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూట్యూబ్ ఛానల్లో చేసిన వీడియోలతో తీన్మార్ మల్లన్న చాలా పాపులర్ అయిన విషయం అందరికీ తెలిసిందే. 2012లో వీ6 చానల్లో ప్రసారమైన ‘తీన్మార్ మల్లన్న’ కార్యక్రమంతో చింతపండు నవీన్ కుమార్ కు తీన్మార్ మల్లన్న అన్న పేరు స్ధిరపడిపోయింది. ఇపుడు తీన్మార్ వ్యవహారం ముందు ముందు ఇతర అభ్యర్ధులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.

Read More
Next Story