తీన్మార్ మల్లన్నకొత్త రాజకీయపార్టీ
x

తీన్మార్ మల్లన్నకొత్త రాజకీయపార్టీ

తాజ్ క్రిష్ణ హోటల్ లో తెలంగాణ రాజ్యాధికార పార్టీగా నామకరణం


చాలా రోజుల నుంచి కొత్త రాజకీయ పార్టీ పెడతానని చెబుతూ వస్తున్న తీన్మార్ మల్లన్న బుధవారం నూతన రాజకీయ పార్టీ పేరును అనౌన్స్ చేశారు. తెలంగాణ విమోచనా దినోత్సవాన్ని పురస్కరించుకుని తాజ్ కృష్ణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన రాజకీయ పార్టీ పేరును ప్రకటించారు. ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని నామకరణం చేశారు. ఈ సందర్భంగా తీన్మార్‌ మల్లన్న ఆవేశపూరితంగా మాట్లాడుతూ సెప్టెంబర్‌ 17వ తేదీ బీసీల తలరాత మారే రోజు అని తాను భావిస్తున్నానన్నారు. తెలంగాణలో మెజారిటీ సీట్లను ప్రభావితం చేసే బీసీలకు రాజకీయ పార్టీ ఉండాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. బిసీల ఆత్మ గౌరవం కోసం పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్ కుమార్. యాద్రాద్రి భువనగిరి జిల్లాకి చెందిన తీన్మార్ మల్లన్న నల్గొండ ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

2021లో నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రులస్థానంనుంచి మళ్లీ పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

తర్వాత ఆయన బిజెపిలోచేరారు. బిజెపికి రాజీనామా చేసి 2023లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు.

కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కులగణన సర్వే లో బిసీల సంఖ్యను తగ్గించినట్టు తీన్మార్ మల్లన్నవివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పరుషపదజాలం ఉపయోగించడంతో కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తీన్మార్ మల్లన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు.జాగృతి కార్యకర్తలపై తీన్మార్ మల్లన్నగన్ మెన్ కాల్పులు జరపడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణలో బిసీల ఆత్మగౌరవం కోసం నూతన రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని అప్పట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.

దేశవ్యాప్తంగా కులగణన కోసం డిమాండ్లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బీసీలు రాజకీయాల్లో సముచిత భాగస్వామ్యం కోసం అన్ని ప్రధానరాజకీయ పార్టీలు గొంతెత్తుతున్నాయి. కాగా, తెలంగాణ బీసీల్లోనూ ఆ దిశగా చైత న్యం కనపడుతుండటం ప్రస్తుతించాల్సిందే.

తీన్మార్ మల్లన్న సక్సెస్ అయ్యేనా?

రేవంత్ ప్రభుత్వం చేట్టిన కులగణనలోని లోపాల పట్ల కొందరు బీసీ సంఘాల నాయకులు ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే తప్పుల తడక అని ఆరోపిస్తున్నారు. అధికార పార్టీలోనే ఈ కులగణన పెద్ద చిచ్చు రేపడంతో తీన్మార్ మల్లన్న కా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వివాదాస్పద వ్యక్తిగా ముద్ర పడ్డ తీన్మార్ మల్లన్న ఏ రాజకీయ పార్టీ ప్రయోజనాలను ఆశించి కొత్త పార్టీ ఏర్పాటు చేశారనే సందేహాలు వినిపిస్తున్నాయి. కెసీఆర్ ప్రభుత్వ తీరును విమర్శిస్తూ కాంగ్రెస్ కు దగ్గరై ఎమ్మెల్సీ స్థానం దక్కించుకున్నప్పటికీ ఎంతో కాలం ఆ పార్టీలో కొనసాగలేకపోయారు.

బిసీల కోసం 42 శాతం రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకువచ్చింది. బీసీలకు 42 శాతం కంటే ఎక్కువే రిజర్వేషన్ ఇస్తామని బిజెపి చెబుతోంది. తమది ఫక్తు బీసీల రాజకీయ పార్టీ అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పదే పదే ప్రచారం చేసుకుంటున్నారు. బీసీల ఆత్మ గౌరవం కోసం పాటు పడ్తానని బిఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చెబుతున్నారు.

బిసీల కోసం ప్రత్యేకరాజకీయ పార్టీ పెట్టిన తీన్మార్ మల్లన్న ఎంతవరకు సక్సెస్ అవుతారో వేచి చూడాల్సిందే.స్థానిక సంస్థల ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న పార్టీ పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కవిత ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామా ఒక వేళ ఆమోదం పొందితే నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాాకు ఎన్నిక జరుగనుంది. ఈ ఎన్నికతో బాటు జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోటీ చేయనున్నట్లు ప్రచారంలో ఉంది.

Read More
Next Story