సినీ పరిశ్రమకు అన్ని సౌకర్యాలు
x

సినీ పరిశ్రమకు అన్ని సౌకర్యాలు

భారత్ ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు


సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అడుగులో సహకారం అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి భరోసా ఇచ్చారు. వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తామన్నారు. స్క్రిప్ట్‌తో వస్తే సినిమా పూర్తి చేసుకుని వెళ్లే విధంగా అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తామని సినీ పరిశ్రమ పెద్దలకు చెప్పారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 రెండో రోజున సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖలతో రేవంత్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి పలు కీలక హామీ ఇచ్చారు. తెలంగాణలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025 రెండో రోజున “సృజనాత్మక శతాబ్దం – వినోద రంగం భవిష్యత్తు” అన్న అంశంపై జరిగిన చర్చల్లో చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రముఖ నటులు చిరంజీవితో పాటు రితేష్ దేశ్‌ముఖ్, సుభాష్ ఘాయ్, అల్లు అరవింద్, సురేష్ బాబు, నటులు జెనీలియా దేశ్‌ముఖ్, అక్కినేని అమల, అనిరుధ్ రాయ్ చౌదరి, శ్యాం ప్రసాద్ రెడ్డి, జోయా అక్తర్, చుంకీ పాండేతో పాటు పలువురు టాలీవుడ్, బాలీవుడ్ రంగానికి చెందిన ప్రముఖులు ఉన్నారు.

స్క్రిప్ట్ తో వస్తే సినిమా పూర్తి చేసుకుని వెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం సినిమా పరిశ్రమను ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉందని, అందుకు అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయని వారితో ముఖ్యమంత్రి చెప్పారు. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో సినిమా పరిశ్రమకు సంబంధించిన 24 క్రాఫ్ట్స్ లో పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందించే అంశాన్ని పరిశీలించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు.

Read More
Next Story