ట్రాఫిక్ ఉల్లంఘనులపై కొరడా, 6,916 మంది డ్రైవింగ్ లైసెన్స్‌ల రద్దు
తెలంగాణలో రోడ్డు భద్రత ప్రశ్నార్థకంగా మారింది.రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండటంతో అధికారులు, పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కొరడా ఝళిపిస్తున్నారు.
మద్యం తాగి వాహనాలు నడపడం,త్రిబుల్ రైడింగ్,రాంగ్ రూట్లో వాహనాలను నడపడం, అతివేగం, టీనేజర్లు ట్రాఫిక్ ఉల్లంఘించి వాహనాలు నడపటం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల పలు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. 91 శాతం రోడ్డు ప్రమాదాలకు అతివేగమే కారణమని తేలింది. హెల్మెట్, సీటు బెల్టు ధరించక పోవడం కూడా ప్రమాదాల్లో ఎక్కువమంది మరణిస్తున్నారని వెల్లడైంది.
- తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే 8 వస్థానంలో నిలిచింది.తెలంగాణలో సగటున రోజుకు 56 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసుల రికార్డులు చెబుతున్నాయి.
- గత ఏడాది 20,699 రోడ్డు ప్రమాదాల్లో 6,788 మంది మృత్యువాత పడ్డారు.రోడ్డు ప్రమాదాల పాటు మృతుల సంఖ్య ఏటేటా పెరుగుతూ ఉన్నాయి. 2021 వ సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 6,690 మంది మరణించారు.2022లో 7,500 మంది రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు.
- తెలంగాణ రోడ్లపై 200 కు పైగా బ్లాక్ స్పాట్లు ఉన్నాయని పోలీసులే గుర్తించారు. అధికంగా ప్రమాదాలు జరిగిన రోడ్లను పోలీసులు గుర్తించారు. అతివేగం,రోడ్డు నిర్మాణ లోపం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
వరుస రోడ్డు ప్రమాదాలు
తెలంగాణలో వరుస రోడ్డు ప్రమాదాలు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. సెప్టెంబరు 18వతేదీ ఒకే రోజు వేర్వేరు ప్రమాదాల్లో అయిదుగురు మరణించారు. పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన వెంకటేష్ బైక్ పై మరో ఇద్దరిని ఎక్కించుకొని వెళుతుండగా లారీ ఢీకొట్టింది. కింద పడ్డ వెంకటేష్, రమేష్ మరణించారు.నాచారం హెచ్ఎంటీ కాలనీలో స్కూటీపై వెళుతున్న యువతిని గ్యాస్ సిలిండర్ల లారీ ఢీకొట్టడంతో మరణించింది. మేడ్చల్ లో యాక్టివాపై వెళుతున్న భార్యభర్తలను రెడీమిక్స్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్య మరణించగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.
రోజుకు 20 మంది మృతి
తెలంగాణ రాష్ట్రంలో రోడ్డుప్రమాదాల్లో రోజుకు సగటున 20 మంది మరణిస్తున్నారని పోలీసుల రికార్డులే చెబుతున్నాయి. గత ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో 21,745 మంది పురుషులు, 13,308 మంది మహిళలు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ సగటున 20 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తుండటం దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. బాధితుల్లో ఎక్కువ మంది 25నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు కావడం విశేషం.
ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే...
దేశంలో కేంద్ర ప్రభుత్వం రోడ్డు భద్రతపై కొత్త నిబంధనలను అమలు చేసింది.2021వ సంవత్సరంలో దేశంలో 4,03,116 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 1,55,622 మంది మరణించారు. రోడ్డు ప్రమాదాల్లో 44.5శాతం మంది ద్విచక్రవాహనచోదకులు ప్రమాదాల పడుతున్నారని వెల్లడైంది.ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31 వతేదీ వరకు కేవలం 5 నెలల్లోనే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మోటారు వాహనాల చట్టం 1988 అనుగుణంగా డ్రంక్ అండ్ డ్రైవ్, సిగ్నల్ జంపింగ్ చేసిన వారు, ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన 6,936 మంది డ్రైవింగ్ లైసెన్సులను తెలంగాణ రవాణ శాఖ రద్దు చేసింది. అమెరికా దేశంతో పాటు పలు విదేశాల్లో రవాణ శాఖ నిబంధనలను ఉల్లంఘిస్తే వారి డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేయడంతో పాటు కఠిన శిక్షలు విధిస్తారు.
మందుబాబుల డ్రైవింగ్ ...ప్రమాదాలకు ముప్పు
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మద్యం తాగి వాహనాలు నడపడంపై దూకుడుగా వ్యవహరిస్తున్నారు.ఇటీవల నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో 4,056 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు. ఆగస్ట్ 12వతేదీ ఒక్కరోజే 65 మంది మద్యం తాగి వాహనం నడిపినందుకు జైలు శిక్ష విధించారు.మందుబాబులకు కోర్టులు కూడా కఠినమైన శిక్షలు విధిస్తున్నాయి. ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ డ్రైవింగ్ కు పాల్పడిన వారి నుంచి రూ.76,43,700 జరిమానా వసూలు చేశారు.
రాంగ్-సైడ్ డ్రైవింగ్
రాంగ్-సైడ్ డ్రైవింగ్‌కు వ్యతిరేకంగా ట్రాఫిక్ పోలీసులు ప్రచారం చేస్తున్నా, కొందరికి ఇది అలవాటుగా మారింది. దీనివల్ల అధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఏడాది కాలంలోనే 8 మంది ప్రాణాలు కోల్పోగా, రాంగ్ సైడ్ డ్రైవింగ్ కారణంగా 150 మంది గాయపడ్డారు.ఆగస్ట్ 7వతేదీన ట్రాపిక్ పోలీసులు రాంగ్ సైడ్ డ్రైవింగ్‌పై దృష్టి సారించారు. ఈ స్పెషల్ డ్రైవ్ ఫలితంగా 659 ద్విచక్ర వాహనాలు, 21 మూడు చక్రాల వాహనాలు, 8 నాలుగు చక్రాల వాహనాలతో కలిపి 688 కేసులు నమోదు చేశారు.
రోడ్డు భద్రతకు ప్రాధాన్యం, ప్రమాదాల నివారణకు చర్యలు : మంత్రి పొన్నం
తెలంగాణలో రోడ్డు భద్రతపై కఠినంగా వ్యవహరిస్తామని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.కేంద్ర రవాణ చట్టం 1988 ప్రకారం సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. వాహనాల తనిఖీలు చేస్తూ ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు.రోడ్ సేఫ్టీ క్లబ్బులు, జిల్లా రోడ్ సేఫ్టీ బ్యూరోలు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.స్పీడ్ గన్స్, బ్రీత్ అనలైజర్స్ సాయంతో తనిఖీలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని మూడు లక్షల మంది కళాశాల విద్యార్థులను నెలకు ఒకరోజు గంట సేపు రోడ్డు భద్రతకు ట్రాఫిక్ వాలంటీర్లుగా సేవలందించేలా పోలీసు, రవాణ శాఖ ప్రణాళిక రూపొందించిందని మంత్రి వివరించారు.
Next Story