అగ్రియూనివర్శిటీ వైస్ చాన్స్ లర్ జానయ్య మీద తిరుగుబాటు
x

అగ్రియూనివర్శిటీ వైస్ చాన్స్ లర్ జానయ్య మీద తిరుగుబాటు

నిరసనలతో అట్టుడికిన ప్రొఫెసర్ జైశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం క్యాంపస్


ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిరసన జ్వాలలు రగిలాయి. ఉపకులపతి, రిజిస్ట్రార్‌ల కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా వ్యవసాయ శాస్త్రవేత్తల సంఘం నిరసన వ్యక్తం చేసింది. వర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్ జానయ్యపై తిరుగుబాటు మొదలైంది. వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన ఉద్యోగులకు మెమోలు అందించడాన్ని వాళ్లు వ్యతిరేకించారు. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి వినూత్నంగా నిరసన తెలిపారు.

ఈ క్రమంలోనే హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని అగ్రివర్సిటీ పరిపాలన కార్యాలయంతో పాటు రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ, ఫుడ్ టెక్నాలజీ, కళాశాలలు, పాలిటెక్నిక్‌లు, పరిశోధన కేంద్రాలు, కేవీకేల దగ్గర ధర్నాలు చేశారు. కొంత కాలంగా శాస్త్రవేత్తలు, అధ్యాపకులపై వర్సిటీ యాజమాన్యం తీవ్ర ఒత్తిడి తెస్తోందని సంఘం నాయకులు చెప్పారు. వర్సిటీ యాజమాన్యం ఇటీవల తీసుకొచ్చిన ట్రాన్స్‌ఫర్ పాలసీలో పారదర్శకత లోపించిందని, వారి వైఖరి వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు పేర్కొన్నారు.

వర్సిటీ యాజమాన్యం ఉద్యోగులకు ట్రాన్స్‌ఫర్ ట్రావెలింగ్ అలెవెన్స్‌లు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిందని తెలిపారు. ఇటీవల జరిగిన ప్రమోషన్స్‌లో కూడా తీవ్ర అన్యాయం జరిగిందని, సీఏఎస్ స్కోర్ కార్డు ఇందుకు కారణమని వివరించారు. ఆ స్కోర్ కార్డ్ వల్ల రానున్న రోజుల్లో ఉద్యోగుల ప్రమోషన్లు కలగానే మిగిలే అవకాశం అధికంగా ఉందని ఉపాధ్యాయులు వివరించారు.

పీజీ అర్హతతో ఉద్యోగాలలో చేరిన వారికి ఇన్ సర్వీస్ కోటాలో పీహెచ్ఎ ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేశారన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల తరహాలోనే వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న టీచింగ్ ఉద్యోగులకు రిటర్మెంట్ వయస్సు 65 సంవత్సరాలకు పెంచాలని కోరారు. ఇదే అంశాన్ని యాజమాన్యానికి చెప్పినా దానిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి వర్సిటీ యాజమాన్యం చొరవ తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈనెల 20వ తేదీన టీచింగ్ అసోసియేషన్ తరపున టాసా ఆధ్వర్యంలో వర్సిటీ రిజిస్ట్రార్కు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. కానీ అందులో టీచింగ్ ఉద్యోగులను రిజిస్ట్రార్ ఫోర్ట్ క్లాస్ ఎంప్లాయీస్ అంటూ అభివర్ణించడం, అవహేళన చేస్తూ మాట్లాడడం ఉద్యోగులను తీవ్ర మనస్థాపానికి గురి చేసిందని వివరించారు.

ఈ నెల 20న వాటర్ టెక్నా లజీ సెంటర్ ఆడిటోరియంలో శిక్షణ కార్యక్రమం జరిగింది. ఆ సందర్భంగా టాసా ప్రతినిధులు ఉపకులపతి అల్దాస్ జానయ్య, రిజిస్ట్రార్ విద్యాసాగర్ను కలిసి తమకు పదోన్నతులు కల్పించాలని కోరుతూ వినతిపత్రాలు ఇచ్చారు. శిక్షణకు హాజరుకాకుండా వినతిపత్రం ఇచ్చారంటూ వర్సిటీ పాల కమండలి వారిపై విచారణ జరపాలని నిర్ణయించింది. ఆ మేరకు అదే అదునుగా తీసుకున్న యాజమాన్యం 13 మంది టీచింగ్ ఉద్యోగు లకు మెమోలు జారీ చేసిందన్నారు. ఈనెల 26న ఎంక్వయిరీ కమిటీ ముందు హాజరు కావాలని ఆదేశించారని తెలిపారు. వర్సిటీ తన చర్యలతో అధ్యాపకుల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. వర్సిటీ యాజమాన్యం టీచింగ్ ఉద్యోగుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కార మార్గాలను ఆలోచించాలని కోరారు. లేనిపక్షంలో తదుపరి కార్యచరణ ప్రకటించి రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు.

ఈ అంశంపై టాసా ప్రతినిధుల నిరసనపై అగ్రివర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య స్పందించారు. ‘‘యువ శాస్త్రవేత్తలకు సాంకేతిక శిక్షణ తరగతులు నిర్వహిస్తుండగా సంబంధం లేని వ్యక్తులు వారిని బయటికి తీసుకొని వచ్చి మమ్మల్ని కలిశారు. శిక్షణకు శాస్త్రవేత్తల గైర్హాజ రీపై కేంద్రం డైరెక్టర్ ఫిర్యాదుతో వారి వివరణ కోరాం. ఇప్పటికే స్కోర్కార్డును ప్రామాణికంగా తీసుకొని 92 శాతం మందికి పదోన్నతులు ఇచ్చాం. మిగిలిన 8 శాతం మంది అర్హత సాధించాక వారికి అవకాశం ఇస్తాం’’ అని పేర్కొన్నారు.

Read More
Next Story