ఉద్యోగాల చిట్టా.. విప్పితే వివాదాల పుట్ట..
x

ఉద్యోగాల చిట్టా.. విప్పితే వివాదాల పుట్ట..

కొన్ని విషయాలు వింటే చాలు కొంతమంది గుండె ఆగినట్లు అవుతుంది. ఏళ్లకు ఏళ్లు ఒకే లక్ష్యంపై ఆశ పెట్టుకుని, అదే జీవితంగా బతుకుతున్న కొంతమంది విద్యార్థులకు..


తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేసిన గ్రూప్-1 రీ నోటిఫికేషన్ పై మరోసారి హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. యాదాద్రి, వికారాబాద్, హనుమకొండ, వరంగల్ జిల్లాలకు చెందిన జి. దామోదర్ రెడ్డి మరో ఐదుగురు వ్యక్తులు పిటిషన్లు వేశారు. 2022 లో ఏప్రిల్ 26న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 503 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిని రద్దు చేసిన కమిషన్ తరువాత అదనంగా మరో 60 పోస్టులు జత చేసి 2024, ఫిబ్రవరిలో 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే పిటిషన్ దారులు ఈ నోటిఫికేషన్ చెల్లదంటూ హైకోర్టును ఆశ్రయించారు.

పాత నోటిఫికేషన్ రద్దు చేయడం చెల్లదని, అంతకుముందు కేసు విచారించిన న్యాయస్థానం కేవలం ప్రిలిమ్స్ ను రద్దు చేయమని ఆదేశించిందని, కానీ కమిషన్ ఇందుకు విరుద్ధంగా పూర్తిగా నోటిఫికేషన్ రద్దు చేసిందని పిటిషనర్ల తరఫున న్యాయవాదీ జొన్నల గడ్డ సుధీర్ వాదించారు. ఇది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని , కమిషన్ కు నోటిఫికేషన్ ను రద్దు చేసే అధికారం లేదని న్యాయస్థానం ముందుకు తీసుకొచ్చారు.

ప్రభుత్వ ఆదేశాలు ఉంటేనే కమిషన్ నోటిఫికేషన్ రద్దు చేయాలన్నారు. పాత అభ్యర్థులకే నోటిఫికేషన్ పరిమితం చేయాలని కోరారు. అలాగే ఎస్టీ రిజర్వేషన్ 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడం కూడా రాజ్యాంగ విరుద్దమని వాదించారు. అయితే ఈ వాదనలు సరికాదని టీజీపీఎస్సీ రాజ్యాంగబద్ద సంస్థ అని దానికి స్వతంత్ర్య ప్రతిపత్తి ఉందని ప్రభుత్వ వకీల్ రాహుల్ రెడ్డి వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ పుల్ల కార్తీక్ విచారణను ఈ నెల 30 కి వాయిదా వేశారు.

వచ్చే నెలలో మెయిన్స్ పరీక్ష..

ఈ అక్టోబర్ లో తెలంగాణ గ్రూప్ 1 మెయిన్ పరీక్ష నిర్వహణకు కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. అభ్యర్థులు కూడా కాలంతో పోటీ పడి మరీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు. ఇదే సమయంలో మరోసారి కొంతమంది అభ్యర్థులు హైకోర్టు తలుపు తట్టారు. ఇప్పటికే పరీక్ష రెండు సార్లు రద్దు కావడంతో ఇప్పుడు ఎలాంటి తీర్పు వస్తుందో అని అభ్యర్థులు భయంతో బిగుసుకుపోతున్నారు.

మొయిన్స్ పరీక్ష రాసిన తరువాత కూడా తమ భవిష్యత్ కు గ్యారెంటీ లేదని, 2011 లో లాగా మరోసారి న్యాయస్థానం పరీక్షను రద్దు చేస్తే పరిస్థితి ఏంటని కొంతమంది అభ్యర్థులు మదనపడుతున్నారు. సంవత్సరాలుగా పడిన కష్టం, డబ్బు అంతా వృథా అవుతాయని ఆందోళన చెందుతున్నారు.

‘‘ చదవాలంటే భయంగా ఉంది. అసలు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లలన్నింటిలో ఇదే విధంగా కేసులు నడుస్తున్నాయా? మరీ యూపీఎస్సీ నిర్వహించే ఏ పరీక్షలో కేసులు కావట్లేదు. ప్రభుత్వానికి, కమిషన్ కు కేవలం ఇవి ఒక్క నోటిఫికేషనే కావచ్చు. కానీ ఇది మాకు ఓ లైఫ్, ఇప్పటికే నాలుగు సంవత్సరాల నుంచి కంటిన్యూగా చదువుతూనే ఉన్నాం. ఇప్పుడు మెయిన్స్ పరీక్ష కరెక్ట్ గా పూర్తవుతుందని అనుకుంటున్నాం.. మళ్లీ ఇంతలోనే మరో కేసు దాఖలైంది.. ఏం జరుగుతుందో ’’ అని ఓ ఇనిస్టిట్యూట్ లో రిపెన్షనిస్టుగా పని చేస్తూ గ్రూప్ వన్ కి ప్రిపేర్ అవుతున్న నవ్య( పేరు మార్చాం) అనే అభ్యర్థి తన ఆందోళనను ది ఫెడరల్ తెలంగాణ ముందు వ్యక్తం చేశారు.

సిలబస్ పై ఉన్న శ్రద్ధ... నిర్వహణపై లేదా ?

సిలబస్ మార్చి సివిల్స్ కన్నా ఎక్కువ చేశారు. కానీ సిలబస్ పై ఉన్న శ్రద్ధ పరీక్ష విధానంలో లేదు. చిన్న వివాదం లేకుండా పరీక్ష నిర్వహించలేకపోతున్నారు. ఏ చిన్న అవాంతరం వచ్చిన పరీక్షలను వాయిదా వేస్తున్నారు. గ్రూప్ వన్ పరీక్ష ను మూడో సారి నిర్వహిస్తున్న కమిషన్, నాలుగు సార్లు గ్రూప్ 2 ను వాయిదా వేసింది. గ్రూప్-3 పరీక్ష తేదీని నోటిఫికేషన్ జారీ చేసిన సంవత్సరం తరువాత గానీ ప్రకటించలేదు. అభ్యర్థులకే కాదు.. కమిషన్ తనకే అర్థంకానీ నిబంధనలు విధించుకుని ఒక్కో ఉద్యోగ నోటిఫికేషన్ ను పూర్తి చేయడానికి సంవత్సరాల తరబడి కాలయాపన చేస్తోంది.

పేరుకే కమిషన్ స్వతంత్ర్య సంస్థ కానీ దాని ఆజమాయిషీ మాత్రం ప్రభుత్వ చేతుల్లో ఉంటాయని కండే రమేష్ అనే సామాజిక కార్యకర్త అంటున్నారు. ప్రభుత్వ కమిషన్లు, ఇతర సంస్థలు అన్ని రాజకీయ పునరావాసంగా మారిపోయాయని, వారికి అడుగులకు మడుగులు ఒత్తే వారిని అందులో నియమించుకుంటారని అందుకే ఇలాంటి వివాదాలు తలెత్తుతున్నాయని అభిప్రాయపడ్డారు. యూపీఎస్సీలో దశాబ్దాలుగా ఎన్నో పరీక్షలు నిర్వహిస్తున్న నోటిఫికేషన్లు ఆగిపోయిన దాఖలా లేదన్నారు. ప్రభుత్వం కూడా యూపీఎస్సీ విధానాలను మరోసారి అధ్యయనం చేయించి పరీక్షలు నిర్వహించాలని, ఎన్నికల్లో హమీ ఇచ్చినట్లుగా ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ ఉద్యోగాలపై మోజు..

ప్రయివేట్ లో ఉద్యోగాలు ఉన్నా తక్కువ స్థాయి జీతాలు, గంటల తరబడి చాకిరీ చేయించుకుంటారనే భావన. ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి అంశాలతో యువత ప్రభుత్వ ఉద్యోగాలపై విపరీతంగా మోజు పెంచుకుంటున్నారు. అందుకే చిన్న ఉద్యోగం నోటిఫికేషన్ పడినా పీహెచ్ డీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు.

వీఆర్ఓ ఉద్యోగం నోటిఫికేషన్ పడిన సమయంలో లక్షలాది నిరుద్యోగులు పోటీ పడ్డారు. పరీక్ష నిర్వహణ రోజు ఏకంగా బస్సులు సరిపోని పరిస్థితి. ఎక్స్ ప్రెస్ బస్సులపైన అభ్యర్థులు కూర్చుని ప్రయాణించారు. చాలా మంది అభ్యర్థులకు జిల్లాలోని ఒక మూల నుంచి మరో మూల వరకూ ప్రయాణం చేసి పరీక్ష రాశారు.

ఉదాహారణకు అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండల అభ్యర్థులకు ఇదే జిల్లాలోని సిరిసిల్లాలో, మరికొంతమందికి మంథని లో పరీక్ష రాయాల్సి వచ్చింది. గత ఏడాది నిర్వహించిన గ్రూప్ 4 పరీక్షలోనూ ఇదే విధమైన సన్నివేశాలు కనిపించాయి. వరంగల్, హనుమకొండ జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. కానీ యువత, నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగంపై ఉన్నమక్కువను అధికారంలో ఉన్న ప్రభుత్వాలు సరిగా పట్టించుకోవడం లేదని ప్రస్తుత పరిస్థితులు చూస్తే అనుమానం కలుగుతోంది. బహుశా నిజం కూడా కావచ్చు.

‘‘ న్యాయస్థానాల్లో కేసులు పడిన ప్రతిసారి చాలా మంది అభ్యర్థులు మానసిక స్థైర్యం కోల్పోతున్నారని, వారికి ధైర్యం కలిగించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నాం’’ అని హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో ఓ పోటీ పరీక్షల కేంద్రం నిర్వహకుడు చెప్పారు.

ఆయన ది ఫెడరల్ తెలంగాణతో మాట్లాడుతూ.. ‘‘ తాజాగా హైకోర్టులో కేసు పడిందని తెలియగానే రోజువారీ టెస్టులు రాస్తున్న వారి మైండ్ సెట్ లో తేడా వచ్చింది. ఇంతకుముందున్న ఉత్సాహం ఈ రోజు కనిపించలేదు. ఇంకో రెండు మూడు రోజుల వరకూ ఇదే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రెండు మూడు రోజుల పాటు వారు పడే మానసిక వేదన ఎలా ఉంటుందో మనం మాటల్లో చెప్పలేం. ప్రభుత్వం ఇలాంటి న్యాయవివాదాలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని అభిప్రాయపడుతున్నారు.

కమిషన్లు పూర్తిగా సంస్కరించాలి. ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటించడానికి ముందే ఒకటికి రెండు సార్లు అన్ని సరిచూసుకుని నోటిఫికేషన్ ప్రకటించాలి. ఎలాంటి ఒత్తిడిలు ఉన్న పరీక్ష తేదీలు మార్చకూడదు. నోటిఫికేషన్ ప్రకటించిన సంవత్సరంలోపే పరీక్ష నిర్వహించి ఉద్యోగ నియామకాలు పూర్తవ్వాలి. అలా అయితే కమిషన్లపై ప్రజలకు నమ్మకం కలుగుతుంది.

Read More
Next Story