
కాంగ్రెసోళ్లు కమిషన్లు తింటున్నారా? అసెంబ్లీలో రచ్చ...
సభవెలుపల బిఆర్ ఎస్ సభ్యుల ధర్నా
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు నేడు 10వ రోజు అసెంబ్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బిఆర్ ఎస్ ఎమ్మెల్యేల కేటి రామారావు పరస్పర చేసుకున్న వ్యాఖ్యలతో సభ కొద్ది సేపు వేడెక్కింది.
బడ్జెట్ మీద జరుగుతున్న చర్చలో పాల్గోంటూ కేటి రామారావు సచివాలయంలో వినబడుతున్న కమీషన్ ల వ్యవహారం, బిల్లుల కోసం కాంట్రాక్టర్ల చేసిన ధర్నా గురించి ప్రస్తావించారు.
“పనులు కావాలంటే కాంగ్రెస్ నేతలు 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది,” అని కెటి రామారావు అనగనే గలబా మొదలైంది.
“ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి అని మేము అనలేమా? రేవంత్ రెడ్డి రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవి కొనుకున్నాడని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్న మాటలు మేము అనలేమా? 30% కమిషన్లు అని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చెప్పిన మాటలపై చర్యలు తీసుకోవాలి అంటున్నారు. 20 శాతం, 30 శాతం కమిషన్ తీసుకొంటున్నారని ఎమ్మెల్యేలే అంటున్నారు,”– కేటీఆర్ వ్యాఖ్యానించారు.
దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా అధికార పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బిఆర్ ఎస్ సభ్యులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని భట్టి విక్రమార్కహెచ్చరించారు. బిఆర్ ఎస్ సభ్యులు హెచ్చరిక చేయడానికి అభ్యంతరం తెలిపారు. దీనితో కొద్ది సేపు సభలో వాతావరణం వేడెక్కింది. కేటీఆర్ చేసిన ఆరోపణలను నిరూపించాలని లేదంటే సభలో క్షమాపణ చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు.
మరొక వైపు భట్టి విక్రమార్క క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ సభ్యులు పట్టుబట్టారు. వద్దురా నాయనా 20 పర్సంట్ పాలన, ఇది పర్సంటేజ్‌ల పాలన, ఇదేమి ప్రభుత్వం 20 శాతం, 30 శాతం పర్సంటేజీల ప్రభుత్వం అని నినాదాలు చేస్తూ అసెంబ్లీ ఎమ్మెల్యేల ప్రవేశ ద్వారం వద్ద నిరసనకు దిగారు.
భూభారతి మీద వాడి వేడి చర్చ
సభలో ‘భూ భారతి’పై వాడీవేడి చర్చ జరిగింది. భారత రాష్ట్ర సమితి (బిఆర్ ఎస్ ) ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది భూ భారతి కాదని భూ హారతి అనడంతో గొడవ మొదలయింది. జమాబందీ పేరుతో ప్రభుత్వం మరో దుకాణం తెరిచిందని అసలు జమాబందీ ఎందుకో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ఒక్క కలం పోటుతో భూమిపై హక్కులు లేకుండా చేసిన దుర్మార్గమైన చట్టం ధరణి’ అని ఆ చట్టాన్ని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పామని, అలానే చేశాము,’ అని భట్టి అన్నారు. ‘‘దున్నేవాడిదే భూమి అనేది సాయుధ పోరాట నినాదం. ఆ పోరాట స్ఫూర్తితోనే కాంగ్రెస్ ప్రభుత్వం భూములపై హక్కులు కల్పిస్తూ వస్తోంది. అనేక చట్టాలు, పోరాటాల ద్వారా వచ్చిన హక్కులను గతంలో కాలరాశారు. ధరణిని బంగాళాఖాతంలో వేయాలనే ప్రజలకు మాకు అధికారం కట్టబెట్టారు’’ అని భట్టి విక్రమార్క అన్నారు.
భవిష్యత్తులో ఎన్నికలు ‘భూభారతి’పైనే
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో భూభారతిపైనే ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. ‘‘బిఆర్ ఎస్ ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే ఆ పార్టీని ఓడించారు,’’ అని పొంగులేటి చెప్పారు.
హెచ్ సి యు భూముల వేలం వద్దు
రాష్ట్ర బడ్జెట్ పై బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యవస్థ కుదేలైంది అని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని, రైతులకు గ్రామాల్లో అప్పులు ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. ఇండ్ల అమ్మకాలు హైదరాబాద్ లో 40 శాతానికి పైగా పడిపోయాయని రాష్ట్రంలో వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి రోజువారీ కూలీ దొరకడం లేదని, దీనికి రియల్ ఎస్టేట్ పడిపోవడం కారణం అని హరీశ్ బాబు అన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి అప్పులే ప్రధాన ఆదాయంగా మారిపోయాయని, ఈ అప్పులు కూడా సరిపోకపోవడంతో గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీ భూములను వేలం వేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
“ఆ 400 ఎకరాలు మహానగరానికి బ్రీతింగ్ స్సేస్. నగరం మొత్తం కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న క్రమంలో 400 ఎకరాల అటవీ ప్రాంతాన్ని కాపాడుకోవాలని. అందులో వేలాది పక్షులు, నెమళ్ళు, జింకలు, ఉన్నాయని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అందువల్ల గచ్చిబౌలి భూముల అమ్మకంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి,” అన్ని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం డీపీఆర్‌కు ఒకటి నిర్మాణం మరొకటి
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్ఎల్‌బీసీ లో కొనసాగుతోన్న రెస్క్యూ ఆపరేషన్ ప్రకటన చేశారు. ఇప్పటి వరకు రెండు మృతదేహాలను వెలికితీశామని మిగతా డెడ్‌బాడీస్ బయటకు తీసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు.
టనెలో డీ-1, డీ-2 ప్రదేశాల్లో మట్టి తవ్వకాలు, డీ-వాటరింగ్‌ను ప్రక్రియ వేగంగా జరుగుతోందని ప్రమాదం జరిగిన నాటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఎన్‌డీఆర్‌ఎఫ్ , ఎస్‌డీఆర్‌ఎఫ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ, దక్షిణ మధ్య రైల్వే బృందాలు ప్రతికూల పరిస్థితుల్లో 24 గంటల పాటు శ్రమిస్తున్నాయని ఉత్తమ్ చెప్పారు.
అన్ని ప్రాజక్టులు పూర్తి చేస్తాం
ప్రాజెక్టుల నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం : సహాయక చర్యలు పూర్తి అవ్వగానే ఎస్ఎల్‌బీసీతో పాటు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులను పూర్తి చేస్తామని అందుకు ప్రభుత్వం కూడా కట్టుబడి ఉందని కామెంట్ చేశారు. త్వరలోనే తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్ట్ పనులు త్వరలో ప్రారంభించబోతున్నామని ప్రకటించారు. కాళేశ్వరం పై విజిలెన్స్ రిపోర్టు తమకు అందిందని చెబుతూ ప్రాజెక్ట్ డీపీఆర్‌కు చేపట్టిన నిర్మాణానికి పోలిక లేదని అన్నారు. ఈ విషయంలో తాము ఎన్‌డీఎస్ఏ రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నామని వచ్చే రిపోర్టు ఆధారంగానే బాధ్యులపై చర్యలు ఉంటాయని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.