
సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
శాసనసభలో మాటల సమరం తప్పదా?
సోమవారం నుంచి స్టార్ట్ కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రణరంగాన్ని తలపించనున్నాయా? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. తెలంగాణ నదీ జలాల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య భారీగా మాటల యుద్ధం నడుస్తోంది. సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా నదీ జలాల సమస్యలపై ప్రధానంగా చర్చించడానికే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తోంది. దీంతో అసెంబ్లీ.. అధికార ప్రతిపక్షాల వాదనలతో రణరంగాన్ని తలపిస్తుందని తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.
అసెంబ్లీకి కేసీఆర్..
ఈ సమయంలోనే నదీ జలాల సమస్యలపై చర్చించడానికి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అసెంబ్లీకి రానున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల బీఆర్ఎస్ విస్తృత సమావేశం సందర్భంగా నదీ జలాల విషయంలో కాంగ్రెస్ తోలు తీస్తాంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 308 కిలోమీటర్ల మేర కృష్ణా నది ప్రవహిస్తున్నప్పటికీ, సాగునీటి విషయంలో పాలమూరు జిల్లాకు ఒక్క చుక్క నీరు కూడా అందలేదని కేసీఆర్ తెలిపారు. ఈ ప్రాంతానికి ప్రతిపాదించిన ప్రాజెక్టులు కొత్తవి కావని, గతంలోనే నీటి కేటాయింపులు జరిగినవేనని ఆయన స్పష్టం చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకం కొత్త ప్రాజెక్టు కాదని, ట్రిబ్యునల్స్ కూడా ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నాయని గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా పాలమూరు జిల్లా నిర్లక్ష్యానికి గురవుతోందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పాలమూరు జిల్లాకు జరిగిన అన్యాయం కొత్త తరానికి తెలియాలన్న ఉద్దేశంతోనే ఈ విషయాలను ప్రజల ముందుంచుతున్నానని ఆయన తెలిపారు. ఆయన వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజుల్లోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. అప్పటి నుంచి అసెంబ్లీకి కేసీఆర్ కూడా రానున్నారన్న చర్చ తీవ్రతరం అయింది. కేసీఆర్ కూడా వస్తే ఇక అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం భీకరంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
సవాల్‌ను స్వీకరించిన కాంగ్రెస్
తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ విషయంలో భారీ ఆందోళన చేపట్టనున్నట్లు బీఆర్ఎస్ పలుమార్లు ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని ఆరోపించింది. ఇందులో భాగంగానే తెలంగాణ నీటి సమస్యలపై అసెంబ్లీ చర్చ పెట్టాలని అధికార పార్టీకి ఛాలెంజ్ విసిరింది. దానిని స్వీకరించిన కాంగ్రెస్.. నీటి సమస్యలపై ప్రధానంగా చర్చించడానికి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పింది. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయని ప్రకటించింది.
బీఆర్ఎస్ హయాంలోనే అన్యాయం: ఉత్తమ్
తెలంగాణ నదీజలాల సమస్యలపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణకు నది జలాల విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.27 వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ, ఒక్క ఎకరాకు కూడా నీరు అందించలేకపోయారని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖకు మంచి పేరు ఉండేదని, కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల రూపకల్పనను మార్చి, ట్రంక్ లైన్ల పేరుతో భారీగా కమిషన్లు సంపాదించారని ఆరోపించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు కేటాయించిన 299 టీఎంసీల నీటిపై పాలమూరు, నల్గొండ జిల్లాల ప్రాజెక్టుల కోసం అప్పటి సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడూ గట్టిగా డిమాండ్ చేయలేదని ఆరోపించారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు చివరకు మూడు బ్యారేజీలు కూలిపోయే స్థితికి చేరిందని ఆయన మండిపడ్డారు.
ఇప్పటికే కవిత కూడా చెప్పారు..
అయితే బీఆర్ఎస్ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఆరోపించారు. కేసీఆర్‌కు తెలియకుండా చుట్టుపక్కల ఉన్నవారు చాలా మంది చాలా అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. అవన్నీ కూడా జాగృతి జనం బాట కార్యక్రమంలో తెలుస్తున్నాయని చెప్పారు.

