Telangana Assembly|9 నుండి తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు
అధికారపార్టీ అనుకున్నన్ని రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే
ఈనెల 9వ తేదీనుండి తెలంగాణా అసెంబ్లీ శీతాకాల సమవేశాలు మొదలవ్వబోతున్నాయి. సమావేశాలు ఎన్నిరోజులు జరుగుతాయన్న విషయం సభ మొదలైన తర్వాత కాని తెలీదు. సమావేశాలు మొదలైన రోజున స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో జరగబోయే బీఏసీ సమావేశంలో సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలన్న విషయం ఫైనల్ అవుతుంది. మామూలుగా అయితే ప్రభుత్వం చేసే ప్రతిపాదనకు, ప్రతిపక్షాల డిమాండ్లకు ఏమాత్రం పొంతనుండదు. అధికారపార్టీ అనుకున్నన్ని రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. సమావేశాలు మొదలయ్యేరోజు నుండే అధికారపార్టీపై బురదచల్లేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేయటం ఇందులో భాగమే.
ఇపుడు విషయం ఏమిటంటే తొందరలో జరగబోయే తెలంగాణా అసెంబ్లీ (Telangana Assembly Session)సమావేశాలు చాలా వాడిగా వేడిగా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. రైతు రుణమాఫీ, రైతుబంధు, ఉద్యోగాల భర్తీ, లగచర్ల(Lagacharla) భూసేకరణ, దిలావర్ పూర్(Dilawarpur Ethanol Factory) ఇథనాల్ ఫ్యాక్టరీ, ఎంఎల్ఏలు, ఎంఎల్సీల ఫిరాయింపులు, మూసీనది(Musi River) పునరుజ్జీవన ప్రాజెక్టు, హైడ్రా(Hydra) కూల్చివేతల్లాంటి అనేక హాట్ హాట్ అంశాలున్నాయి. పై అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయటానికి, ఇరుకునపెట్టడానికి బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP)లు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇదేసమయంలో ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శలను తిప్పకొట్టడానికి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం కూడా అంతేస్ధాయిలో రెడీ అవుతున్నది. ప్రతిపక్షాలు లేవనెత్తుతాయని అనుకుంటున్న అంశాలను విభజించి సమాధానాలు చెప్పేబాధ్యతలను రేవంత్ కొందరుమంత్రులకు అప్పగించారు.
రేవంత్ చెప్పినట్లే అంశాలవారీగా మంత్రుల బృందాలు అసెంబ్లీ సమావేశాల్లో సమాధానాలు చెప్పటానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాబట్టి సమావేశాలు ఎన్నిరోజులు జరుగుతాయన్న విషయాన్ని పక్కనపెట్టేస్తే జరిగినన్ని రోజులూ సభలో యుద్ధవాతావరణం తప్పదనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మూసీనది పునరుజ్జీవన ప్రాజెక్టు, హైడ్రా, ఉద్యోగాల భర్తీ, లగచర్ల భూసేకరణ, రైతురుణమాఫీ అంశాలను బీఆర్ఎస్, బీజేపీలు జాయింటుగా లేవనెత్తటం ఖాయం. అలాగే దిలావరపూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ, ఎంఎల్ఏలు, ఎంఎల్సీల ఫిరాయింపుల అంశాన్ని బీఆర్ఎస్ ప్రత్యేకంగా లేవనెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంది.
ఏదేమైనా అసెంబ్లీ శీతాకాల సమావేశంలో కేసీఆర్(KCR) పాత్రుంటుందా? ఉండదా అన్నదే సస్పెన్సుగా మారింది. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కేవలం ఒకే ఒక్కరోజు మాత్రమే కేసీఆర్ సభలో కనిపించారు. అసెంబ్లీకి రావాలని రేవంత్ అండ్ కో ఎంతగా డిమాండ్ చేస్తున్నా కేసీఆర్ మాత్రం స్పందించలేదు. మరీసారి ఏమిచేస్తారో చూడాలి.