
'42 % బీసీ రిజర్వేషన్లను రాజకీయం చేయకండి'
కామారెడ్డి డిక్లరేషన్ సంపూర్ణంగా అమలు చేసే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటా: బిసి ఉద్యమ కారుల ప్రతిజ్ఞ
కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో పేర్కొన్న విధంగా విద్య,ఉద్యోగ,రాజకీయాల్లో, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో, పార్టీపరమైన అవకాశాలలో, 42 % రిజర్వేషన్లను ఇస్తామన్న హామీని దాటవేసే దిశగా కొనసాగుతూ,ఈ అంశాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆయుధంగా వాడుకోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నామని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ పేర్కొన్నారు. బీసీ రాజ్యాధికార సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు బండారు పద్మావతి ఆధ్వర్యంలో జరిగిన బీసీ మేధావుల , విద్యావంతుల, ఉద్యమకారుల సమావేశంలో దాసు సురేశ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు ..
బీసీ హక్కుల స్థాపన కోసం పాటుపడుతున్న నాయకులు, మేదావులు,క్షేత్రస్థాయి కార్యకర్తల సమక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేసే అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.తెలంగాణ ప్రభుత్వం 42 % రిజర్వేషన్ల అమలుకు ప్రయత్నాలు ముమ్మరం చేయకుండానే, అసెంబ్లీలో ఆమోదం పొందిన బీసీ బిల్లులకు గవర్నర్ ఆమోదం పొందకుండానే, 42 % రిజర్వేషన్లను పెంచుతూ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకుండానే ఢిల్లీలో ధర్నాలను చేస్తుండటం ప్రభుత్వ నిబద్ధతను శంఖించేలా ఉందన్నారు.
డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాల్సిన 42 శాతం రిజర్వేషన్లను తుంగలో తొక్కి, కేంద్రంపై దుమ్మెత్తటం ఏ మేరకు సమంజసమని తెలిపారు. 5 సంవత్సరాలు బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామన్న కాంగ్రెస్ హామీ, ఇప్పటివరకు కేవలం 20 వేల కోట్లని ప్రతిపాదించి, కనీసం ఐదు కోట్లు కూడా ఖర్చు చేయలేని దయనీయ స్థితిలో ప్రభుత్వం కూరుకుపోయిందన్నారు .
42% రిజర్వేషన్లను బీసీలకు ఇస్తామన్న హామీని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కానీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కానీ,మంత్రివర్గ కూర్పులో గాని,ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపులో గాని, కార్పొరేషన్ల చైర్మన్ నియామకంలో గాని,సి ఎం ఓ నియామకాల్లో గాని ఎక్కడా కనుచూపుమేరకు సైతం కనిపించకపోవడం కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ నీతిని చెప్పకనే చెబుతుందని దుయ్యబట్టారు....!
ఈ ప్రభుత్వంలో బీసీలకు ఎటువంటి ప్రాధాన్యత లేదని కేవలం 42 % బీసీ రిజర్వేషన్ల ప్రచారంతోనే కాలాన్ని వెల్లబుచ్చుతున్నారని దాసు సురేష్ తీవ్రంగా మండిపడ్డారు.
త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించి 42 % రిజర్వేషన్లు అమలును ఎన్నికల నోటిఫికేషన్ లో ప్రకటిస్తే అందుకు అవసరమైన అమలు విషయంలో ఇబ్బందులు ఎదురైతే కేంద్రాన్ని నిలదీయటానికి తాము సైతం అప్పుడు కలిసి వస్తాం అన్నారు.తెలంగాణ రాష్ట్రంలోఅన్ని రాజకీయ పార్టీలను, సామాజిక ఉద్యమ సంఘాలను, కుల సంఘాలను, సరిగ్గా సమన్వయం చేయకుండానే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్తామని ముఖ్యమంత్రి చేసిన అబద్ధపు ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదన్నారు..జరుగుతున్న పరిణామాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లే విధంగా త్వరలోనే తమ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తాం అన్నారు.
ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం, జాతీయ ప్రధాన కార్యదర్శి కోల జనార్దన్ గౌడ్ , ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం, నిరుద్యోగ బీసీ జేఏసీ చైర్మన్ నీలం వెంకటేష్, బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర కార్యదర్శులు ముంజాల రాజేందర్ గౌడ్, పెదకాసు కుమారస్వామి యాదవ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వీరేందర్ గౌడ్, టీడీపీ పార్టీ ఓబీసీ సెల్ ఉపాధ్యక్షులు మంద వెంకటస్వామి, బీసీ రాజ్యాధికార సమితి గ్రేటర్ హైదరాబాద్ నాయకులు తాళ్ళ భాగ్యలక్ష్మి, రామగిరి ప్రకాష్, శారదా, రవి తదితరులు పాల్గొన్నారు..
Next Story